ప్రముఖ వైద్యులు, నిమ్స్ ఆసుపత్రి తొలి డైరెక్టర్, కాకర్ల సుబ్బారావు(Kokarla Subbarao) కన్నుమూశారు. నెల రోజుల క్రితం కిమ్స్ ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందుతూ శుక్రవారం ఈ లోకం వదిలి వెళ్లారు. కాకర్ల పేరొందిన రేడియాలజిస్ట్. నిమ్స్ ఆసుపత్రి ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. వైద్యశాస్త్రంలో ఆయన చేసిన సేవలకుగాను 2000 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చింది.
సుబ్బారావు 1925 జనవరి 25 న, కృష్ణా జిల్లా పెదముత్తేవి గ్రామంలో ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు.
తమ గ్రామంలో పాఠశాల లేనీ కారణాన సుబ్బారావు(Kokarla Subbarao) ఏడవ వరకు ఇంటి వద్దే చదువుకున్నారు. అనంతరం గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలోనున్న చల్లపల్లిలో పాఠశాల చదువు పూర్తి చేశారు. 1937-1944 మధ్యలో బందరు లోని హిందు కళాశాలలో పట్టభద్రుడయ్యారు. ఆయన మొదట ఇంజనీరు కావాలనుకున్నా, విశాఖపట్నం లో ఎంబిబిఎస్ కి సీటు రాగా, తమ వారికి ఎవరికీ తెలియకుండా విశాఖపట్నం వెళ్ళి ఆంధ్ర వైద్య కళాశాలలో వైద్య విద్యలో చేరారు. 1950 లో ఉత్తీర్ణుడయ్యారు. తర్వాత భారత సైన్యంలో పనిచేయాలనుకున్నా, కొన్ని అనారోగ్య సమస్యల వలన అధికారులు అంగీకరించలేదు. 1951 సంవత్సరంలో హౌస్ సర్జన్సీ చేసిన తరువాత వైద్యంలో ఉన్నత విద్య కోసం ప్రత్యేక పారితోషికంతో అమెరికా వెళ్ళి, న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్ పూర్తి చేశారు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ రేడియాలజీలో ఫెలోషిప్ కూడా పూర్తి చేసి, స్వ దేశానికి తిరిగి వచ్చారు.
అమెరికాలో వైద్య పరీక్షలైన అమెరికా రేడియాలజి బోర్డు పరీక్షలలో 1955 సంవత్సరంలో ఉత్తీర్ణులై న్యూయార్క్, బాల్టిమోర్ నగరాలలోని ఆసుపత్రులలో 1954-1956 సంవత్సరం వరకు పనిచేశారు. సుబ్బారావు 1956 సంవత్సరంలో ఇండియా తిరిగి వచ్చి హైదరాబాదు నగరంలో ఉన్న ఉస్మానియా వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరి, అక్కడే ప్రధాన రేడియాలజిస్టుగా పదోన్నతి పొందారు. 1970లో
సుబ్బారావు మళ్ళీ అమెరికా వెళ్ళి,
యునైటెడ్ కింగ్‌డమ్ వారి ఫెల్లో ఆఫ్ రాయల్ కాలేజి ఆఫ్ రేడియాలజిస్టు అనే పట్టా సంపాదించు కొన్నారు.అమెరికా లోని అనేక ఆసుపత్రులలో పనిచేశారు.1986 సంవత్సరంలో నందమూరి తారక రామారావు ప్రవాస ఆంధ్రులకు చేసిన విజ్ఞప్తి మేరపు సుబ్బారావు దేశానికి తిరిగి వచ్చి హైదరాబాదులోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) లో చేరారు. నిమ్స్ ఆసుపత్రి సుబ్బారావు చేరక మునుపు వరకు ఎముకల ఆసుపత్రిగా ప్రసిద్ధి చెందింది. సుబ్బారావు అక్కడ చేరాక అన్ని విభాగాలనూ అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు కార్పోరేటు ఆసుపత్రులకు దీటైన స్థాయికి తీసుకొని వచ్చారు. నిమ్స్ సంస్థ రాష్ట్ర, దేశ వ్యాప్తంగా రోగుల చికిత్సా పరంగా, వైద్య వృత్తి శిక్షణా పరంగా, వైద్య పరిశోధన పరంగా, పేరెన్నిక కలిగిన వైద్య సంస్థగా కృషి చేశారు.
సుబ్బారావు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా మెట్టమెదటి అద్యక్షులు, వ్యవస్థాపకులు.
సుబ్బారావు రేడియాలజిలో అనేక పుస్తకాలు, జర్నల్స్ లో పరిశోధనా వ్యాసాలు వ్రాశారు. దేశ విదేశాలలో వైద్య ఉపన్యాసాలు ఇచ్చాడు. యాభై ఏళ్ల అనుభవంలో అనేక బహుమతులు, సన్మానాలు పొందారు.
సుబ్బారావు వైద్యశాఖకు, మానవాళికి చేసిన సేవకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసి సత్కరించింది. ఇండియా రేడియాలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ వారి అనుబంధ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చార్టరు సుబ్బారావుకు 2001 మార్చి 17న జీవితకాలపు కృషి అవార్డు ప్రదానం చేశారు.
కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2021 ఏప్రిల్ 16 న మరణించారు.
రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494