Monday, August 15, 2022
HomeLifestylespecial Editionబహుముఖ ప్రజ్ఞాశాలి నాళం కృష్ణారావు

బహుముఖ ప్రజ్ఞాశాలి నాళం కృష్ణారావు



నాళం కృష్ణారావు (జనవరి 18 , 1881 – మార్చి 17, 1961) బాల సాహిత్యబ్రహ్మ, మధుర కవి. తెలుగు వైతాళికుడు. సంఘ సంస్కర్త. గౌతమీ గ్రంథాలయం స్థాపకుడు.”మానవసేవ” పత్రిక సంపాదకులు. స్వాతంత్ర్య సమర యోధుడు, బహు భాషావేత్త.
బ్రహ్మ సమాజం మతస్థుడిగా తన గురువు అయిన కందుకూరి వీరేశలింగం పంతులుగారి కన్నా ముందే జంధ్యాన్ని పరి త్యజించారు. స్త్రీ విద్యను ప్రోత్సహించారు. వితంతు వివాహాలు జరిపించారు.ఇతర కులస్థులతో తన పెద్ద కుమారునికి వివాహం జరిపించారు. చింతా శేషయ్య అనే అట్టడుగు కులస్థుడికి తన యింట్లో నివాసం ఏర్పరిచి బ్రహ్మ మతస్థుడిగా తీర్చిదిద్దారు.

ఇక సాహిత్యం విషయానికి వస్తే…నాళం కృష్ణారావు అద్భుతమైన భావుకుడు.
బాలసాహిత్యంలో నాళంది అగ్రస్థానం. ప్రకృతి కవిత్వంలో , భావ కవిత్వంలో నాళంది అందె వేసిన చేయి. అయన పద్యాలు తెలుగు భాషకు సొబగులు. వాటిని చదివితే తెలుగు భాష సుపరిచితమై, పద్య రచనా పాటవం పెరుగుతుంది. వినూత్న
భావాలు మదిలో మెదలుతాయి. చిన్న చిన్న కథల్ని తేటగీతి పద్యాల్లో చెప్పటం నాళం ప్రత్యేకత.

ముఖ్యంగా పిల్లలకు తేలికగా అర్థమయ్యే రీతిలో పద్యాలు
రచించారు. చిన్ని చిన్ని పదాలతో తేట తెలుగు పలుకుల రుచి చూపించారు. తేటగీతులలో అద్భుత కావ్యరచనలు చేశారు.

నాళం కృష్ణారావు 1881 జనవరి 18 తేదీన నాళం కామరాజు, లక్ష్మమ్మల చివరి సంతానంగా తూర్పుగోదావరి జిల్లా మండపేట గ్రామంలో జన్మించారు.

1911-15 ప్రాంతాలలో ఆయన నిర్వహించిన తొలి తెలుగు సచిత్రమాస పత్రిక ‘మానవ సేవ’.
పుస్తక పఠనాసక్తిని కలిగించేందుకు 1898వ సంవత్సరంలో రాజమహేంద్ర వరంలో వీరేశలింగం గ్రంథ భాండాగారాన్ని నెలకొల్పారు. అదే క్రమంగా వృద్ధి చెంది వసురాయ గ్రంథ మండలిగా మారింది. దానికే సర్వజన గ్రంథ మండలి అనే పేరు కూడా వచ్చింది. ఎలాంటి విచక్షణకు తావు లేకుండా సమాజం లోని సర్వ సభ్యులకు గ్రంథాలయం ప్రవేశాన్ని కలిగించింది.

కృష్ణారావు పదిహేడో ఏట రాజమండ్రిలో గౌతమీ గ్రంథాలయాన్ని స్థాపించారు. ఈ గ్రంథాలయమే ఈ నాటికీ అదే పేరుతో ఆంధ్ర దేశంలోని విలువైన, ప్రముఖమైన గ్రంథాలయాల్లో ఒకటిగా విరాజిల్లుతున్నది. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి అధ్యక్షులుగా, నాళం కృష్ణారావు కార్యదర్శిగా ఉన్న రోజుల్లో స్వర్ణయుగాన్ని చూసింది గౌతమి. శ్రీకృష్ణరాయ ఆంధ్ర విజ్ఞాన సర్వస్వాన్ని సంకలనం చేశారు. కందుకూరి వీరేశలింగం పంతులు స్థాపించిన హితకారిణీ సమాజానికి, వీరేశలింగ పాఠశాలకు పంతులు తర్వాత జీవితాంతం అధ్యక్షులుగా పని చేశారు.

ఆయన రాసిన ‘గాంధీ విజయధ్వజ నాటకం’ (1921), ‘గాంధీ దశావతార లీలలు’ (1932) గ్రంథాలను బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. పదివేల సామెతలు జాతీయ లోకోక్తులు పేరుతో సేకరించారు. కృష్ణారావు లాఠీఛార్జి, జైలు జీవితం మరొక పార్శ్వం సాహిత్యం. బాల్యం నుండి తుదిశ్వాస వరకు తేటగీతులలో కావ్య రచన చేశారు. కృష్ణారావు ఆశలన్నీ భావిభారత పౌరులయిన పిల్లల పైనే ఉండేవి. అందుకే ఆయన కావ్యనాయకుడు పిల్లవాడు. ఆయా ‘గోరుముద్దలు’, ‘మీగడ తరగలు’, ‘వెన్నె బడుగలు’, ‘పాల తరగలు’ ‘తేనె చినుకలు’ తినిపిం చారు. ‘వెన్నెల వెలుగులు’, ‘విరిదండ’, ‘దీపావళి’ ‘పాపాయి’ లను అందించారు.

మీగడ తరకలు (కవితాసంకలనం)
గోరుముద్దలు, వెన్న బుడగలు, పాల తరకలు, తేనె చినుకులు,
వెన్నెల వెలుగులు, విరిదండ, దీపావళి, ముద్దు – పాపాయి,
గ్రంథాలయ సూక్తులు, మిత్ర లేఖావళి, అనుతాపము,
దేశమాత పరిదేవనము,
వితంతు వివాహ చరిత్ర,
స్త్రీల యెడ పురుషుల గావించు, పంచ మహా పాతకాలు,
ప్రేమ సాగరము, తెలుగు జాతీయములు, శ్రీ కృష్ణరాయాంధ్ర విజ్ఞాన సర్వస్వము, గాంధీమహాత్ముని దశావతార లీలలు తదితర రచనలు చేశారు. వీటిలో కొన్ని పుస్తకాలను గుంటూరులోని బొమ్మిడాల ఛారిటబుల్‌ ట్రస్ట్‌ వారు 2011 లో పునర్ముద్రణ గావించారు.

ఆయన సతీమణి నాళం సుశీలమ్మ తమ విదేశీ వస్త్రాలన్నీ దహనం చేసి, మహాత్ముడు రాజమండ్రి వచ్చినప్పుడు ఆయనకు పండ్లరసం అందించారు.

కృష్ణారావు నిరాడంబరుడు. కీర్తికాంక్షా రహితుడు.‘సేవ’కే ప్రాధాన్యం ఇచ్చిన మనిషి. తమ అనంతరం మానవసేవ చేయాల్సిందిగా, తన తనయ కళాప్రపూర్ణ ఊటుకూరి లక్ష్మీకాంతమ్మను నిర్దేశించారు.1961 మార్చి 17 న మరణించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments