అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్ పేరు రాగానే రెండు ప్రధాన అంశాలు గుర్తుకు వస్తాయి. ఒకటి భవనం వెంకట్రామ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి, ఆయన ఆహ్వానంపై హాజరైన, విద్యాభ్యాస సమయంలో ఆయనకు సన్నిహితంగా మెదిలిన ఎన్టీ రామారావుకు ఆ సంఘటనే రాజకీయాల లోకి రావడానికి ప్రేరణగా భావించడం, రెండవది చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి ఇరువురు భవనం మంత్రివర్గంలో పని చేయడం. భవనం వెంకట్రామ్ (జూలై 18, 1931 – ఏప్రిల్ 7, 2002) అని అందరూ పిలిచే భవనం వెంకట్రామిరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 9వ ముఖ్యమంత్రి. ఆయన 1982 ఫిబ్రవరి 24 నుండి సెప్టెంబర్ 20 వరకు ఏడు నెలల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించారు. రాష్ట్ర గత ముఖ్య మంత్రులు నారా చంద్రబాబు నాయుడు, వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆయన మంత్రి వర్గములో కలసి మంత్రులుగా పనిచేశారు.
వెంకట్రామ్ 1931 జూలై 18 న గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం గొల్లపాడు గ్రామంలో జన్మించారు. ఆయన గుంటూరు పట్టణములో న్యాయవాద వృత్తి ప్రాక్టీసు చేసేవారు. రాజకీయాలలో రాకముందు ఆయన పూర్వపు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వములో మంత్రి అయిన కందుల ఓబులరెడ్డి దగ్గర పర్సనల్ అసిస్టెంటుగా పనిచేశారు.
1978లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో విద్యా శాఖా మంత్రిగా చేరి శాసన మండలికి నియమితుడైనారు. వెంకట్రామిరెడ్డి కుల రాజకీయాలకు వ్యతిరేకముగా పేరులోని రెడ్డి వదిలి వేశారు. తరువాత అధికారములోకి వచ్చిన అంజయ్య మంత్రివతంలో కూడా మంత్రిగా కొనసాగారు.
కాంగ్రెస్ అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు కలిగిన వెంకట్రామ్
1982లో కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గ అండతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి తన ఒకనాటి రూం మేట్ అయిన నందమూరి తారక రామారావు ను ఆహ్వానించారు. ఆయన హాజరు కాగా, ఆ సంఘటనే రామారావుకు రాజకీయాలలోకి రావలన్న ఆలోచనకు బీజము పడినదని చెబుతారు. పలనాడు ప్రాంతానికి చెందిన వెంకట్రామ్… నందమూరి తారక రామారావుకు గుంటూరు లోని ఆంధ్రా క్రిస్టియన్ కళాశాల (ఎ.సి.కాలేజి)లో చదివే రోజులలో సన్నిహిత స్నేహితులు. 7 నెలల పాలన తర్వాత ఆయన అధిష్టాన వర్గము కోరిక మేరకు రాజీనామా చేసి కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు మార్గము సుగమము చేశారు.
1982లో దేశములోనే మొదటిదైన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వ విద్యాలయం (ఓపెన్ యూనివర్శిటీ) ను నెలకొల్పడం వెంకట్రామ్ ముఖ్యమంత్రిగా సాధించిన పనులలో ఒకటి. కొంతకాలం రాజకీయ సన్యాసము తరువాత వీ.పీ.సింగ్ నేతృత్వంలో జనతా దళ్ పార్టీలో చేరి, తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. 2000లో రాం విలాస్ పాశ్వాన్, లోక్ జన శక్తి అనే కొత్త పార్టీ పెట్టినప్పుడు ఆయన ఆ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ శాఖ అధ్యక్షుడయ్యారు.
ఆయన సతీమణి భవనం జయప్రద 1967 నుండి 1978 వరకు వినుకొండ నియోజక వర్గం నుండి శాసనసభ సభ్యురాలుగా గెలుపొందారు. ఆమె పి.వి.నరసింహారావు మంత్రివర్గంలో, జలగం వెంగళరావు మంత్రివర్గంలో మంత్రిగా పని చేశారు.
వెంకట్రామ్ 2002 ఏప్రిల్ 7 న 71 సంవత్సరాల వయసులో గుండె పోటుతో హైదరాబాదులోని మహావీర్ ఆసుపత్రిలో మరణించారు.
రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494