తెలుగు కథా సాహిత్యంలో
ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు. అయన తన జీవిత కాలమంతా రచనలతోనే జీవనం సాగించారు. పాలగుమ్మి పద్మరాజు 2915 జూన్ 24న పశ్చిమ గోదావరి జిల్లా, అత్తిలి మండలంలోని తిరుపతిపురంలో జన్మించారు. విద్యాభ్యాసం స్వస్థలంలోనూ, ఇతర ప్రాంతాల లోనూ పూర్తి చేసుకున్న ఆయన 1939వ సంవత్సరం నుండి 1952 వరకు కాకినాడలోని పీ.ఆర్. ప్రభుత్వ కళాశాలలో సైన్సు లెక్చరర్‌గా విధులు నిర్వహించారు.
తన పంతొమ్మిదో యేట నుంచే రచనలు మొదలు పెట్టారు. మొదట ఛందోబద్ధంగా పద్యాలు రాసి తర్వాత వచనంలోకి వచ్చారు. పాలగుమ్మి పద్మరాజు తన సాహిత్య జీవన యానంలో 60 కథలు, ఎనిమిది నవలలు, 30 కవితలు… ఇంకా లెక్కలేనన్ని నాటికలు మరియు నాటకాలను రచించారు. ఆయన రాసిన 60 కథలలో గాలివాన, పడవ ప్రయాణం, ఎదురు చూసిన ముహూర్తం అనే మూడు సంపుటాలుగా వెలువడ్డాయి.
తెలుగు మీద ఎంత పట్టు ఉందో ఇంగ్లిష్ మీద కూడా అంతే అధికారం ఉంది. అందుకే తాను రాసిన కథానికలను తానే ఆంగ్లంలోకి తర్జుమా చేసుకునే వారు. ఆ క్రమంలోనే 1958లో అంతర్జాతీయ కథానికల పోటీలో ‘గాలివాన’ కథ రాసి పంపితే బహుమతి వచ్చింది.
“గాలివాన” తెలుగు కథను ప్రపంచ సాహితీ చరిత్రలో సగౌరవంగా నిలబెట్టిన ఘనత పాలగుమ్మి పద్మరాజుకే చెందుతుంది. ఈ కథను ప్రపంచం లోని అనేక బాషలలోకి అనువదించారంటే ఆ నవల సాహితీ ప్రపంచంలో ఎంతగా పేరు తెచ్చుకుందో అర్థం అవుతుంది. అయన మొదటి కథ “సుబ్బి”. ఎన్నో కథలు రాసినప్పటికీ వాటిలో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చిన కథ “గాలివాన” మాత్రమే. ఈ కథ 1952వ సంవత్సరంలో న్యూయార్క్‌లోని “హెరాల్డ్ ట్రిబ్యూన్”వారు నిర్వహించిన ప్రపంచ కథల పోటీలలో రెండువ బహుమతిని గెలుచుకుంది.
ఈ పోటీలకు మొత్తం 23 దేశాల నుంచి 59 కథలు ఎంపిక కాగా, అందులో భారత దేశం నుంచి మూడు కథలు ఎంపికవగా.. అందులో గాలివాన ఒకటి.
అలా తెలుగు కథను ప్రపంచ సాహితీ చరిత్రలో సగౌరవంగా నిలబెట్టిన ఘనత పాలగుమ్మి పద్మరాజుకే చెందుతుంది. ఈయన రాసిన నవలలో బతికిన కాలేజీ, నల్లరేగడి, రామరాజ్యానికి రహదారి, రెండో అశోకుడి మూన్నాళ్ల పాలన మొదలైన రచనలు ముఖ్యమైనవిగా చెప్పవచ్చు.
