Wednesday, November 30, 2022
HomeLifestyleDevotionalభక్తుల కల్పతరువు నారసింహుడు

భక్తుల కల్పతరువు నారసింహుడు

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

ఫాల్గుణ శుద్ధ ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. నరసింహ ద్వాదశిగా ప్రసిద్ధి చెందిన గోవింద ద్వాదశి హోలీకి ముందు ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్ష ద్వాదశి తిథి నాడు వస్తుంది. భారత దేశంలోని అనేక వైష్ణవాలయాల్లో ఈ రోజున విశేషంగా ఉత్సవాలు జరుపు తారు. ఫాల్గుణ మాసంలో వచ్చే నృసింహ ద్వాదశి వైష్ణవ ఆలయా లను సందర్శించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయని సాంప్రదాయ ఆచరణాసక్తుల విశ్వాసం.

భగవంతుని అవతారాలలో అత్యద్భుత అవతారంగా చెప్పగలిగే అవతారం నారసింహావ తారం. సగం మనిషి సగం మృగం ఆకారంలో రూపు దాల్చడం నరసింహావతార ప్రత్యేకం. దుష్ట శిక్షణ శిక్ష రక్షణ సర్వాంత ర్యామిత్వం, భక్తుని మాటను నిజం చేయడం… నమ్మిన బంటును శాప విముక్తుని గావించడం, ఎన్ని నియంత్రణలు, వరాలున్నా వాటిని అధిగమించి భక్తుడు లేక వైరి కోరుకున్న విధంగానే శతృ వధ చేయడం, సూక్ష్మం నుండి స్థూల రూపాన్ని ఏదైనా ధరించడం నరసింహావతారంలో విశిష్టతలు.
శ్రీహరి (మనిషి జంతువు కాని) నరసింహ రూపంలో, పగలూ రాత్రిగాని సంధ్యా సమయాన, ఇంటా బయటా గాని గుమ్మంలో, భూమ్యాకాశాలు కాని తన తొడపై, హిరణ్య కశిపుని సంహరించాడు. ప్రహ్లాదుని మాటను యధార్ధం చేసి, బ్రహ్మవరాన్ని గౌరవించి, తన అవతార తత్వాన్ని చాటాడు మహా విష్ణువు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో కదిరి, అహోబిలం, యాదగిరి గుట్ట, సింహాచలం, మంగళగిరి, ధర్మపురి, జగ్గయ్యపేట, పాలెం, సింగరాయ కొండ, పెంచల కోన, చీర్యాల తదితరాలే గాక కర్నాటకలో మేల్కొటె, ఉడుపి, సావన దుర్గ, దేవరాయన దుర్గ తదితర నృసింహాలయాలు ప్రఖ్యాతాలు. భక్తుల కోరికలు నెరవేర్చే కల్పతరువులు.
నృసింహ ద్వాదశి పవిత్ర దినాన గంగా, సరస్వతి, యమునా, గోదావరి వంటి పవిత్ర నదులలో స్నానాలు ఆచరిస్తారు. సూర్యోదయానికి ముందే లేచి నదుల్లో స్నానాలు చేస్తారు. నదులు అందుబాటులో లేనివారు సరస్సులోనైనా, నదుల దగ్గర కూడా స్నానాలు చేయవచ్చు. అలా చేస్తున్నప్పుడు గంగా దేవి, విష్ణువులను స్మరించుకోవాలి. ఈ రోజు భక్తులు గోవింద ద్వాదశి వ్రతం ఆచరిస్తారు. ఉపవాసాలు కూడా పాటిస్తారు. ఈ రోజున భక్తులు సాయంత్రం విష్ణు దేవాలయాలను సందర్శించి పూజల్లో, ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజున విష్ణు నామ స్మరణ, శ్రీ నరసింహ కవచం పఠించడం విశేష ఫలితాలనిస్తుంది. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన నరసింహస్వామిని ఈ రోజున పూజించే వారికి అప్లైశ్వర్యాలు చేకూరుతాయి. ద్వాదశి నాటి గంగాస్నానం పాపాలను నశింపజేస్తుందని పురాణ వచనం. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం, మహిళలు సీతామాత పూజ, విష్ణుపూజ చేయడం వలన సకల సంపదలు చేకూరుతాయి.

