Wednesday, June 29, 2022
HomeLifestyleDevotionalసామాజిక సంస్కర్త పరశు రాముడు.

సామాజిక సంస్కర్త పరశు రాముడు.

భృగు వంశోద్భవుడు, జమదగ్ని మహర్షి కుమారుడు, సహస్ర బాహు డైన కార్త వీర్యార్జునుని సంహరించిన, మహా వీరుడు పరశు రాముడు. తండ్రి ఆజ్ఞానువర్తియై, కన్నతల్లిని హతమార్చి, తిరిగి తండ్రి ఆశీస్సులతో, పునరుజ్జీవితు రాలిగా చేసిన ధర్మవీరుడు. భూ భారాన్ని తగ్గింప, భార్గవ రాముని రూపంలో ఉదయించాడు శ్రీహరి. అనులోమ సంజాతుడు అయి, బ్రాహ్మణుడగు జమదగ్నికి, క్షత్రియురాలగు రేణుకకు జన్మించి బ్రాహ్మణ, క్షత్రియ వివాదాలను గొడ్డలితో తీర్చి, ఆటవికులకు యజ్ఞోపవీత ధారణ గావించి, బ్రాహ్మణులుగా మార్చిన అసామాన్య సామాజిక సంస్కర్త పరశు రాముడు. అంతేకాదు బ్రాహ్మణ పక్షపాతియై, క్షత్రియులను అనేకులను సహకరించిన పరశు రాముడు, “మీరెన్ని దానములు పట్టినను, ఎంతగా కష్టపడిననూ, విద్య వచ్చును గాని, ధనము రాదని, వచ్చిననూ అది నిలువ ఉండదని”, బ్రాహ్మణ కులానికి శాపమిచ్చినట్లుగా కథనం ఉంది. ఆజన్మాంతం క్షత్రియ కులాన్ని నిర్మూలించిన పరశు రాముడు, క్షత్రియుడు అయిన శ్రీరాముని చేతిలో ఓడిపోవడం, శివ ధనుస్సు విరిచి, వివాహితుడై వస్తున్న దశరథ రాముని, ఎదిరించి, భంగ పడడం, విష్ణువు యొక్క ఒక ఒక అవతారం చేత, మరొక అవతారం ఓడింప బడిన సందర్భం ప్రత్యేకం. పరశు రామా! దశరథ రాముడి సందర్శనం అయ్యాక, నీవు శస్త్రం పట్టవద్దు. ఎందుకంటే నీ వైష్ణవ తేజస్సు అతనిలో ప్రవేశిస్తుంది. అది సురకార్యం నిర్వహిస్తుంది(Parashurama jayanthi). అని శంకరుడు పరశు రామునికి లోగడ చెప్పడమే దీనికి కారణం అని పురాణ కథనం.

Parashurama jayanthi
Parashurama jayanthi

విష్ణువు దశావతారాలలో ఆరవది పరశు రామావతారం. పురుషార్ధ చంద్రిక, నిర్ణయ సింధు, గ్రంథాలు అక్షయ తృతీయ “పరశురామ జయంతి” పేర్కొంటున్నాయి. శ్రీకృష్ణుని, శ్రీరాముని జయంతులు, జరుపుకుంటున్న విధంగా, పరశు రామ జయంతిని కూడా జరపాలని శాస్త్ర వచనం. పరశు రాముడు చిన్నతనంలో తన తండ్రి పితామహుడైన భృగు మహర్షి ఆశ్రమానికి వెళ్లగా, ఆ బాలకుని తేజస్సుకు తాళలేక, భృగు మహర్షి కళ్ళు మూసుకొని, ఆ బాలకుని హిమాలయాలకు వెళ్లి తపమాచరించిన మని సూచించాడు. బాలకుని తపస్సుకు, శివుడు ప్రత్యక్షమై, “నీవు ఇంకా చిన్నవాడివి, రౌద్రాస్త్రాలు, భరించే శక్తి నీకు లేదని కొంతకాలం తీర్థయాత్రలు చేయాలని”, హితవు పలికాడు. తీర్థయాత్రలు పూర్తిచేసుకుని, తిరిగి తపస్సు ప్రారంభించగా, ఆ సమయంలో రాక్షస బాధలు తాళలేక, ఇంద్రాది దేవతలు శివుని శరణు వేడగా, భార్గవ రామునికి, పరమ శివుడు, “పరశువు” అనే గండ్రగొడ్డలి ఇచ్చి రాక్షసుల పైకి పంపడం చేత పరుశురామ నామాంకితుడైనాడు. అలా స్వర్గంలో రాక్షసులను లేకుండా చేశాడు. ఓ సందర్భంలో పరశు రాముడు, శివుని దర్శించబోగా ద్వారం వద్ద వినాయకుడు అడ్డగించాడు. కోపంతో పరశు రాముడు తన పరశువును విసిరేశాడు. తన తండ్రి శివుని ప్రసాదమైన పరశువుపై గౌరవంతో వినాయకుడు ఆ పరశువుతో తన దంతం విరిగేలా సమర్పించు కొన్నాడు.

