Thursday, June 30, 2022
HomeLifestyleDevotionalతొలి వార్తా హరుడు .. ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

తొలి వార్తా హరుడు .. ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

నారదుడు దేవర్షి, సంగీతజ్ఞుడు. నిరంతరం లోక సంచారి. చేతుల్లో చిరుతలు, మహతి అనే వీణా ధారియై, హరి నామ సంకీర్తన చేస్తూ, నిరంతరం తిరుగాడడమే ఆయన పని. ఆయా ప్రాంతాల విశేషాలను అందరికీ తెలుపు తుంటాడు. ఆయన ఒక “ఆదర్శ పాత్రికేయుడు“. మంచి చెడుల మధ్య జరిగే యుద్ధంలో ఆయనది ఎప్పుడూ ధర్మ పక్షమే. కృత, త్రేతా, ద్వాపర యుగాలన్నిటిలోనూ ఆయన ఉంటాడు. నారదుడి పేరు ప్రస్తావించని హిందూ పురాణం లేదు. అష్టాదశ పురాణాలు, రామాయణ, మహాభారతాల్లోనూ నారదుడు పాత్ర గురించి వివరించారు(narada maharshi).
నారదుని జన్మతిధి వైశాఖ బహుళ పాడ్యమి. ఈ తిధినాడే నారద జయంతిని జరుపు కునే సాంప్రదాయం ఉంది. నారదుడు మూడు లోకాల్లోను సంచరిస్తూ భక్తి మార్గాన్ని ప్రచారం చేస్తుంటాడు. ఎంతోమంది సాత్వికులకు అయన మోక్ష మార్గాన్ని చూపించాడు. ధర్మానికి అధర్మానికి జరిగే పోరాటంలో ఆయన తనదైన పాత్ర పోషిస్తుంటాడు. అయితే కొంతమంది మేధావులు, రచయితలు మాత్రం ఆయన్ను “కలహ భోజనుడు” గా “కలహ ప్రియుడు” గా అభివర్ణించారు. వాస్తవానికి, నిజం మాట్లాడే వారికి ఎప్పుడు కష్టాలే. ‘’యదార్ధవాది లోక విరోధి’’. ఆధునిక కాలంలో కూడా సత్యాన్ని ధర్మాన్ని పాటించే వారంటే చిన్నచూపు. వారిని లోక విరోధులుగానే చూస్తారు. అనేక కష్టాలకు గురి చేస్తారు. నారద మహర్షి కూడా లోక కళ్యాణం కొరకు నిరంతరం తపించేవాడు. ముల్లోకాలలోనూ సంచరిస్తూ దేవ, మానవ, దానవులకు సందర్భాను సారంగా కర్తవ్య బోధ చేస్తుంటాడు. అయితే నారదుడిది ఒకటే లక్ష్యం. ధర్మం గెలవాలి.
బ్రహ్మ మానస పుత్రుడు, త్రిలోక సంచారి, నారాయణ భక్తుడు, ముక్తుడు అయిన నారదుడు విశ్వ హితుడు. తెలుగు సాహిత్యం లోనూ, తెలుగు సినిమాల లోనూ నారదుని కలహ ప్రియత్వం, వాక్చతురత తరచు ప్రస్తావించ బడుతాయి. ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసములలో నారదుని కథలు బహుళంగా వస్తాయి.
నారదుని పాత్ర చాలా పురాణాలలో కనిపిస్తుంది.
భాగవతం, ప్రధమ స్కంధంలో నారదుడు వేద వ్యాసునికి భాగవతం రచింపమని బోధిస్తాడు. ఈ సందర్భంలోనే నారదుడు తన పూర్వ గాథను వ్యాసునకు వివరిస్తాడు. రామాయణం, బాలకాండలో నారదుడు వాల్మీకికి ఉత్తమ పురుషుడైన శ్రీరాముని గురించి చెప్పి రామాయణం వ్రాయమనీ, అది ఆచంద్రార్కం నిలిచి ఉంటుందనీ ఆనతిస్తాడు. అలా చెప్పిన భాగమే సంక్షిప్త రామాయణంగా చెప్పబడుతుంది.