నృసింహ ద్వాదశి వ్రతమాచరించే భక్తులకు స్వామివారు ధైర్యం, నమ్మకం, భద్రత కల్పిస్తారని విశ్వసిస్తారు. నరసింహస్వామి సంబంధిత శ్లోకాలు రోజంతా చదువుకుంటూ ధ్యానం చేస్తే విశేషంగా లబ్ది పొందుతారు. వ్రతం చేసుకునే వారు వేకువ ఝామునే నిద్రలేవాలి. పారే నదిలో కానీ చెరువులో లేదా బావి వద్ద శిరస్నానం చేయాలి.. ఇలా చేస్తే దేహంశుద్ది అవడమే కాకుండా పూజపై మనసు లగ్నమవుతుందని పెద్దలు చెబుతారు.

నరసింహస్వామి దేవాలయంలో కానీ, ఇంటివద్ద స్వామి వారి పటం పెట్టుకొని వివిధ రకాల పూలు, పండ్లు ఉంచి నరసింహస్వామి శ్లోకాలను భక్తి శ్రద్దలతో చదువుతూ పూజ చేయాలి. స్వామివారిని తులసిమాలతో అలంకరించి, వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించాలి. నరసింహా గాయత్రిని కానీ, శ్రీలక్ష్మి నరసింహ కరావలంబ స్తోత్రం, నరసింహ అష్టోత్తరం, నరసింహ సహస్ర నామాలను గానీ పఠిస్తే చాలామంచిదని పురాణాలు పేర్కొంటున్నాయి.

ఉగ్రం వీరం మహావిష్ణుం
జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం
మృత్యుమృత్యుం నమామ్యహం

ఉగ్రం అంటే… నృసింహుడు ఉగ్రమూర్తి. నరసింహుని హుంకారాన్ని విన్నంత మాత్రంలోనే అంతర్గత, బహిర్గత శత్రునాశనం జరుగుతుంది. వీరం అంటే.. సకల కార్యకారణాలకు మూలంగా వున్న శక్తినే వీరం అంటారు. నరసిం హుడు వీరమూర్తి. కనుక సకల కార్యకారణ స్వరూపుడు ఆయనే. మహావిష్ణుం అంటే… అన్ని లోకాల్లో అంతటా వుండే నరసింహ తత్వానికి ఈ నామం ప్రతీక. సకల జీవరాశులన్నిటిలోనూ తానే వ్యక్తంగానూ, అవ్యక్తంగానూ పరమాత్మ భాసిస్తాడు. జ్వలంతం అంటే… సకల లోకాల్లో, సర్వాత్మల్లో తన తేజస్సును ప్రకాశింపజేయడం ద్వారా వాటి ప్రకాశానికి కారణమైన తత్త్వమే జ్వలంత శబ్దానికి అర్థం. సర్వతోముఖం అంటే… ఇంద్రియ సహాయం లేకుండా సకల విశ్వాన్ని చూడగల పరమాత్మ తత్త్వమే సర్వతోముఖత్వం. నృసింహం అంటే.. సకల జీవుల్లో సింహం చాలా శ్రేష్ఠమైనది. అందుకనే పరమాత్మ లోకాలను ఉద్ధరించ డానికి శ్రేష్టమైన సింహాకృతి ప్రధానంగా నరసింహుడుగా ఆవిర్భవించాడు. భీషణం అంటే… నరసింహుని శాసనశక్తి ప్రతీక భీషణత్వం.

అత్యంత భయంకరమైన రూపం ఇది. భద్రం అంటే.. భయాన్ని కలిగించే భీషణుడైన పరమాత్మే ఆ భయాన్ని పోగొట్టి అభయాన్ని కూడా ఇస్తాడు. ఇదే భద్రత్వం. మృత్యుమృత్యుం అంటే.. స్మరణ మాత్రం చేత అప మృత్యువును దూరం చేసేవాడు. మృత్యువుకే మృత్యువైన వాడు నరసింహుడు మాత్రమే. మృత్యువును కలిగించేదీ, మృత్యువును తొలగించేది కూడా ఆ స్వామి అనుగ్రహమే.

ఓం నమో నృసింహాయ నమః అని 108 సార్లు స్వామి వారిని ధ్యానిం చినా విశేష ఫలితం లభిస్తుంది. అలాగే ఈ రోజున నరసింహ – స్వామి వారి దేవాలయాలను దర్శిస్తే వారి కృపకు పాత్రుల వుతారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments