ధర్మపురి క్షేత్రస్థ శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థా నంలో నిర్వహిస్తున్న స్వామివారి నవ రాత్రి ఉత్సవాలలో భాగంగా బుధ వారం ప్రధానాలయమైన లక్ష్మీ సమేత యోగానంద నరసింహాలయంలో అన్నకూటోత్సవ కార్యక్రమాన్ని సాంప్రదాయ రీతిలో నిర్వహించారు. స్వామి వారి గర్భాలయాన ఎదురుగా కూటం అన్నం ఉంచి, ఆరగింపు జరిపితే, స్వామి వారు సకల ప్రాణులకు ఆహారం ప్రసాదిస్తారని ఆగమ శాస్త్రానుసారం ఏడాది కోమారు నవరాత్రి దినాలలో జరిపే ఈ ఆరుదైన కార్యక్రమం సందర్భంగా ఉప ప్రధానార్చకులు నేరేళ్ళ శ్రీనివాసాచార్య చొరవతో, దేవస్థానంలో ప్రత్యేకించి తయారు చేయించిన అన్న నివేదనలను అర్చకులు శ్రమకోర్చి గంపలలో తెచ్చి, ప్రధానాలయంలో స్వామి సన్నిధిన అన్న కూటం ఏర్పాటు చేసి, వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా నివేదించారు. అనంతరం భక్తులకు ప్రసాదాల రూపంలో నైవేద్యాలను అందజేశారు. ఏసీ ఈఓ శ్రీనివాస్, అభివృద్ది కమిటీ సభ్యులు, సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, అర్చకులు, వేద పండితులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
ఘనంగా లక్ష తులసి పూజ
దేవస్థానంలో నిర్వహిస్తున్న నరసింహ గర్భ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీయోగానంద లక్ష్మీ నరసింహ స్వామికి బుధ వారం లక్ష తులసీదళ అర్చనలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం ఎసీ,ఇఓ శ్రీనివాస్ సంకటాల నిర్వహణలో, పునరుద్దరణ కమిటీ సభ్యుల భాగస్వామ్యంతో, ఆస్థాన వేద పండితులు రమేశ శర్మ, ముత్యాల శర్మ, ఉప ప్రధానార్చకులు నేరేళ్ళ శ్రీనివాసాచార్య, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచార్య, రమణాచార్య, వంశీ, కిరణ్ అర్చకులు, ఆర్చక పురోహితులు బొజ్జా సంతోష్ శర్మ సంపత్ కుమార్ శర్మ, రాజగోపాల్ శర్మ, సిబ్బంది ఆధ్వర్యంలో అష్టోత్తర శత (108) పుష్పార్చన కార్యక్రమాన్ని విధివిధాన సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. అశేష భక్తజనం పాల్గొన్నారు.
నరసింహ జయంతికి విస్తృత ఏర్పాట్లు
ప్రాచీన క్షేత్రమై, పలు ప్రత్యేక ప్రాధాన్యతలను సంతరించుకున్న వివిధ దేవాలయాల సముదాయంతో విరాజిల్లుతున్న ధర్మపురి క్షేత్రంలోని ప్రధానాలయాలైన శ్రీయోగానంద, ఉగ్ర లక్ష్మీ సమేత నారసింహ ఆలయాలలో మే 4వ తేదీ గురు వారం నరసింహ నవరాత్రి ఉత్సవ వేడుకలలో చివరి ఘట్ట మైన నరసింహ జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరి పేందుకు ఏర్పాటు చేస్తున్నారు. “ఉగ్రం వీరం మహా విష్ణుం జ్వలంతం సర్వతో ముఖం; నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం” అనే మంత్రంతో నరసింహ స్వామిని పూజిస్తే శతృ జయం కలుగుతుంది. పగలు రాత్రి కాని సంధ్యా సమయాన, నరుడు జంతువు కాని రూపంతో, భూమ్యాకాశాలు కాని తొడలపై, సజీవము నిర్జీవమూ కాని చేతి గోళ్ళతో, హిరణ్యకశిపుని చీల్చి భక్తజన రక్షకుడై, సుదర్శన, శంఖ, చక్ర, ఖడ్గ, అంకుశ, పాశు, పరశు, ముసల, కులిశ, పద్మాదులను కలిగి గదాధరుడై ప్రకాశించిన ఉగ్రనారసింహ అవతార తత్వం మిగతా అవతారాలకు భిన్నమైన అవతారం. ఉగ్ర, యోగ నారసింహ స్వాములుగల ధర్మపురి దేవస్థానంలో నరసింహ నవరాత్రి ఉత్సవాల చివరి రోజైన జయంతి పర్వ దినాన సాంప్రదాయ పద్దతిలో
ప్రత్యేక జన్మదిన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
‘వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాం శుభదినే, సంధ్యా కాలే నిశాయుక్తే సంభోధ్భూతం నృకేసరి’; వైశాఖ శుక్లపక్ష చతుర్దశి స్వాతి నక్షత్ర ప్రదోషకాలంలో నరసింహుడు అవతరించాడు. ముఖ్యంగా నరసింహ జన్మ తిధి త్రయోదశి, జన్మ నక్షత్రం స్వాతి కలిసి వస్తున్న అపురూప దినాన నరసింహ జయంతి ఉత్సవంలో భాగంగా ఉదయాత్పూర్వం నుండి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు, పంచోపనిషత్ యుక్త పూజలు, సంభోద్భవకాల విశేష పూజలు, దీపోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. దేవస్థానం ఏసీ ఈఓ శ్రీనివాస్ సంకటాల, దేవస్థానం అభివృద్ది కమిటీ పర్యవేక్షణలో, అర్చకులు, ఆస్థాన వేదపండితులు బొజ్జా రమేశశర్మ ఆచార్యత్వంలో విశేష కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైయు న్నారు. నరసింహ జయంతి రోజున అభిషేకం, సంభోత్సవ పూజలు చేయించ దలచిన భక్తులు 516 రూపాయలు స్వయాన, డిడి, స్వయంగానైనా చెల్లించి, గోత్రనామాలు, చిరునామాలను తెలిపితే పూజలు వారిపేరున జరిపించి, ప్రసాదాదులు పోస్టు ద్వారా పంపగలమని ఈఓ శ్రీనివాస్ తెలిపారు. అలాగే నిత్యాన్నదాన పథకానికి సంబంధించి విరాళాలు సమర్పించ దలచిన భక్తులకు, దాతలకు 80 (జి) కింద ఆదాయ పన్ను మినహాయింపు సౌకర్యం ఉందని శ్రీనివాస్ వివరించారు.
