ముంచెత్తుతోంది…

Date:


– ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు.. తెరుచుకున్న గేట్లు
– ఊళ్ళన్నీ నీటిలోనే .. పల్లెలు జలమయం
– ప్రమాదకరంగా కడెం ప్రాజెక్టు…
– భద్రాద్రి గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక
– తెగిన చెరువులు, కుంటలు.. పలువురు గల్లంతు
– ప్రజలను కాపాడిన రెస్క్యూ టీమ్‌లు
– ఏడాది వాన ఒక్కరోజులో కురిసిందన్న అధికార వర్గాలు
– హైదరాబాద్‌ వాసుల ఆందోళన
– ములుగు జిల్లా వెంకటాపూర్‌లో 65 సెం.మీ వర్షపాతం
సీఎం కేసీఆర్‌ సమీక్ష ఆయా జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం
ఆకాశానికి చిల్లు పడిందా అనేలా వాన కురుస్తోంది.. ఎడతెరిపి లేకుండా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వరదలు ముంచెత్తుతున్నాయి. ఊరు వాడ తేడా లేకుండా ఊళ్లన్నీ చెరువుల్లా మారాయి. చెరువులు, కుంటలు తెగిపోయాయి. ప్రాజెక్టులు ప్రమాదకర స్థాయిలో ఉండటంతో పూర్తి గేట్లను ఎత్తడం వల్ల పరివాహక గ్రామాలను వరద ముంచెత్తింది. జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 108 గ్రామాలు జలమయ్యాయి. గల్లంతైన వారిలో కొంతమంది జాడ కానరాలేదు. పట్టణాలు, కాలనీలు అస్తవ్యస్తంగా మారాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులు ఆందోళనలో ఉన్నారు. ముంపు ప్రాంత ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.. గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