narada maharshi
narada maharshi


మహా భాగవతం మొదటి స్కంధంలో నారదుడు తన గాథను స్వయంగా వేద వ్యాసునికి తెలిపాడు. తాను పూర్వ జన్మ పుణ్య కారణంగా హరికథా గానం చేస్తూ ముల్లోకాలలో సంచరింప గలుగుతున్నానని చెప్పాడు.
పూర్వ కల్పంలో నారదుడు వేదవిదులైన వారింట పని చేసే ఒక దాసికి కుమారుడు. ఒకమారు అతడు చాతుర్మాస్య వ్రతం ఆచరించే కొందరు యోగులకు శ్రద్ధగా పరిచర్యలు చేశాడు. వారు సంతోషించి ఆ బాలునికి విష్ణుతత్వం ఉపదేశించారు. వారి దయవలన ఆ బాలుడు వాసుదేవుని అమేయ మాయా భావాన్ని తెలుసు కొన్నాడు. ప్రణవంతో కలిపి వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ మూర్తులను స్మరించి నమస్కరించి నట్లయితే సమ్యక్ దర్శనుడు అవుతాడని గ్రహించాడు. ఆయన
తల్లి ఒకనాడు పాము కాటువల్ల మరణించింది. అప్పుడు నారదుడు అన్ని బంధముల నుండి విముక్తుడై అడవికి పోయి భగవత్స్వరూపాన్ని ధ్యానించడంలో నిమగ్నమై ఉంటాడు. ఏకాగ్ర ధ్యాన సమయంలో అతని మనస్సులో భగవత్స్వరూపం గోచరించింది. కాని మరుక్షణమే అంతర్ధానమైంది. చింతాక్రాంతుడై నారదుడు అడవిలో తిరుగుతుండగా అతనికి దివ్యవాణి ఇలా ఆదేశమిచ్చింది – ఈ జన్మలో నీవు నన్ను పొందలేవు. కాని నా దర్శనం వల్ల నీ సందేహాలు తొలగి అచంచలమైన భక్తి చేకూరింది. ఈ శరీరం త్యజించిన పిమ్మట నా పార్షదుడవై నన్ను పొంద గలవు. – నారదుడు సంతుష్టుడై నిరంతరం హరి నామ జపం చేస్తూ కాలం గడిపి, అంతిమ సమయం ఆసన్నమైనపుడు తన దేహాన్ని త్యజించాడు.
అనంతరం ప్రళయ కాలం సమీపించగా, ఒక సముద్రంలా ఉన్న ఆ జలరాశి మధ్యలో, నిద్రకు ఉపక్రమించిన బ్రహ్మ శ్వాసలో ప్రవేశించి, ఆయనలో లీనమయ్యాడు. వేయి యుగాల కాలం తరువాత బ్రహ్మ లేచి లోకాలను సృష్టించడం ఆరంభించినపుడు, బ్రహ్మ ప్రాణముల నుండి మరీచి మొదలైన మునులతోబాటు నారదుడు కూడా జన్మించాడు. కనుకనే నారదుని బ్రహ్మ మానస పుత్రుడయ్యాడు. అలా నారదుడు అఖండ దీక్షాపరుడై విష్ణువు అనుగ్రహం వలన నిరాటంకంగా సంచరించ గలుగు తుంటాడు. తాను స్మరించగానే నారాయణుని రూపం అతని మనసులో సాక్షాత్కరిస్తుంది…ఇలా తన కథ చెప్పి హరికథా గానంతో నిండి వున్న భాగవతాన్ని రచించమని నారదుడు వేద వ్యాసునికి ఉపదేశించాడు.
మహా భారతం సభాపర్వంలో నారదుని గురించి … వేదోపనిషత్తులను, పురాణాలను బాగా తెలిసినవాడు. దేవతలచే పూజితుడు. కల్పాతీత విశేషాల నెఱిగినవాడు. న్యాయ ధర్మ తత్వజ్ఞుడు. శిక్షా కల్ప వ్యాకరణాలు తెలిసిన వారిలో శ్రేష్టుడు. పరస్పర విరుద్ధములైన వివిధ విధి వాక్యాలను సమన్వయ పరచగల నీతిజ్ఞుడు. గొప్ప వక్త, మేధావి. జ్ఞాని, కవి, మంచి చెడులను వేరు వేరుగా గుర్తించుటలో నిపుణుడు. ప్రమాణముల ద్వారా వస్తు తత్వమును నిర్ణయించుటలో శక్తిశాలి. న్యాయ వాక్యముల గుణదోషముల నెఱిగినవాడు. బృహస్పతి వంటి విద్వాంసుల సందేహములు కూడా తీర్చగల ప్రతిభాశాలి. ధర్మార్ధ కామ మోక్షముల యధార్ధ తత్వము నెరిగినవాడు. సమస్త బ్రహ్మాండముల యందును, ముల్లోకముల యందును జరుగు సంఘటనలను తన యోగబలముచే దర్శింప గలడు. సాంఖ్యయోగ విభాగములు తెలిసినవాడు. దేవ దానవులకు వైరాగ్యమును ఉపదేశించుటలో చతురుడు. సంధి విగ్రహ తత్వములు తెలిసినవాడు. కర్తవ్య, అకర్తవ్య విభాగము చేయగల దక్షుడు. రాజనీతికి సంబంధించిన ఆరు గుణములలో కుశలుడు. సకల శాస్త్ర ప్రవీణుడు. యుద్ధ విద్యా నిపుణుడు. సంగీత విశారదుడు. భగవద్భక్తుడు. విద్యాగుణనిధి. సదాచారములకు ఆధారమైనవాడు. లోక హితకారి.
వ్యాసుడు రచించిన అష్టాదశ పురాణములలో నారద పురాణం ఒకటి. ఈ పురాణంలో 25,000 శ్లోకాలు ఉన్నాయి. నారద పురాణాన్ని నారదీయ పురాణం అని కూడా పిలుస్తారు. నారద పురాణంలో పూర్వార్థం, ఉత్తరార్థం అని రెండు భాగాలు ఉన్నాయి. పుర్వార్థం సంభాషణ సనక మహర్షికి నారదుడుకి మధ్య జరుగుతుంది. రెండవ భాగం అయిన ఉత్తరార్థంలో వశిష్ఠ మహర్షి వక్త, మాంధాత శ్రోత. ఈ పురాణంలో వేద వేదాంగాల గురించి, మంత్రముల గూర్చి, వివిధ దేవతా కవచాల గురించి చెప్ప బడింది. ఉత్తర భాగంలో మోహిని రుక్మాంగద చరితం ఉంది. ఈ రుక్మాంగద చరితానికి బృహన్నారదీయం అని నామాంతరం ఉంది.
నారద పురాణంలో విశేషంగా జ్యోతిఃశాస్త్ర విశేషాలు, మంత్రశాస్త్ర విశేషాలు చెప్పబడ్డాయి. నారద పురాణాన్ని మంత్రశాస్త్ర సంగ్రహం అని చెబుతారు. ఇందులో ఆదిత్య, అంబిక, విష్ణు, శివ, గణపతి, నవగ్రహ మంత్రములు, కార్తవీర్య మంత్రం, హయగ్రీవ మంత్రోపాసన, హనుమాన్ మంత్రం సంగ్రహించ బడ్డాయి. ఉత్తర భాగంలో వివిధ పుణ్యక్షేత్రాల గూర్చి చెప్పబడింది. కాశి, గయ, ప్రయాగ, పురుషోత్తమ క్షేత్ర, పుష్కర క్షేత్రం, గోకర్ణ క్షేత్రం, రామ సేతు, అవంతి తీర్థం, ద్వాదశి, ఏకాదశి వ్రత విధానం గురించి చెప్ప బడింది. బ్రహ్మ మానస పుత్రుడు, త్రిలోక సంచారి, నారాయణ భక్తుడు, ముక్తుడు అయిన నారదుడు విశ్వ హితుడు(narada maharshi).

నారం అంటే జ్ఞానం. జ్ఞానం నిరంతర ప్రవాహితం. దేవలోకంలో ఉన్న అన్ని విద్యలు, విజ్ఞానమంతా మానవులకు చేరడానికి మాధ్యమం నారదుడే. ధ్రువుడు, ప్రహ్లాదుడు ఆదిగా ఎందరికో జ్ఞాన బోధ చేసి లోక కళ్యాణం వైపు నడిపించిందే ఆయనే. అసలు విష్ణుమూర్తి అవతారాల కారకుడు ఆయనే. ప్రస్తుత కాలంలో పాత్రికేయులు నారదుని ఆదర్శంగా గైకొని, జ్ఞాన పిపాసులై, తాము సముపార్జించిన విజ్ఞానాన్ని అందరికీ అందించే ప్రయత్నం చేయాలి. ధర్మం, న్యాయం, సత్యం ఆచరణకు ప్రజలను కార్యోన్ముఖులను చేయాలి. ఆ మార్గంలో పాత్రికేయులకు మహర్షి నారదుని జీవితం పరమ ఆదర్శం.

రామ కిష్టయ్య సంగన భట్ల... 9440595494
రామ కిష్టయ్య సంగన భట్ల… 9440595494
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments