పందిళ్ళ శేఖర్‌బాబు (ఆగష్టు 15, 1961 – ఏప్రిల్ 24, 2015) రంగస్థల (పౌరాణిక) నటుడు, దర్శకుడు, నిర్వాహకుడు. ఆయన 1961, ఆగష్టు 15 వ తేదీన వరంగల్ జిల్లా, ధర్మసాగర్లో రాజయ్యశాస్త్రి, సుచేత దంపతులకు జన్మించారు. బాల్యమంతా ధర్మసాగరంలోనే గడించింది. హనుమకొండలో ఇంటర్మీడియట్ చదివారు. అనంతరం దేవాదాయ ధర్మదాయ శాఖలో ఉద్యోగిగా చేరడం, కార్యనిర్వహణధికారిగా ఉన్నతస్థానం సాధించడం అన్ని వరంగల్ లోనే జరిగాయి. అంతటితో ఆగకుండా కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ చదివి, ఆ తరువాత ఎల్.ఎల్.బి. చేశారు(Pandilla Shekarbabu).
పందిళ్ళ శేఖర్‌బాబు తన 12వ ఏట 1973లో ఆత్మహత్య సాంఘిక నాటికలో సన్యాసి రాజు పాత్రతో రంగ ప్రవేశం చేసారు. తొలి ప్రయత్నంలోనే బహుమతుల (ద్వితీయ ఉత్తమ నాటిక, ఉత్తమ నటుడు) ను అందుకున్నారు. నాటక ప్రవేశం సాంఘిక నాటిక ద్వారా జరిగినా ఈయనకు పేరు తెచ్చినవి మాత్రం పౌరాణికాలు. 1997వ సంవత్సరం మార్చి 1న ఈయన పౌరాణిక నాటక రంగంలోకి అడుగు పెట్టారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో, శ్రీకృష్ణ పాత్రలో ప్రేక్షకులను అలరించారు. రవీంద్రభారతి, తెలుగు విశ్వ విద్యాలయం, సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైద్రాబాద్), మహాతి (తిరుపతి), హనుమంతరాయ గ్రంథాలయం, తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల కళావేదిక (విజయవాడ), శ్రీ వేంకటేశ్వర విజ్ఞానకేంద్రం (గుంటూరు) మొదలైన ప్రముఖ వేదికలపై, ఇతర ప్రాంతాల్లో దాదాపు 500 నాటక ప్రదర్శనల్లో నటించారు.

శ్రీకృష్ణ రాయబారంలో శ్రీకృష్ణుడిగా, అర్జునుడిగా, దుర్యోధనుడిగా, శ్రీకృష్ణ తులాభారంలో శ్రీకృష్ణుడిగా, నారదుడిగా, శ్రీరామాంజనేయ యుద్ధంలో శ్రీరాముడిగా, హరిశ్చంద్రలో హరిశ్చంద్రుడిగా,
గయోపాఖ్యానంలో శ్రీకృష్ణుడిగా, అర్జునుడిగా, అక్రూరుడిగా, నారదుడిగా,లవకుశలో రాముడిగా,యయాతిలో యయాతిగా,చింతామణిలో బిల్వ మంగళుడిగా, భవానీ శంకరుడిగా,
బభ్రువాహనలో అర్జునుడిగా, అన్నమయ్యగా నటించారు.
1998లో తెలుగు పద్యాన్ని బ్రతికించండి- పద్యనాటక మనుగడకు సహకరించండి అనే నినాదంతో ‘తెలంగాణా డ్రమెటిక్ అసోసియేషన్’ను స్థాపించారు. ఈ సంస్థ, ఒకవైపు ప్రసిద్ధమైన నాటకాలను ప్రదర్శిస్తూ, మరోకవైపు ఎంతో సమర్థవంతంగా నాటక పోటీలను నిర్వహిస్తూ వచ్చింది. రాష్ట్రంలోని ఎన్నో పట్టణాలలో ఎన్నో ప్రదర్శనల్ని దిగ్విజయంగా ప్రదర్శించి, ప్రేక్షకుల్ని పరవశింప జేసింది తెలంగాణా డ్రమెటిక్ అసోసియేషన్.
2007లో ‘శ్రీకృష్ణరాయబారం’ నాటకానికి ఉత్తమ నటుడు, ఉత్తమ పద్యపఠనం విభాగాలలో రెండు గరుడ అవార్డులు (స్వీయ దర్శకత్వం), 2011లో ‘యయాతి’ నాటకానికి ద్వితీయ ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ నటుడు, ఉత్తమ పాత్రోచిత నటుడు విభాగాలలో మూడు గరుడ అవార్డులు (స్వీయ దర్శకత్వం), 2012లో యయాతి’ నాటకానికి ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీతం విభాగాలలో రెండు గరుడ అవార్డులు, ‘బభ్రువాహన’ పద్య నాటికకు తృతీయ ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ నటి, ఉత్తమ పాత్రోచితనటి విభాగాలలో మూడు గరుడ అవార్డులు లభించడంలో ఆయన కృషి ఎంతో ఉంది.
నటులకు ప్రోత్సాహాన్నిచ్చి, వివిధ పరిషత్తులతోపాటు, ప్రముఖ వేదికలపై నాటకాల నిర్వాహణ, దర్శకత్వ బాధ్యతల నిర్వాహణ గావించారు. 2008 నుండి ‘వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక’ అధ్యక్షునిగా, ప్రతి యేటా క్రమంతప్పకుండా నాటిక పోటీలను నిర్వహించారు. ‘రంగస్థల కళాకారుల క్రెడిట్ సొసైటీ’ని నిర్వహిస్తూ, తద్వారా వచ్చే లాభాలు, వడ్డీల నుండి 50 శాతం ‘ఐక్యవేదిక’కు కేటాయించి, సంస్థకు ఆర్థికంగా పరిపుష్టం గావించారు.
న్యాయ నిర్ణేతగా ఆయన నిర్ణయం
నిష్పాక్షికమైనది. రాగద్వేషాలకు తావీయకుండా, ప్రతిభకు పట్టంకట్టడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే రాష్ట్రంలోని ఎన్నో పరిషత్తులు నాటక పోటీలకు గుణనిర్ణేతగా ఆయయను ఆహ్వానించి గౌరవిస్తున్నాయి. 2008లో రాజమండ్రి లో జరిగిన నంది నాటకోత్సవాలకు పౌరాణిక నాటక విభాగంలో ప్రాథమిక న్యాయ నిర్ణేతగా 2009, 2011 సంవత్సరంలో అభినయ పరిషత్ వారు నిర్వహించే హనుమ అవార్డుల పోటీల పౌరాణిక నాటక విభాగంలో న్యాయ నిర్ణేతగా, 2012లో రవీంద్రభారతిలో జరిగిన పి.ఎం.కె.ఎం. సాంఘీక నాటకపోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.
శేఖర్ బాబు నిర్విరామ కృషికి, దీక్షాదక్షతలను గుర్తించిన అనేక సంస్థలు ఆయనకు నటశేఖర, పౌరాణిక నట సౌర్వభౌమ, పౌరాణిక విద్వన్మణి, మెగా సిటిజన్, శ్రీపాద నాటక కళాపరిషత్ వారి పురస్కారం, పద్యనాటక కళాధురీణ వంటి బిరుదులనిచ్చి సత్కారం చేశాయి(Pandilla Shekarbabu).
2000 సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీ నుండి 11వ తేదీవరకు 7రోజుల పాటు వరుసగా ఒకే వేదికపై శ్రీకృష్ణ రాయబారం, లవకుశ, సత్య హరిశ్చంద్ర, శ్రీకృష్ణ తులాభారం, చింతామణి, గయో పాఖ్యానం, శ్రీరామాంజనేయ యుద్ధం నాటకాలను ‘పద్య నాటక సప్తాహం’ పేరిట, ఏడు రోజులు వరుసగా ప్రదర్శించి, ప్రధాన పాత్రలను ధరించారు. 2011లో మరలా ‘పద్యనాటక సప్తకం ’ నిర్వహించి స్వీయ దర్శకత్వంలో 7 నాటకాలను, వారానికొకటి చొప్పున ప్రదర్శించి, ప్రధాన పాత్రలు ధరించి, నిర్వాహణ వ్యయం 3 లక్షలు భరించారు. 2012లో తొలి తెలుగు సినీ రచయిత, ‘పరబ్రహ్మ పరమేశ్వర’ ప్రార్థనా గీత రచయిత చందాల కేశవదాసు 136వ జయంతి ఉత్సవం తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం (హైద్రాబాద్) లో నిర్వహించారు.
2010లో అజో-విభో ఫౌండేషన్ వారు వరంగల్ లో నిర్వహించిన, ‘సాహితీమూర్తి పురస్కారం’ డా. నల్లాన్ చక్రవర్తుల రఘునాధ చార్యులకు ప్రదానం చేసిన కార్యక్రమాన్ని కలిసి నిర్వహించారు. అనారోగ్య కారణాల వల్ల హైదరాబాద్ లో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 24, 2015 న మరణించారు.
