Monday, May 23, 2022
HomeLife styleDevotionalఅన్ని అవతారాలకు భిన్నం నరసింహావతారం

అన్ని అవతారాలకు భిన్నం నరసింహావతారం

“ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం, నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం”(Narasimhavatharam)

రామకృష్ణాది అవతారములవలె గాక, నిర్యాణములేని శాశ్వత అవతారమైన శ్రీనరసింహుని జయంతి, హిందూ పండగలలో అత్యంత ఆధ్యాత్మిక ప్రాధాన్యత నొందింది. వైశాఖ శుద్ధ చతుర్దశి పుణ్య తిథియందు ఉద్భవించిన నారసింహుని పూజలతో, ఆకాల మృత్యు భయముండదని, దుష్టగ్రహ బాధలు, పైశాచిక చేతబడుల ప్రయోగాలను తిప్పికొట్టే శక్తి నారసింహ మంత్రానికి గలదని భక్తుల, సాంప్రదాయాచరణాసక్తుల ప్రగాఢ విశ్వాసం. పగలు రాత్రి కాని సంధ్యా సమయాన, నరుడు జంతువు కాని రూపంతో, భూమ్యాకాశాలు కాని తొడలపై, సజీవము నిర్జీవ మూకాని చేతిగోళ్ళతో, హిరణ్యకశిపుని చీల్చి భక్త జన రక్షకుడై, సుదర్శన, శంఖ, చక్ర, ఖడ్గ, అంకుశ, పాశు, పరశు, ముసల, కులిశ, పద్మాదులను కలిగి
గదాధరుడై ప్రకాశించిన ఉగ్రనారసింహ అవతార తత్వం మిగతా అవతారాలకు భిన్నం.

భగవంతుని అవతారాలలో అత్యద్భుత అవతారంగా చెప్పగలిగే అవతారం నారసింహావ తారం. సగం మనిషి సగం మృగం ఆకారంలో రూపు దాల్చడం నరసింహావతార ప్రత్యేకం. దుష్ట శిక్షణ శిక్ష రక్షణ సర్వాంత ర్యామిత్వం, భక్తుని మాటను నిజం చేయడం… నమ్మిన బంటును శాప విముక్తుని గావించడం, ఎన్ని నియంత్రణలు, వరాలున్నా వాటిని అధిగమించి భక్తుడు లేక వైరి కోరుకున్న విధంగానే శతృ వధ చేయడం, సూక్ష్మం నుండి స్థూల రూపాన్ని ఏదైనా ధరించడం నరసిం హావతారంలో విశిష్టతలు.

Narasimhavatharam
Narasimhavatharam

స్మృతి దర్పణం, గదాధర పద్ధతి, పురుషార్ధ చింతామణి, చతుర్వర్గ చింతామణి అన్నీ వైశాఖ శుక్ల చతుర్దశి నరసింహ జయంతిగా పేర్కొంటున్నాయి. “వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాం శుభ దినే, సంధ్యాకాలే నిశాయుక్తే స్తంభోధ్భూతం నృకే సరి:”; వైశాఖ శుక్లపక్ష చతుర్దశి స్వాతి నక్షత్ర ప్రదోష కాలంలో నరసింహుడు అవతరించాడు. విష్ణుసేవా తత్పరులైన జయ విజయులు వైకుంఠంలో ద్వార పాలకులు. ఒకసారి సనక సనందాది మహా మునులు వికుంఠుని దర్శనార్ధం వెళ్ళగా, అది తగిన సమయం కాదని, జయ విజయులు అడ్డగించగా, మునులు కోపించి వారిని విష్ణు లోకానికి దూరం కాగలరని శపించారు. అప్పుడు వారు విష్ణువు శరణు వేడగా, మునుల శాపానికి తిరుగు లేదని, చెప్పారు. కాని వారిలోని భక్తిని తెలిసిన మహావిష్ణువు వారికి ఒక ఉపాయాన్ని చెప్పారు. అదేమిటంటే భక్తులుగా 7జన్మలు, లేదా విరోధులుగా 3జన్మలు భూలోకాన ఉంటే మునులు ఇచ్చిన శాపాన్ని అనుభవించినట్లు అవుతుంది. అటు ముని జనానికి వచ్చిన కోపం ఉపశమిస్తుంది. ఇటు మీరు కోరుకున్నట్టు తిరిగి నా దగ్గరకు వచ్చే మార్గం. మీకు సులువు అవుతుందని చెప్పాడు. జయ విజయులు ఏడు జన్మలు తమను విడిచి దూరంగా ఉండలేమని వైరంతోనే 3జన్మలు ఎత్తి త్వరగా మీదగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఈ మూడు జన్మలే మాకు అంగీకారమని చెప్పారు. వారే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్య కశిపులుగా, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా, ద్వాపరలో శిశుపాల దంతవక్త్రులుగా జన్మించారు. రాక్షసరాజు హిరణ్య కశిపుడు తపస్సుకై వెళ్ళగా, ఆయన భార్య లీలాదేవి గర్భవతిగా ఉండగా, ఇంద్రుడు రాక్షస సంహారాన్ని ప్రారంభించి, చివరకు లీలావతిని అపహరించుకొని పోబోతుండగా, నారదుడు మందలించి, తన ఆశ్రమానికి తీసుకెళ్ళి, భాగవత తత్వబోధ చేయగా, గర్భస్థుడైన ప్రహ్లాదుడు విన్నాడు.

