లోక్ సభ చరిత్రలో, అన్ని రాజకీయ పార్టీల సార్వత్రిక మద్దతుతో, స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన మొదటి వ్యక్తి సంగ్మా. ప్రతిపక్షం నుండి స్పీకర్ పదవిని నిర్వహించిన మొదటి వ్యక్తి, అతి పిన్న వయస్కుడు. పిఎ.సం.గ్మా (1947 సెప్టెంబరు 1 – 2016 మార్చి 4) ఒక ప్రొఫెసర్, న్యాయవాది, జర్నలిస్ట్, సీనియర్ రాజకీయ నాయకులు. భారత దేశ లోక్ సభా స్పీకరుగా 1096 నుండి 1998 వరకు పనిచేసారు. ఆయన మేఘాలయ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 1988 నుండి 1990 వరకు పని చేసారు. 1996 నుంచి 1998 వరకు లోక్ సభ స్పీకర్ గా వ్యవహరించిన సంగ్మా, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్ పీపీ)కి ఆయన అధ్యక్షుడు కూడా.పి.ఎ.సంగ్మా పూర్తిపేరు పూర్ణో అజితోక్ సంగ్మా. ఆయన 1947, సెప్టెంబరు 1న మేఘాలయ పశ్చిమ గారో పర్వత ప్రాంతంలోని ఛాపతి గ్రామంలో మరక్ సంగ్మా, చింగ్మీ సంగ్మా దంపతులకు జన్మించారు. షిల్లాంగ్ లోని ఆంటోనీ కాలేజీలో బీఏ (హానర్స్) పూర్తిచేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘంలో పని చేశారు. కాలేజీ చదువుల అనంతరం పూర్తికాలం రాజకీయ నేతగా కెరీర్ ప్రారంభించిన సంగ్మా. 1973లో మేఘాలయ యూత్ కాంగ్రెస్ కమిటీకి ఉపాధ్యక్షుడయ్యారు. తర్వాతి ఏడాది ఆ విభాగానికి జనరల్ సెక్రటరీ అయ్యారు. 1975-1980 మధ్య కాలంలో మేఘాలయ పీసీసీ సెక్రటరీగా వ్యవహరించారు. తురా ఎస్టీ నియోజకవర్గం నుంచి 1977లో (6వ లోక్ సభకు) పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన సంగ్మా, ఎంపీగా కొనసాగుతూ, 1996 మే 25 నుంచి 1998 మార్చి 23 వరకు (11వ లోక్ సభకు) లోక్ సభ స్పీకర్ గా వ్యవహరించారు. కేంద్రమంత్రి వర్గంలోనూ పలు శాఖలు నిర్వహించిన సంగ్మా. 1988 నుంచి 1990 వరకు మేఘాలయ ముఖ్యమంత్రిగా పని చేశారు. అటుపై మళ్లీ కేంద్ర పదవులు చేపట్టారు. ఈశాన్య ఎంపీల ఫోరం ఛైర్మన్ గా మరణించే వరకూ ఉన్నారు.కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై 1999లో తిరుగుబాటు బావుటా ఎగరేసిన పీఏ సంగ్మా. శరద్ పవార్, తారీఖ్ అన్వర్ లతో కలిసి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని ఏర్పాటు చేశారు. అయితే 2011లో రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలవాలనుకున్న ఆయన నిర్ణయాన్ని ఎన్సీపీ సమర్థించక పోవడంతో ఆ పార్టీని వీడి సొంతగా నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్ పీపీ)ని స్థాపించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీపై పోటీచేసి ఓటమి పాలయినప్పటికీ గిరిజన నేతగా ఆయన చేసిన రాజకీయ పోరాటం చరిత్రలో నిలుస్తుంది.సుదీర్ఘ రాజకీయ జీవితంలో అజాత శత్రువుగా పేరుపొందిన ఆయన గిరిజనుల అభ్యున్నతి కోసం కృషిచేశారు. సంగ్మాకు భార్య, కుమార్తె అగాథా, కుమారులు కొన్రాడ్, జేమ్స్ సంగ్మాలు ఉన్నారు. ఆయన ముగ్గురు పిల్లలు కూడా రాజకీయ రంగంలో రాణిస్తుండటం గమనార్హం. అగాథా సంగ్మాకు పార్లమెంట్ కు ఎన్నికైన అతిపిన్న వయస్కురాలిగా, తర్వాత కేంద్ర మంత్రిగా రికార్డుఉంది. గుండెపోటుతో ఆయన 2016 మార్చి 4 న ఉదయం ఢిల్లీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.