5.1 C
New York
Saturday, June 3, 2023
Homespecial Editionఆది శంకరుల అవతారులు నృసింహ భారతి

ఆది శంకరుల అవతారులు నృసింహ భారతి

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి


అద్వైత మత స్థాపనాచార్యులైన ఆది శంకరులు తూర్పున జగన్నాథంలో ‘‘గోవర్ధన మఠం‘‘, పశ్చిమాన ద్వారకలో ‘‘శారదామఠం’’, ఉత్తరాన కేదారంలో ‘‘జ్యోతిర్మఠం’’, దక్షిణాన శృంగేరియందు ‘‘శృంగగిరి మఠం’’ స్థాపించి మత కార్యనిర్వహణార్థం దేశం నలు చెరుగులా సంచరించి, అద్వైత తత్వాన్ని వివరించి, దిగ్విజయ యాత్ర కొనసాగించారు. దుష్టాచారాలను నశింప చేసేందుకై కైలాస నాథుడే ఆది శంకరుని రూపంలో అవతరించారని ‘‘శివన్యాసం’’ స్పష్టపరుస్తున్నది.
‘‘కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహిత:, శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా’’. శ్రౌత, స్మార్త క్రియలను సుప్రతిష్ఠం చేసి, వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి త్రినేత్రుడే స్వయంగా శంకరుల రూపంలో అవతరించారని ‘‘కూర్మపురాణం’’ విశదీకరిస్తున్నది. ఆదిశంకరులు స్థాపించిన శృంగగిరి మఠానికి 1989నుండి తంగిరాల సీతారామ ఆంజనేయులు 36వ పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి కాగా, ఆయన ఉత్తరాధికారిగా కుప్పా వేంకటేశ్వర ప్రసాద శర్మ ‘‘విధుశేఖర భారతీ తీర్థ స్వామి‘‘గా 23వ జనవరి 2015న నియమింప బడి జైత్ర యాత్రలు కొనసాగిస్తున్నారు. కాగా శృంగేరీ మహా సంస్థానానికి 33వ పీఠాధిపతిగా ఉన్న శ్రీసచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ మహాస్వామి శంకరుని అవతారంగా విశ్వవ్యాపిత ప్రశాంసాపాతృలైనారు.
32వ పీఠాధిపతయైన శ్రీనరసింహ భారతి స్వామి (1817నుండి 1879) తమ 60వ ఏట ధ్యానముద్రలో ఉన్న సమయాన, తమ ఉత్తరాధికారి నియామకం చేయాల్సిన సందర్భాన్ని అశరీర వాణి ద్వారా విని, అందుకు తగిన భవిష్యత్ ఆచార్యత్వానికై, ఎన్నో జాతకాలు తెప్పించుకుని, పరిశీలించారు. ఇందుకు 8ఏళ్ళ సమయం తీసుకున్నారు. తగిన వ్యక్తి జాతకాన్ని పొందారు. మైసూరుకు చెంది, శివస్వామి పేరు గలిగిన ఏడు ఏళ్ళ బాలుడిని పిలిపించుకుని, తమ పక్కనే ఆసీనుని గావించుకుని, ఆ బాలుడు ఏమి కావాలని అనుకుంటున్నాడని ప్రశ్నించారు. అప్పుడా బాలుడు సదరు సందర్భోచితంగా, ఉపనిషత్ సూత్రాలకు అనుసరణీయమైన, గురువు మానవ రూపంలోనున్న దైవమని సంస్కృత శివ స్తోత్రం పఠించారు. అలా శివస్వామి సమాధానం జగద్గురువుల ఆనందానికి పాత్రమైంది. 1886లో నృసింహ భారతి స్వామి, శివస్వామిని, ‘‘శ్రీసచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి‘‘గా యోగపట్టానొసంగి, దీక్షాదక్షుల చేశారు. ఎనిమిదేళ్ళ యువ సన్యాసి సుదీర్ఘ సాంప్రదాయ కర్మల సమన్వయ కారణంగా రోజంతా శ్రమించిన అనంతరం, అలసట చెంది, విశ్రాంతి తీసుకొన్నారు. అయితే తమ నిద్రాణ స్థితిలో సర్వోహం సర్వోహం అంటూ నినదించారు. తద్వారా ఆ బాలకుని అంతర్లీనంగా ఉన్న ఆధ్యాత్మిక శక్తి వ్యక్తీకరణకు జగద్గురువులే ఆశ్చర్య చకితులైనారు. అలా జగద్గురు ఆశీస్సులతో సకల విద్యా పారంగులైనారు.
