ఫాల్గుణ శుక్ల పూర్ణిమను హోలికా, హోళి కాదాహో అనే నామాలతో పేర్కొంటున్నది స్మృతి కౌస్తుభం. హుతాశనీ పూర్ణిమ, వహ్న్యు త్సవం అని అమాదేర్ జ్యోతిషీ లక్ష్మీనారాయణ వ్రతం, అశోక పూర్ణిమ వ్రతం, శయన దాన వ్రతం చేయాలని పురుషార్ధ చింతామణి, శశాంక పూజ చేయాలని నీలమత పురాణం వివరిస్తున్నాయి. కొన్ని గ్రంథాలు డోలా పూర్ణిమ అని చెపుతున్నాయి. ఈ దినం మను వులలో 10వ వాడైన బ్రహ్మ పుత్రుడైన బ్రహ్మసావర్ణి మన్వంతరాది దినంగా, దక్షిణాదిన ప్రధానంగా కాముని పున్నమగా భావిస్తారు. చలి తగ్గుముఖం పట్టి, ఉక్కపోత ప్రారంభమయ్యే కాలం. అన్ని పంటలు ఇళ్ళకు చేరి, కర్షకుడికి కడుపు నిండా తిండి దండిగా దొరికే రోజులు వస్తున్న వసంతానికి స్వాగతోపచారాలు చేసే సమయం. ఈ పర్వానికి మరోపేరైన హోళి శబ్దం కర్ణతాడితం కావడంతో నాటి కార్యక్రమాలలో ప్రముఖంగా జ్ఞాపకం వచ్చేది “మంటల ఊసు”, వసంతాలాట మాట. తెలుగు వారు దీనిని కాముని పున్నమ అంటారు. కాముడు ఈ దినాన దహన మైనాడని పురాణ కథ. దాక్షిణాత్యులు కామదహన దినంగా, ఔత్తరాహికులు హోళిక దహన దినంగా భావిస్తారు. తార కుడను రాక్షసుడు దేవతలకు సవాలుగా నిలిచి, ఇంద్రుని ఆస్థానం నుండి దేవ వేశ్యలను ఎత్తుకు పోవడం చేస్తుంటాడు. ఎలాగైనా తార కుడిని మట్టుబెట్టాలని, దేవతలు భావిస్తుండగా, దేవతల పురోహితుడు బృహస్పతి, శివ పార్వతులకు పుట్టబోయే కుమార స్వామియే తారక సంహార సమర్ధునిగా చెపుతాడు. గాఢ యోగనిష్ఠలో ఉన్న శివుడికి యోగ భంగం కలిగించేందుకు ఇంద్రుడు సాయం కోరగా, మన్మధుడు అంగీకరిస్తాడు. శివుడు ఉన్న వనంలో పుష్ప బాణుడు ప్రవేశించిన సమయం వసంత కాలం. అక్కడ పార్వతి పూలు సంగ్రహించే సమయంలో కామ దేవుడు బాణం అందుకున్నాడు. అల్లెత్రాడు బిగించాడు. శివుడు కది లాడు. కనురెప్పలు ఎత్తాడు. ఎదురుగా ఉమాదేవి కన్పించింది. ఆయన మనసు చలించింది. కాముడు బాణం వదిలాడు. శివునికి యోగ భ్రష్టత్వం గుర్తుకు వచ్చింది. కోపంతో మూడో కన్ను తెరిచి, మన్మథుడిని చూశాడు. అంతట పుష్ప బాణుడు బూడిద అయినాడు. ప్రియుడు భస్మం కాగా, రతి విలాపానికి అవధులు లేకుండా పోయాయి. శివుడు కరిగి పోయాడు, కనికరించాడు. లోకానికి కాకున్నా రతీదేవికి మన్మథుడు కనిపించేలా చేశాడు. అనంగుడైన భర్తకు రతీదేవి పూజలు ఒనరించింది. ఆ పూజలే క్రమంగా ఆచారాలైనాయి. ఆ నాటి పూజల వల్ల భార్యా భర్తలకు దాంపత్య సుఖం కలుగుతుందనే నమ్మకం ఏర్పడింది. ఇలా పండగా మారింది. కామన దహన దినం కామ దహనోత్సవ దినంగా మారింది. దగ్గుడైన మన్నథుడు ప్రద్యుమ్ముడును, ఇతని కుమారుడు అనిరుద్ధుడు రాక్షస సంహారంకు కారణమైనారు. కనుక కామదహన ఉత్సవ కారణమైంది.
ఇక మరో పురాణ గాథ…
హిరణ్య కశిపుడు విష్ణుద్వేషి కాగా, ఆయన కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తికి పరమ భక్తుడు. ప్రహ్లాదుని మనసును పరిపరి విధాల విష్ణు మూర్తి నుండి మార్చాలని ప్రయత్నించిన హిరణ్య కశిపుడు, అన్ని విధాలా విఫలమై చివరికి ఉక్రోషంతో కన్న కొడుకుకు మరణ దండనను విధించాడు. హిరణ్య కశిపునికి హోళిక అనే చెల్లెలు ఉండేది. ఆమెను అగ్ని దహింప జాలదని ఓ వరం ఉంది.
హోళిక ప్రహ్లాదుని మమకారంతో తన ఒళ్లో కూర్చో పెట్టుకున్నట్లు నటించ గానే, వారిద్దరికీ మంట పెట్టాలని ఓ పన్నాగం పన్నారు. కానీ ఇతరులకు హాని తలపెడితే, హోళికకు ఉన్న వరం పని చేయదనే విషయాన్ని మరచి పోయారు. దాంతో హోళిక వరం బెడిసి కొట్టి, ఆమే అగ్నికి ఆహుతై పోయింది. హోళికా దహనం పేరట జరుపుకొనే ఆ పండుగే హోళీ.