ఆయన కష్ట జీవుల రాజ్య స్థాపనకు అహర్నిశలు పోరాడిన ఒక రాజీలేని పోరాట యోధుడు. అలుపెరుగని కమ్యూనిస్టు ధీరుడు. కమ్యూనిస్టు ప్రమాణాలను ప్రాణంగా భావించిన ఆదర్శమూర్తి. ప్రజా ఉద్యమాలే ఊపిరిగా జీవించిన ప్రజల మనిషి. అణగారిన వర్గాల పక్షపాతిగా, కష్ట జీవుల రాజ్య స్థాపనకు అహర్నిశలు పోరాడిన నేత. ఆరు సార్లు చట్టసభకు ఎన్నికైన మచ్చలేని ప్రజాప్రతినిధి. కమ్యూనిస్టుగా రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఆ ఆదర్శ నేతనే నర్రా రాఘవరెడ్డి. నర్రా రాఘవ రెడ్డి ప్రజా జీవితం అత్యంత పారదర్శకం. ఆయన అతి సాధారణ జీవితం రాజకీయ నేతలకు ఆదర్శం.
నర్రా రాఘవరెడ్డి ఆదర్శ కమ్యూ నిస్టు, కడు బీదరికంలో పుట్టి, అంతంత మాత్రం చదువుతో జీవ నం కోసం వలసవెళ్లి మిల్లు కార్మికునిగా జీవితం ఆరంభించిన రాఘవరెడ్డి, కమ్యూనిస్టు పార్టీ సభ్యునిగా, కార్యకర్తగా, నేతగా ఎదిగారు. నిరంతరం ప్రజల మధ్య మసలుతూ, వారి సమస్యలను ఆకళింపు చేసుకొని, ఆ అధికా రులు పాలకుల వద్దకు నిర్భయంగా తీసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తుండే చిత్తశుద్ది కలిగిన రాజకీయ నాయకుడు.
సిపిఎం శాసనసభా పక్ష నేతగా పనిచేసిన నర్రా రాఘవరెడ్డి నాల్గవ తరగతి వరకు మాత్రమే విద్యా భ్యాసం చేసినా, బాల్యం నుండే విప్లవ భావజాలాన్ని ఒంటబట్టించు కున్నారు. 1945 ప్రాంతంలో మజ్దూర్ యూనియన్ కమ్యూ నిస్టులో చేరిన నర్రా ఇల్లు విడిచి ముంబయికి వెళ్లి అక్కడ కూలీగా పనిచేస్తు కార్మిక హక్కుల కోసం పోరాడి కార్మిక నేతగా గుర్తింపు సాధించారు.
తల్లి మరణంతో తిరిగి ఏనిమిదేళ్లకు స్వగ్రామానికి చేరుకున్న నర్రా 1950లో సిపిఐ పార్టీ సభ్యుడిగా చేరారు. కళాకారుడిగా, జానపద సంభాషణలు, చతురోక్తులు, సామెతలు, పిట్టకథలతో అనర్గళంగా మాట్లాడే నర్రా మాటలకు గ్రామీణులు ఆకర్షితులై ఆయనను అనుసరించారు. 1950లో సిపిఐ జిల్లా కార్యాలయ కార్యదర్శిగా పనిచేసిన నర్రా 1959లో వచ్చిన పంచాయతీ ఎన్నికల్లో చిట్యాల మండలం శివనేనిగూడెం గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.1964 ఎన్నికల్లో తిరిగి సర్పంచ్‌గా గెలిచిన నర్రా మరోసారి జడ్పీలో ఫైనాన్స్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు.1967లో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా నకిరేకల్ శాసన సభ నుండి సిపిఎం అభ్యర్ధిగా పోటీ చేసిన నర్రా రాఘవరెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధి ఎం.కమలమ్మపై గెలిచి తొలిసారి శాసన సభలో అడుగుపెట్టారు.1972లో జరిగిన ఎన్నికల్లో నకిరేకల్ స్థానం నుండి పోటీచేసిన నర్రా కాంగ్రెస్ అభ్యర్ధి ఎం.కమలమ్మ చేతిలో ఓటమి పాలయి, 1978, 1983, 1985, 1989, 1994 ఎన్నికల్లో వరుసగా ఐదు సార్లు నకిరేకల్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
నర్రా రాఘవరెడ్డి 1924 సంవత్స రంలో చిట్యాల మండలంలోని వట్టిమర్తి గ్రామానికి చెందిన నర్రా కమలమ్మ – రాంరెడ్డిలకు దంపతు లకు జన్మించారు. చిరు ప్రాయం లోనే తల్లి కమలమ్మ మరణించడం, తండ్రి పెంపకానికి దూరమై, పెద నాయన నర్రా వెంకటరామిరెడ్డి వద్ద పెరగడం, వెంకట రామిరెడ్డి చనిపోయాక మళ్లీ కన్న తండ్రి రాంరెడ్డి దగ్గరే ఉండాల్సి రావడం, పరిస్థితుల ప్రభావం వల్ల బతుకు దెరువునెతుకుంటూ ఊరొదిలి బొంబాయికి వలస వెళ్లారు.
బొంబాయిలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని, బట్టల మిల్లులో కార్మికుడుగా చేరారు. కార్మికులకు కనీస హక్కులేని కాలమది. కంపెనీ యాజమాన్యం కార్మికుల కష్టాలు ఆలకించని పరిస్థితులుండేవి. కార్మికుల బాధలు తీర్చడానికి కమ్యూనిస్టు పార్టీకి అనుబంధంగా ‘లాల్‌బావుటా’ బలమైన కార్మిక సంఘంగా పనిచేసేది. అందులో సభ్యుడుగా చేరిన నర్రా చురుకైన పాత్ర పోషించారు. కంపెనీలు మూతపడడం… 8 ఏళ్ల తర్వాత నర్రా తిరిగి సొంత ఊరొచ్చారు. బొంబాయిలో లాల్‌బావుటాలో పనిచేస్తున్న రోజుల్లోనే కమ్యూనిస్టు సిద్ధాంత పరిజ్ఞానాన్ని జీర్ణించుకున్న నర్రా జిల్లాకు వచ్చాక కమ్యూనిస్టు ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. 1949లో వట్టిమర్తి గ్రామంలో యువజన సంఘం స్థాపించి అధ్యక్షులుగా పనిచేశారు. కమ్యూనిస్టు పార్టీ కొరియర్‌గా పనిచేశారు. 1950లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం పొంది గ్రామ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత తాలూకా కమిటీ సభ్యునిగా ఎన్నికై ప్రజల, కార్యకర్తలతో సత్సంబంధాలు ఏర్పరుచుకున్నారు. జిల్లాకు వచ్చాక గ్రామాల్లో క్షేత్ర స్థాయి కార్యకర్తగా పనిచేశారు. క్రమశిక్షణ, పట్టుదల, కార్యదక్షత కలిగిన నర్రా సిపిఎంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించారు. సర్పంచ్ మొదలుకుని శాసన సభసభ్యుని వరకు అనేక పర్యాయాలు గెలుపొంది ప్రజల వాణిని చట్ట సభల్లో వినిపించారు. ప్రజా ఉద్యమ నిర్మాతగా, ప్రజా ప్రతినిధిగా,పాలక వర్గాలకు జంకు పుట్టించారు. శాసనాల రూపకల్పన, వాటి అమలులో జరుగుతోన్న తప్పిదాలను ఎత్తిచూపుతూ ప్రభుత్వ ప్రతినిధులు, అధికారు లకు దిశా దశ నిర్దేశించిన సందర్భాలనేకం ఉన్నాయి.
నర్రా రాఘవరెడ్డి యాభై ఏళ్ల ప్రజా జీవితంలో ప్రజలకు బహుముఖ సేవల్ని అందించారు. 1950 నుంచి సిపిఐ పార్టీ సభ్యునిగా కార్యకర్తగా, కళాకారుడుగా సుపరిచితుడే. అంతరంగిక సమస్యలతో పాటు సైద్ధాంతిక విభేదాలతో కమ్యూనిస్టు పార్టీ చీలిన తర్వాత సిపిఎం విధానాలను ముందుకు తీసుకు పోవాలని నర్రా పార్టీలో క్రియా శీలకంగా పనిచేశారు.మళ్లీ 1968లో మొదలైన ఉగ్రవాద చీలికను సైతం ఎదుర్కోవడంలో నర్రా ఎంతో కృషి చేశారు. ఉగ్రవాదం వైపు వెళ్లిన కార్యకర్తల్ని మళ్లీ పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నించారు. ఈ ప్రభావంతోనే 1972లో పార్టీ ఓటమి పాలైనా నిరాశకు గురికాలేదు. 1973లో బీబీనగర్-నడికుడి రైలు మార్గం విస్తరణకు కృషి చేశారు. ఎమర్జెన్సీ తర్వాత ఎమ్మెల్యేగా 1977లో గెలుపొందిన నర్రా శాసన సభలో ప్రజల, పార్టీ వాణిని వినిపించారు. సిపిఎం శాసన సభా పక్ష నేతగా, ఉప నేతగా పలు పర్యాయాలు పనిచేశారు. టిడిపి, కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరుపై అనేక విమర్శనాస్త్రాలు సంధించారు.
రాష్ట్ర అభివృద్ధికి చేపట్టాల్సిన ప్రాజెక్టుల, పథకాల రూపకల్పనలో ప్రభుత్వానికి నర్రా పలు సలహాలు, సూచనలు చేసి ప్రజా సంక్షేమానికి పాటుబడ్డారు.
పార్టీ నిర్మాణంలో కృషి చేస్తునే శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సాధన కోసం అనేక పోరాటాలు చేశారు. ప్రజా ప్రతినిధిగా పార్టీ నాయకునిగా పనిచేయడంతో పాటు ప్రజా సంఘాల నిర్మాణానికి పాటు పట్టారు. గీత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా నర్రా ఎన్నికై ఎక్సైజ్ విధానానికి, కాంట్రాక్టు పద్ధతికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి గుర్తింపు తెచ్చారు. గ్రామ సేవకుల సంఘాన్ని జిల్లాలో ఏర్పాటు చేసి రాష్ట్ర ఉద్యమంగా తీర్చిదిద్దడంలో నర్రా పాత్ర ఎంతో ఉంది. చేనేత కార్మికులసమస్యలపై కూడా అనేక పోరాటాలు సాగాయి. వాటికి నర్రా నాయకత్వం వహించి సంఘాన్ని గుర్తింపులోకి తీసుకొ చ్చేందుకు కృషి చేశారు. పార్టీ జిల్లా, నకిరేకల్ కార్యాలయాల నిర్మాణా నికి కృషి చేశారు. గొల్లసుద్దుల – పిట్టల దొర ఇలా అనేక కళారూపాలు ప్రదర్శించి ప్రజల ఆదరణ పొందారు. సులభతరమైన సామెతలు- పొడుపు కథలు చెప్పి ప్రజల్ని అలరింప జేసేవారు.
అనారోగ్యంతో బాధపడుతూ, చికిత్స పొందుతూ ఏప్రిల్ 9, 2015 న మృతి చెందారు.