Parashurama jayanthi
Parashurama jayanthi

ఒకనాడు తల్లి రేణుక, నీళ్ళు తేవడానికి ఏటికి వెళ్లి అక్కడ చిత్రరథుడనే, గంధర్వ రాజు కుమారుడు, తన భార్యతో జలవిహారం చేయడాన్ని చూసి, తనకు అలాంటి అదృష్టం లేదని చింతిస్తూ, ఆశ్రమానికి ఆలస్యంగా వెళ్ళింది. ఆమె ఆలస్యానికి కారణం తెలుసుకున్న జమదగ్ని, కళంకితయైన, తల్లిని ఖండించాలి అని కుమారులను కోరాడు. ముగ్గురు మొదటివారు ఒప్పుకోని స్థితిలో, నాలుగవ వాడైన పరశురాముడు తండ్రి ఆజ్ఞను శిరసా వహించి, ఆమెను ఖండించాడు. అప్పుడు తండ్రి, పరశురాముని ఏదైనా వరం కోరుకోమనగా, తనకు మాతృ భిక్ష పెట్టమని ప్రార్థించాడు. అలా రేణుక పునరుజ్జీవితురాలు అయింది. తండ్రి ఆశ్రమంలో లేని సమయాన కార్తవీర్యార్జునుడు అనే రాజు కామధేనువు “సురభి” ని బలవంతంగా తీసుకు పోగా, పరశురాముడు, ఆ రాజును హతమార్చి, తిరిగి తెచ్చాడు. అందుకు పగబట్టిన కార్తవీర్యార్జునుని కుమారులు, జమదగ్నిని హత మార్చగా, తిరిగివచ్చిన పరశు రాముడు, విషయం తెలుసుకుని, వారి మీదికి దండెత్తి, గర్భస్థ పిండాలను కూడా వదలక చంపాడు. వారి నెత్తుటితో పితృ తర్పణం గావించాడు. పరశు రాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియ వంశాలను నాశనం చేశాడు. శ్యమంతక పంచకమనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశు రాముడు తల్లి దండ్రులకు తర్పణం అర్పించాడు(Parashurama jayanthi).

ఇలా అందరినీ హతమార్చడం చేత భూమి అంతా పరశురాముని వశం అయింది. యజ్ఞం చేసి భూమి అంతయు బ్రాహ్మణులకు దానం చేశాడు. అశ్వమేధయాగం చేసి ఆ భూమిని కశ్యపుడికి దానంగా ఇచ్చాడు. అప్పటి నుండి భూమికి ‘కశ్యపి’ అనే పేరు వచ్చింది. దానం ఇచ్చిన నేలపై ఉండ కూడదని, బ్రాహ్మణులు అనగా… పరశు రాముడు సముద్రం వద్దకు వెళ్లి, తన సృవమును, సముద్రం లోనికి విసిరి వేయగా, రెండు యోజనాల దూరంలో పడగా, సముద్రుడు ఆ ప్రదేశం నుండి ఉపసంహరించు కున్నాడు. దానినే కొత్తగా ఏర్పడిన “మలబారు” ప్రాంతంగా చెబుతారు. అక్కడే పరశు రాముడు నివసించగా, ఆయన ఉన్న చోట కరువు ఉండదని, వజ్రోత్సవ చంద్రికలో పేర్కొన బడింది.

“అబ్రహ్మణ్యే తథా దేశే కైవర్తాన్ ప్రేక్ష భార్గవ: స్థావయిత్వా స్వకీయే సక్షేత్రే విప్రాన్ ప్రకల్పితాన్”..స్కంధ పురాణం ఆధారంగా, కశ్యప బ్రాహ్మణునిచే వెడల కొట్టబడిన వాడైన పరశు రాముడు, సహ్యాద్రి పర్వత ప్రాంతమందు నివసించి, అక్కడి ఆటవికమైన కొండ జాతి వారికి జంధ్యములు వేసి బ్రాహ్మణులుగా మార్చినట్లు వివరించ బడింది. పరశు రాముడు ‘కైవర్తా’ ఆటవికులను బ్రాహ్మణులుగా గుర్తించడం వల్లనే కాబోలు – కొన్ని జాతుల వారికి ‘రేణుకాదేవి’ యిలవేల్పయినది

రామ కిష్టయ్య సంగన భట్ల... 9440595494
రామ కిష్టయ్య సంగన భట్ల… 9440595494
RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments