– పార్టీ శ్రేణులకు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పిలుపు
– వరద బాధితులను ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సహాయ కార్యక్రమాల్లో విరి విగా పాల్గొనాలని పార్టీ శ్రేణులను సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పిలు పునిచ్చింది. వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఆదుకోవా లని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాలు, వరదల వల్ల వేలాది ఎకరాల్లో పంటలు నీటిలో మునిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల ప్రాణనష్టంతోపాటు, మూగ జీవాలు చనిపోయాయని వివరించారు. లోతట్టు కాలనీల ఇండ్లలోకి వరదనీరు చేరడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయంతో ప్రజలు వారి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని తెలిపారు. వరంగల్,భదాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, హైదరాబాద్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయని పేర్కొన్నారు. ఇంకా అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నదని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వరద ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనాలని పార్టీ కార్యకర్తలు, శ్రేణులకు ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రేకుల షెడ్లు, గుడిసెలు, పాకల్లో జీవిస్తున్న పేదలు నిరాశ్రయులయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. పంట పొలాలు, రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని వివరించారు. వాటి వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదముందని తెలిపారు. వాటిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. వరదల వల్ల ఇప్పటికే జరిగిన ప్రాణ, ఆస్తినష్టాలను అంచనావేసి నష్టపోయిన వారిని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.