ఆయన రాసిన కవితలు, పద్యాలు, పాటలు, కథానికలు, నవలలు. రేడియో నాటకాల గురించి అందరికీ తెలిసినా సినిమా రచనల గురించి చాలా మందికి తెలియదు. సినిమా ప్రవేశం కృష్ణశాస్త్రి ద్వారా జరిగింది. నాటికే దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు సినిమాలకు పాటలు రాస్తున్నారు. బిఎన్‌రెడ్డి సినిమా తీయాలనుకున్న సంగతి తెలిసి పద్మరాజు కు కబురు చేస్తే మద్రాసు వెళ్లారు. 1954వ సంవత్సరంలో ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి, తాను వాహినీ పతాకం కింద నిర్మించిన “బంగారు పాప” అనే చిత్రానికి మాటలు రాయమని పద్మరాజును కోరారు. అప్పటి నుంచి దాదాపు మూడు దశాబ్దాల పాటు అనేక సినిమాలకు కథలు, పాటలు పాలగుమ్మి కలంనుంచి జాలు వారాయి. ‘బంగారుపాప’ సినిమాలో కోటయ్య పాత్ర ఎస్‌వి రంగారావుకు చాలా పేరు వచ్చింది. ‘ఇటువంటి పాత్ర మళ్లీ నాకు దొరకలేదు’ అని ఎన్నోసార్లు చాలామందితో సంబరంగా అనేవారట. ఆ తరవాత ‘రంగుల రాట్నం’ చిత్రానికి కథ మాటలు రాశారు. ఆ కథకు నంది అవార్డు వచ్చింది. రంగుల రాట్నం నటుడు చంద్రమోహన్ పాత్రకు ప్రాణం పోసి, ఆయనను చిత్ర సీమలో నిలబెట్టింది. తర్వాత భావ నారాయణ తీసిన ‘గోపాలుడు భూపాలుడు’ జానపద చిత్రానికి కథ, మాటలు అందించారు. మురారి నిర్మాణంలో వచ్చిన ‘సీతామాలక్ష్మి’ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు. సినిమా అంటే అవగాహన ఉండి పాటలు, మాటలు, కథ, దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, సంగీతం,.. అన్ని శాఖల లోనూ పని చేశారు. దేవుడిచ్చిన భర్త, బికారి రాముడు… చిత్రాలకు దర్శకత్వం వహించారు. మొత్తం 30కి పైగా సినిమాలకు పని చేశారు. ఎడిటింగ్, ప్రాసెసింగ్, బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ దాకా అన్నీ చూసి నేర్చుకున్నారు. శ్రీరాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ సినిమాకు పాటలు రాయడానికి కృష్ణశాస్త్రి రావడం కొంచెం ఆలస్యం అయితే పద్మరాజు తో ఒక పాట రాయించారు, అదే ‘రాకోయీ అనకోని అతిథి’. అంతకు ముందే ‘భక్త ప్రహ్లాద’ చిత్రానికి ‘జననీ వర దాయనీ భవానీ’ అనే గీతం కూడా రచించారు.
దాసరిగారితో చాలా సినిమాలు చేశారు. దాసరి, పద్మరాజు ను ‘మా గురువుగారు’ అనే వారు. దాసరి, పద్మరాజు వద్ద రైటర్‌గా పని చేశారు. దాసరి ఒకేసారి నాలుగైదు సినిమాలు తీయడం వల్ల పద్మరాజు సలహాలను ఎక్కువగా అడిగేవారు.
తరువాత భక్త శబరి, బంగారు పంజరం లాంటి అనేక సినిమాలలో పాలగుమ్మి పనిచేసినా… తన సినిమాలు విమర్శకుల ప్రశంసలు పొందినా, వ్యాపారపరంగా నష్టాలను చవి చూశాయి. పాలగుమ్మి దర్శకుడిగా “బికారి రాముడు” అనే సినిమాను తీసినా అది కూడా విజయవంతం కాలేదు.
ఆ తరువాత పాలగుమ్మి నవల “నల్లరేగడి”ని “మాఊరి కథ” అనే పేరుతోనూ, “పడవ ప్రయాణం” అనే కథను “స్త్రీ” పేరు తోనూ సినిమాలు తీశారు. సాహితీ వినీలాకాశంలో వెలుగులు విరజిమ్ముతూ, ప్రత్యేక గుర్తింపు పొందిన అచ్చ తెలుగు రచయిత పాలగుమ్మి పద్మరాజు 1983 ఫిబ్ర్రవరి 27న మరణించారు.