12ఏళ్ళు గురువుతో పర్యటనలకు వెళ్ళి, శృంగేరికి తిరిగి వచ్చి, 1879లో పరమాచార్యులకు దేహ విముక్తి కాగా, శ్రీసచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి శృంగేరీ పీఠాధీశ్వరులైనారు. 1912 మార్చి 20న పరమాచార్య విదేహ ముక్తినొందగా, నరసింహ వనంలో ఖననం చేయబడగా, ఆయన సమాధిపై లింగ ప్రతిష్ఠ జరిగింది. ఏప్రిల్ 7న చంద్రశేఖర భారతీ స్వామి పీఠాధీశులైనారు. ఆది శంకరభగవత్పాదులకు, శివాభివన నృసింహ భారతి స్వామికి అనేక పోలికలున్నాయి. ఈయన కూడా ఆది శంకరులకు వలెనే బాల్యంలో పితృవియోగులైనారు. శివస్వామి తమ సోదరుని ద్వారా ఉపనయన సంస్కారం చేయించబడి, వేదం సంస్కృతాధ్యయనానికి ఉద్యుక్తులైనారు. దేశమంతా తిరిగి జనబాహుళ్యానికి సనాతన ధర్మాన్ని బోధించారు. శృంగేరిలో సద్విద్య సంజీవని పేరున పాఠశాలను స్థాపించి, వేదాలు, సంస్కృతాధ్యయనాలకు ఏర్పాట్లు గావించారు. బెంగళూరులో కళ్యాణ నగరిలో భారతీయ ప్రౌఢ విద్యాభిర్వర్ధిని శాస్త్ర పాఠశాలను నెలకొల్పి, పూర్వ ఉత్తర మీమాంస శాస్త్రాల సాంప్రదాయ అధ్యయన ఏర్పాట్లు చేశారు. ఆది శంకర జన్మస్థలమైన కాలడి పునరుజ్జీవనం గురించి యోచించారు. ఎందరో సన్యాసులు పరమాచార్య వద్ద శిక్షణ పొందారు. విద్యాభ్యాసం చేశారు. ముఖ్యులలో శ్రీవేంకటరమణ సరస్వతి, శ్రీ భారతీ కృష్ణ తీర్థగా మారి గోవర్ధన పీఠాధిపతిగా మారారు. కే.రామచంద్ర అయ్యర్, సిద్ధ శ్రీరామానంద సరస్వతిగా మారారు. సిద్ధ విల్లిమలై శ్రీసచ్చిదానంద జగద్గురువుల వద్ద దీక్ష మొదట స్వీకరించి, అర్ధనారిగా మారి వైర్యాగ్యాన్ని పొంది వానప్రస్తాశ్రమాన్ని స్వీకరించారు. వివిధ దేవాలయాల సందర్శనా సందర్భాలలో జగద్గురు నోట జాలువారిన శ్లోకాలు భక్తి సుధా తరంగిణి సంపుటిగా ప్రచురితాలైనాయి.
హిందువులే కాక, ముస్లింలు, క్రైస్తవులు, ఆయనలో పవిత్రత, స్వచ్ఛత, దైవత్వాలను చూశారు. ఆచార్యునితో సంభాషణ జీవితంలోని కలవరం, సంక్షోభాలను దూరం చేశాయని ట్యూటర్ ఫ్రాజర్ ఒప్పుకున్నారు. జగద్గురువులు ఉత్తమ గుణ సంపన్నులని, ఆకర్షిత వ్యక్తిత్వమని, వేదాంత శాస్త్ర చిక్కుముడులను విప్పడంలో పరిపూర్ణ సాధికారికత కలవారని, ఎందరికో సమస్యల పరిష్కర్తగా వ్యవహరించారని, మతం పేరుతో అనైతిక అనుసరణలను ఖండించి, వైదిక ధర్మాన్ని బోధించిన మహనీయులని ఛార్లెస్ జాన్సన్ పేర్కొన్నారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments