Thursday, August 18, 2022
HomeLifestyleLife styleతెలుగు పత్రికా రంగానికి మార్గ నిర్దేశకుడు నార్ల...

తెలుగు పత్రికా రంగానికి మార్గ నిర్దేశకుడు నార్ల…

నార్ల వెంకటేశ్వరరావు… పరిచయం అక్కర్లేని పేరు. నిర్భయానికి, నిక్క చ్చితత్వానికి, నిబద్ధతకు మారు పేరు. వృత్తి నిబద్దతతో నిర్వహిం చారు. వృత్తి నిర్వహణ సామాజిక బాధ్యతగా భావించారు. పత్రికా రంగానికి మార్గదర్శకులు, జర్నలిస్టు లకు దిశానిర్దేశకులు. ఆయనొక విజ్ఞాన సర్వస్వం. అయన జీవితం సంస్కరణల మయం. రచన ఏది చేసినా, ప్రక్రియ ఎదైనా, ప్రజా చైతన్యమే ఆయన లక్ష్యం. లక్ష్య సిద్ది కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందుకే సాగిన వైనం. రచయితగా, నాటకకర్తగా, విమర్శ కుడిగా, అనువాదకుడిగా బహు ముఖ పాత్రలు పోషించిన ఆయన జీవిత పర్యంతం హేతుబద్ధమైన ఆలోచనల ద్వారా సామాజిక స్పృహ కల్పించే ప్రయత్నం చేశారు. ఆంగ్ల భాషలోనూ నిష్ణాతులైనా, తెలుగు ప్రజలకు తన రచనలు చేరువ కావాలనే తలంపుతో, తెలుగు పత్రికా రంగాన్ని కావాలనే ఎంచుకున్నారు. మధ్య ప్రదేశ్ లోని జబల్‌పూర్‌లో డిసెంబర్ 1, 1908 జన్మించిన నార్ల, విద్యాభ్యాసం కృష్ణా జిల్లాలో జరిగిం ది. వెంకటేశ్వరరావు ఏప్రిల్ 3, 1958 నుండి ఏప్రిల్ 2, 1970 వరకు రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యునిగా పని చేశారు.స్వరాజ్య, జన వాణి, ప్రజా మిత్ర పత్రికలో పని చేసి, ఆంధ్ర ప్రభ, చివరకు ఆంధ్ర జ్యోతి పత్రికలకు ఎడిటర్ గా విధులు నిర్వర్తించారు. విధి నిర్వహణలో ఎన్నడూ అయన రాజీ పడలేదు. ఆయన సంపాద కీయ రచనలు సూటిదనం, గడుసు దనం, వ్యంగ్యం, చమత్కారం, లోక జ్ఞత, సమయజ్ఞత కల గలిపి ఉండే వి. పండితునికి, పామరునికి తెలు గు భాష అర్థమయ్యే రీతిలో నార్ల సంపాదకీయాలు, రచనలు చేశారు. ”వాస్తవమ్ము నార్లవారి మాట’’ మకుటంతో ఆటవెలదులు రచించారు. ‘’నవయుగాల బాట నార్ల మాట’’ మకుటంతో 700కు పైగా సందేశాత్మక పద్యాలు రాశారు. 16 ఏకాంకికల సంపుటి వెలువరించారు. నార్ల సొంత గ్రంథాలయంలో 20,000 పుస్తకాలు ఉండేవట అంటే మాటలు కాదు.సంపాదకుడు అనే మాటను అయన అంగీకరించ లేదు. ఆమోదించ లేదు. ఎడిటర్ అనే పదాన్నే వాడే వారు. నార్ల… టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, , కాసు బ్రహ్మానంద రెడ్డి, ఎన్.జి. రంగా ఎవరినీ వదల లేదు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ చాందసాన్ని విమర్శించక మాన లేదు. ఇందిరా గాంధి, ఆమె కుటుంబ వారసత్వ రాజకీయాల్ని ద్వేషించారు. ఆయన వ్యాసాలను నిరక్షరాస్యులు గ్రామాల్లోని రచ్చబండల దగ్గర చదివి వినిపించుకునే వారంటే ఆయనలోని రచనా వ్యాసంగ శక్తి ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.ఆంధ్రప్రభ నుంచి వైదొలిగిన సందర్భంలో, నార్ల కోసం కొందరు ముఖ్యులు కలిసి ఆంధ్ర జ్యోతి పత్రిక ప్రారంభించారంటే ఆయన గొప్పతనం స్పష్టం అవుతున్నది. గోరాశాస్త్రి మాటల్లో చెప్పాలంటే ‘కేవలం సత్వగుణ ప్రధానంగా, అచ్చ తెలుగులో చప్పచప్పగా ఉన్న పత్రికా రచనలో వాడినీ, వేడినీ సృష్టించి, తెలుగు నుడికారంలో ఎంత ‘కారం’ ఉందో తెలియజెప్పిన వాడు’ నార్ల. “యొక్కలతో తెలుగుభాష డొక్క పొడవొద్దు…ఎంత గొప్ప వాడైనా వస్తాడే కాని విచ్చేయడు…సంపాదకుడు అనొద్దు ఎడిటర్ అనండి…బడు వాడేవాడు బడుద్ధాయి. అంటూ పత్రికా భాష ఎలా ఉండాలో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఫిబ్రవరి 16, 1985న ఈ లోకాన్ని వీడి వెళ్లిన నార్ల తెలుగు సాహిత్య, పత్రికా రంగాలలో చెరగని ముద్ర వేసి వెళ్లారు. “ఎడిటరైన వాడు బిడియము చూపుచో ధాటి తగ్గు వృత్తి ధర్మమందు, కడుపుకూటి రాత కక్కుర్తి రాతరా””నిజము కప్పిపుచ్చి నీతిని విడనాడి స్వామి సేవ సేయు జర్నలిస్టు తార్చువాని కంటే తక్కువ వాడురా” అంటూ విలువలు వీడ వలదని హితవు పలికారు. ప్రస్తుత పరిస్థితులలో ఆయన చేసిన మార్గ నిర్దేశం నేటి జర్నలిస్టులకు నిజంగానే శిరోధార్యం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments