కోరిన కోర్కెలు తీర్చే ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నవరాత్రి ఉత్సవాల అంతర్భాగ చందనోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గత రెండేళ్లుగా కరోనా వ్యాప్తి నివారణ లో భాగంగా, నిబంధనలకు అనుగుణంగా, భక్తుల రహితంగా, ఎలాంటి సందడి లేకుండా ఆలయాల అంతర్గతంగా నిర్వహించగా, ఏడాదికి ఒకసారి మాత్రమే వీలు కలిగే స్వామి నిజరూప దర్శనం ఈ ఏడు భక్తుల సమక్షంలో జరిగింది.
దక్షిణ కాశిగా, హరిహర క్షేత్రంగా, నవనార సింహ క్షేత్రాలలో ఉత్కృష్టమైనదిగా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నిలయంగా, తెలుగు నేలపై పేరెన్నికగన్న గోదావరీ తీరస్థ, ప్రముఖ ప్రాచీన పుణ్య క్షేత్రమైన ధర్మపురిలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో శ్రీనృసింహుని చందనోత్సవ వేడుకలు గురు వారం వైభోపేతంగా జరిగాయి(Narasimha Swamy Chandanotsavam).

క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీనరసింహ నవరాత్రి ఉత్సవాలలో అంతర్భాగంగా, గురువారం దేవస్థానం లోని ప్రధానాలయాలైన శ్రీయోగానంద, ఉగ్ర లక్ష్మీ సమేత నారసింహ స్వాముల దేవాలయా లలో సాంప్రదాయ, వేదోక్త ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించా రు. వేద మంత్రాలతో మంగళ వాద్యాలతో అర్చకులు, పవిత్ర గోదావరి జలాలను తెచ్చి స్వామి వారలను అభిషేకించారు. దేవస్థానం ఎసి, ఇఓ సంకటాల శ్రీనివాస్, సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, అభివృద్ది కమిటీ అధ్యక్షుడు రామయ్య, సభ్యుల పర్యవేక్షణలో, సిబ్బంది సహకారంతో, ఆస్థాన వేద పండితులు బొజ్జా రమేశ శర్మ ఆచార్యత్వంలో, వివిధ ప్రధానాల యాల అర్చకులు, వేదవిదులైన పండితులచే విధివిధాన వేదోక్త సాంప్రదాయ పూజాదికాలు నిర్వహించారు. పంచోపనిషత్ యుక్త అభిషేకాదులు, రామాయణ, భారత, భాగవతాది పురాణ పారా యణాలు, శ్రీసూక్త, లక్ష్మీసూక్త సంపుటీకరణలు, లక్ష్మీ నరసింహ సహస్ర నామార్చనలు, కల్పోక్త న్యాస పూర్వక ప్రత్యేక పూజలొ నరించారు.

వేద విదులు రమేష్ శర్మ, ముత్యాల శర్మ, ఉప ప్రధాన అర్చకులు శ్రీ నేరేళ్ళ శ్రీనివాసాచార్యులు, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసా చార్యులు, చిలుక ముక్కు రమణాచార్యులు, నంబి నరసింహ మూర్తి, బొజ్జ సంతోష్ శర్మ, బొజ్జ సంపత్ శర్మ , బొజ్జ రాజగోపాల్ శర్మ, నేరెళ్ళ వంశీ కృష్ణ, చక్రపాణి కిరణ్, నేరెళ్ల విజయ్, నంబి అరుణ్ తదితరులు ఉపనిషత్యుక్త దశ శాంతులతో ఘనంగా చందనోత్స వాన్ని నిర్వహించారు. హిరణ్య కశిపుని సంహరించి, ఆగ్రహావే శాలతో ఉన్న ఉగ్రనారసిహుని శాంతింప జేస్తూ, చల్ల పరిచేందుకు కేసరి వర్ణ చందన లేపన తాపనం చేయడం అనవాయితీగా, అనాదిగా క్షేత్రంలో ఆచరిస్తున్న సదాచార నేపథ్యంలో గురువారం ఉదయం “గంధద్వారాం దురా దర్శాం “అంటూ వేదమంత్రో చ్ఛారణల మధ్య నిర్వహించిన స్థానిక దైవాల చందనోత్సవ వేడుకల సందర్భంగా ఉగ్ర, యోగానంద నారసింహుల నిజరూపాల దర్శనాలు జరిగాయి. దేవాదాయ శాఖ అనుమతులకు అనుగుణంగా భక్తులకు కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం కల్పిస్తూ, సంప్రదాయ రీతిలో కార్యక్రమాలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి గుగులోత్, సతీ సమేతంగా లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవ ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఆన్ లైన్ ద్వారా డబ్బులు చెల్లించిన భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చేసి పూజాదులు నిర్వహించారు.