నవతెలంగాణ- విలేకరులు
తెలంగాణలో ఎక్కడ చూసినా వర్షబీభత్సపు ఛాయలు కనిపిస్తున్నాయి.ఇండ్లు కూలిపోయాయి. పంటలు వరదలకు తుడిచిపెట్టుకుపోయాయి. కల్వర్టులు, రోడ్లు తెగిపోయాయి. ఆదిలాబాద్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టు ప్రమాదకర పరిస్థితికి చేరుకుంది. ఖమ్మంలో మున్నేరు నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ టీం సురక్షిత ప్రాంతానికి తరలించింది. విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై నుంచి భారీగా వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలను అధికారులు బంద్‌ చేశారు. భద్రాద్రి వద్ద గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్‌లో పట్టాలపైకి వరద చేరడంతో పలు రైళ్లను నిలిపేశారు. జంపన్నవాగు ప్రాంతంలో చిక్కుకున్న చిరు వ్యాపారులు, వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లిన స్థానికులను ఎన్‌డిఆర్‌ఎస్‌(రెస్క్యూ టీం) బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. వెంకటాపురం మండల కేంద్రంలోని
ముత్యందార జలపాతం సందర్శన కోసం వెళ్లిన 80 మందిని కాపాడారు. వెంకటాపూర్‌లో 24 గంటల్లో 65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారిపై మొరంచపల్లి వాగు సుమారు 15 అడుగుల ఎత్తులో ఉధృతంగా ప్రవహించడంతో గ్రామం జలదిగ్బంధమైంది. సీఎం ఆదేశాలతో ప్రమాదంలో ఉన్నవారిని హెలికాప్టర్‌ ద్వారా తరలించారు. వర్షాలపై సీఎం అధికారులతో సమీక్ష జరిపారు. ఆయా జిల్లాలకు ప్రత్యేక అధి కారులను నియమిస్తూ సీఎస్‌ శాంతికుమారికి ఆదేశాలు జారీ చేశారు.
సురక్షిత ప్రాంతాలకు విద్యార్థులు
కరీంనగర్‌ శివారులోని రేకూర్తి గురుకుల హాస్టల్‌, సైదాపూర్‌ మండలం మోడల్‌స్కూల్‌, రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ కస్తూరిబా పాఠశాల భవనాలు జలదిగ్బంధం కావడంతో పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉమ్మడి కరీంనగర్‌లోని నాలుగు జిల్లాల కలెక్టర్లు ట్రోల్‌ఫ్రీ నెంబర్ల ద్వారా ప్రజలకు సహాయక చర్యలు అందిస్తున్నారు. గన్నేరువరం మండల కేంద్రంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుతో కరీంనగర్‌ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. రుద్రంగి మండల కేంద్రంలో వేములవాడ కోరుట్ల వెళ్లే రహదారిపై నందివాగు ప్రవాహంతో మండల కేంద్రానికి దారులు మూసుకుపోయాయి. వీర్నపల్లి మండలంలో వాగులు పొంగిపొర్లుతుండటంతో 16 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. జగిత్యాల జిలా వెల్గటూర్‌ మండల పరిధిలోని వెల్గటూర్‌ – రాజక్కపల్లి గ్రామాల మధ్య ఉన్న పాలేరు వాగు ఉధృతంగా ప్రవాహిస్తోంది. మెగా కంపెనీకి చెందిన ట్యాంకర్‌ వాగులో చిక్కుకుంది. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండల కేంద్రంలోని శివారు కాలనీల వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
తెరుచుకున్న శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌
నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు, నిజాంసాగర్‌ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. పలు చెరువులకు గండ్లు పడ్డాయి. ఇండ్లు కూలాయి. నందిపేట్‌ మండలంలో చేపలవేటకు వెళ్లి ఒకరు గల్లంతయ్యారు. నిజామాబాద్‌ జిల్లాల్లో 14 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ మహారాష్ట్ర నుంచి భారీగా వరద వస్తుండటంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగా నదులుతో పాటు గ్రామాల సమీపంలోని వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చాయి. తలమడుగు మండలం కోడద్‌- హస్నాపూర్‌ గ్రామాల మద్య ఉన్న వాగు ఉధృతంగా ప్రవహించడంతో అటువైపు గ్రామాలతో పాటు మహారాష్ట్ర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బోథ్‌ మండలం ధనోర(బి) గ్రామ సమీపంలోని వాగు ఉప్పొంగడంతో ఆ గ్రామం జలదిగ్బంధనంలో చిక్కుక్కుంది. ఇంద్రవెల్లి మండలం ముత్నూర్‌ త్రివేణి సంగమం చెరువు మత్తడి పోయడంతో ఆదిలాబాద్‌-ఉట్నూర్‌ ప్రధాన రహదారి తెగిపోయింది. మెదక్‌ జిల్లా హావేలీఘన్‌పూర్‌ చెర్వులో నీట మునిగి నర్సింహులు అనే యువకుడు చనిపోయాడు. పెద్దశంకరంపేటలో స్కూల్‌ భవనం కూలింది.
ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 7.32లక్షల క్యూసెక్కుల వరద ఇన్‌ఫ్లోగా వస్తోంది. అదేస్థాయిలో ప్రాజెక్టు 38గేట్లు ఎత్తి దిగువకు 6.69లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మానేరు నదిపై ఉన్న అప్పర్‌మానేరు డ్యామ్‌ పూర్తిస్థాయిలో నిండి అలుగుదూకుతోంది. మధ్యమానేరు ప్రాజెక్టులోకి 26,700 క్యూసెక్కుల నీరు వస్తోంది. దిగువమానేరు ప్రాజెక్టులోకి మోయ తుమ్మెద నుంచి వరద వస్తుండటంతో ఒక్కరోజులోనే నిండుకుండలా మారింది. యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు మండలకేంద్రంలో పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సిల్క్‌నగర్‌, పెద్దమ్మవాడ, బీసీకాలనీల్లో నీళ్లు చేరాయి. ఈదులవాగు, రత్నాల వాగు, పర్రెకాలువలు పొంగిపొర్లుతున్నాయి. కొలనుపాక గ్రామ సమీపంలో ఉన్న పితమరం వాగు ప్రవాహంతో సిద్దిపేటకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. కేజీవీబీ పాఠశాలను వరదనీరు చుట్టుముట్టడంతో పిల్లలను ఇంటికి పంపించారు. నల్లగొండ జిల్లా కేతెపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టు 8 గేట్లను ఎత్తారు.
వరద బాధిత జిల్లాలకు స్పెషల్‌ అధికారుల నియామకం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు వరద బాధిత జిల్లాలకు ఐఏఎస్‌ అధికారులను స్పెషలాఫీసర్లుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నియమించారు. ఈ మేరకు గురువారం సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌ అశోక్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.
– ములుగు జిల్లా – కృష్ణ ఆదిత్య, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, సభ్య కార్యదర్శి
– భూపాల పల్లి – పి గౌతమ్‌, సెర్ప్‌ సీఈఓ
– నిర్మల్‌ – ముషారఫ్‌ అలీ, ఎక్సయిజ్‌ శాఖ, కమిషనర్‌
– మంచిర్యాల – భారతి హౌలికేరి, మహిళా, శిశు సంక్షేమ శాఖ, స్పెషల్‌ సెక్రెటరీ
– పెద్దపల్లి – సంగీత సత్యనారాయణ
– అసిఫాబాద్‌ – హన్మంత రావు, పంచాయితీరాజ్‌ శాఖ కమిషనర్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

బన్నీ కన్నా ముందు త్రివిక్రమ్ మరో సినిమా?

డివివి దానయ్య నిర్మాతగా ఈ కాంబో ఎప్పుడో సెట్ కావాల్సి...

‘సలార్’ పార్ట్1 లో ఎన్టీఆర్!

ప్ర‌భాస్ క్రేజీ ప్రాజెక్ట్ అయిన స‌లార్ మూవీ ఎప్పుడో రావాల్సింది....

గంటలు గంటలు డెస్క్ ముందు పనిచేస్తుంటారా? అయితే ఇది మీ కోసమే..

గంటలు గంటలు డెస్క్ ముందు పనిచేస్తుంటారా? అయితే ఇది మీ...