తపస్సుచే బ్రహ్మను మెప్పించిన హిరణ్య కశిపుడు తనకు నరులచేగాని, మృగాలచేగాని, పగలు గాని, రాత్రి గాని, ప్రాణమున్న వానిచే గాని, ప్రాణము లేని వానిచే గాని, ఆయుధము చేత గాని, గాలిలో గాని, నీటిలోగాని, అగ్నియందుగాని, ఆకాశంలో గాని, భువిపైన గాని, దేవదానవులచే గాని, ఇంటగాని, బయట గాని మరణము లేకుండా వరాలు కోరి, పొందాడు. పుట్టిన బిడ్డకు “ప్రహ్లాదుడు” అని నామకరణం చేశాడు. హిరణ్య కశిపుడు వరగర్వ మదాంధుడై, విష్ణుద్వేషియై, దేవతలను జయించి, ఇంద్ర సింహాసనం ఆక్రమించి, తాపసులను వారి తపస్సులను భంగ పరిచి, సాధువులను హింసించి, పంచభూతాలను శాసించాడు(Narasimhavatharam).

విష్ణుభక్తుడైన కుమారుని మార్చడానికి శతవిధాలా ప్రయత్నించాడు. “చదవని వాడజ్ఞుండగు, చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రీ” అంటూ రాక్షస కుల గురువైన చండామార్కులకు కుమారుని అప్పగించాడు. హిరణ్యకశిపుడు, గురు కులంలో నీవు ఏమి నేర్చుకున్నావని ప్రశ్నిస్తే… ప్రహ్లాదుడు, “సర్వమూ అతని దివ్యకళామయము అని తలంచి, విష్ణువునందు హృదయము లగ్నము చేయుట మేలు” అని బదులిచ్చాడు. రాక్షసులకు తగని ఇలాంటి బుద్ధి నీకెలా పుట్టిందంటే “మాందార మకరంద మాధుర్యమున దేలు, మధుపంబు వోవునే మదనములకు” అంటూ వైష్ణవ భక్తి సహజం.గానే సంభవించిందన్నాడు. మళ్ళీ గురుకులానికి పంపబడి, మనసు మారిందేమోనని గురువు లేమి చెప్పిరని ప్రశ్నిస్తే, “చదివించిరి నను గురువులు… చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ” అని వివరించాడు. నవవిధ భక్తి మార్గములు హరిని నమ్మి యుండుట భద్రమన్నాడు. తుదకు విసిగిపోయి విష్ణువు ఎక్కడ ఉన్నాడురా అని ప్రశ్నించాడు. “కల డంబోధి కలండు గాలి గలడాకాశంబునన్ గుంభి నిన్… వెదుకంగా నేల యీ యా యెడన్”, “ఇందు గలడందు లేడని, సందేహము వలదు చక్రి సర్వోప గతుం డెందెందు వెదకి చూచిన, అందండే కలడు దానవాగ్రణి వింటే” అంటూ ప్రహ్లాదుడు బదులిచ్చాడు. అయితే “స్తంభమునను చూపగలవె చక్రిన్ అన్ని ప్రశ్నించగా, “కానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్” అన్నాడా పరమ భాగవతోత్తము డైన ప్రహ్లాదుడు. వెంటనే హిరణ్య కశిపుడు స్థంభాన్ని చరవగా, శ్రీనృసింహుడు ఆవిర్భవించి, హిరణ్యకశిపుని ఒడిసి పట్టి, వజ్రాల వంటి, ప్రాణం ఉన్నవీ లేనివీ అయిన, తన నఖాలతో (గోళ్ళు) చీల్చి, శ్రీహరి (మనిషి జంతువు కాని) నరసింహ రూపంలో, పగలూ రాత్రిగాని సంధ్యా సమయాన, ఇంటా బయటా గాని గుమ్మంలో, భూమ్యాకాశాలు కాని తన తొడపై, సంహరించాడు. ప్రహ్లాదుని మాటను యధార్ధం చేసి, బ్రహ్మవరాన్ని గౌరవించి, తన అవతార తత్వాన్ని చాటాడు మహా విష్ణువు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో కదిరి, అహోబిలం, యాదగిరి గుట్ట, సింహాచలం, మంగళగిరి, ధర్మపురి, జగ్గయ్య పేట, పాలెం, సింగరాయ కొండ, పెంచల కోన, చీర్యాల తదితరాలే గాక కర్నాటకలో మేల్కొటె, ఉడుపి, సావన దుర్గ, దేవరాయన దుర్గ తదితర నృసింహాలయాలు ప్రఖ్యాతాలు. భక్తుల కోరికలు నెరవేర్చే కల్పతరువులు.

రామ కిష్టయ్య సంగన భట్ల... 9440595494
రామ కిష్టయ్య సంగన భట్ల… 9440595494
RELATED ARTICLES

1 COMMENT

  1. ధర్మపురి క్షేత్రంలో నరసింహునికి అన్నకూటోత్సవం | Filmimonks

    […] అన్ని అవతారాలకు భిన్నం నరసింహావతారం […]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

AllEscort