మేషే గంగా వృషే రేవా మిథునేతు సరస్వతీ కర్కటే యమునా ప్రోక్తా సింహే గోదావరీ స్మ్రతా కన్యాయాం కృష్ణవేణీచ కావేరీ ధటకే స్మ్రతా వృశ్చికే తామ్రపర్ణీచ చాపే పుష్కర వాహినీ మకరే తుంగభద్రాచ కుంభే సింధునదీ స్మ్రతా మీనే ప్రణీతా నదీచ గురోస్సంక్రమణే స్మ్రతా పుష్కరాఖ్యౌ మునీనాంహి బుధై స్మ్రతా…..”
దేవగురువగు బృహస్పతి మేష రాశిలో ఉన్నప్పుడు గంగానదికి, వృషభరాశిలో ఉన్నప్పుడు నర్మదా నదికి, మిధున రాశిలో ఉన్నప్పుడు సరస్వతీ నదికి, కర్కాటక రాశిలో ఉన్నప్పుడు యమునా నదికి, సింహరాశిలో ఉన్నప్పుడు గోదావరి నదికి, కన్యారాశిలో ఉన్నప్పుడు కృష్ణా నదికి, తులారాశిలో ఉన్నప్పుడు కావేరి నదికి, వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు తామ్రపర్ణి నదికి, ధనూరాశిలో ఉన్నప్పుడు బ్రహ్మపుత్రకు, మకర రాశిలో ఉన్నప్పుడు తుంగభద్రా నదికి, కుంభ రాశిలో ఉన్నప్పుడు సింధు నదికి, మీన రాశిలో ఉన్నప్పుడు ప్రణీతా నదికి, పుష్కరాలు చెప్పబడ్డాయి.
పుష్కరం అనగా జల స్వరూపం జలాది దేవతగా సమస్త తీర్థములకు నెలవై ఉండి తీర్థరాజు అను పేరుతో లోక కళ్యాణ కారకు డైనట్లు శాస్త్రములు తెలుపు తున్నాయి.
పూర్వము తుందిలుడనే బ్రహ్మణోత్తముడు మహేశ్వరుని గూర్చి తపస్సు చేసి తన అష్ట-మూర్తులతో ఒకటైన జల స్వరూపముతో పుష్కరుడు అను నామముతో పరమ శివుని ఐక్యమై ఉండుటకు వరము పొంది, పరమే శ్వరుని సాయుజ్యము పొంది ఉండగా బ్రహ్మదేవుడు సృష్టిని శక్తివంతము చేయుటకై శివుని వరముతో ఆ పుష్కరుని స్వీకరించి, తన కమండలము నందు ఉంచుకొని సృష్టి కార్యం నిర్వహిస్తుండగా, బృహస్పతి బ్రహ్మను వేడుకొని ఆ పుష్కరుని తన వెంట ఉండుటకై వరమును కోరెను. గ్రహాధి పత్యమును, ముక్కోటి దేవతలకు గురువుగాను ఆపుష్కరుని సన్నిదిని శక్తి వంతుడై యుండునట్లు కొరుకొనగా పుష్కరుడు బ్రహ్మను వీడి రాకకు సమ్మతించక పోగా బ్రహ్మదేవుడు, ఆ పుష్కరుని కోరికపై ముక్కోటి దేవతలతో మూడున్నర కోట్ల తీర్థములతో, మహర్షులతో, ఆ పుష్కరుని వెంట ఉండి, బృహస్పతి, ఆయా రాసులలో (మేషాది రాసులలో) చరించు చున్నప్పుడు ఆయా నదులకు (మేషేచ – గంగా) అను సూత్రాను సారం పుష్కరాలు నిర్వహిస్తారు.
సాధారణంగా ప్రతి నదికి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పన్నెండు రోజులపాటు పుష్కరా లను ఎంతో వైభవంగా నిర్వహి స్తారు.
“మీనే ప్రణీతా చ గురోసాంక్రమణే
సమృతా” అనే ప్రమాణము ననుసరించి దేవ గురువు బృహస్పతి మీనరాశి యందు ప్రవేశించు సందర్భంలో ప్రణీతా నదికి పుష్కర శోభ చేకూరుతుంది. ప్రణీత నదిని ప్రాణహిత యనియు వ్యవహరిస్తారు.
గోదావరి ఉపనదుల్లో ప్రాణహిత ప్రముఖమైనది. ఈ నది మహా రాష్ట్రలోని విదర్భ ప్రాంతం, అలాగే సత్పురాశ్రేణుల దక్షణ వాలుల్లో ప్రవహిస్తోంది. వైన్ గంగ, పైన్ గంగా, వర్ణానది మూడు నదులు మహారాష్ట్ర లోని ఆస్తి అనే గ్రామం గుండా ప్రవహించి తెలంగాణ లోని ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి గ్రామంలో ప్రాణహిత జన్మించింది. బెజ్జూర్ మండలం గూడెం, సోమిని, తలాయి, వేమనపల్లి మండలం రావులపల్లి , వేమనపల్లి, కలలపేట, ముల్కల్లపేట, రాచర్ల, వెంచపల్లి , కోటపల్లి మండలం జనగామ, నందరాంపల్లి, పుల్లగామ, సిర్సా, అన్నారం, అర్జునగుట్ట గ్రామాల మీదుగా ప్రవహిస్తోంది. మహారాష్ట్ర వైపు గడ్చిరోలి జిల్లాలోని చప్రాల నుంచి ప్రారంభమై అయిరి దారం, దేవలమర్రి చెట్టులో వెలిసిన వేంకటేశ్వరస్వామి సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన తోగుల వెంకటాపూర్ మీదుగా ప్రవహిస్తూ రేగుంట, కొత్తూర్, తేకడా, గిలాస్పేట, రాయిపేట, రంగాయపల్లి, హమురాజీ, సిరోంచ మీదుగా భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తేశ్వర్లుగా వెలిసిన పరమే శ్వరుని పుణ్య క్షేత్రమైన కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో కలుస్తోంది. కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణ హిత, అంతర్వాహిని
సరస్వతి నదులతో త్రివేణి సంగమంగా విరాజిల్లుతోంది.
ఈ తీరంలో ప్రణీత మహర్షి తపస్సు చేయడం వల్ల దీనిని ప్రణీత అనీ, తీరం వెంబడి అడవిలో రకరకాల ప్రాణులు ఏ కొరతా లేకుండా మనుగడ సాగిస్తుండటంతో ప్రాణహిత అనీ పిలుస్తారని చెబుతారు.
కరీంనగర్ జిల్లా కేంద్రానికి 140 కిలోమీటర్ల దూరంలో మహదేవ్ పూర్ మండలంలో కాళేశ్వర
క్షేత్రం ఉంది. గోదావరి, ప్రాణహిత, సరస్వతి (అంతర్వాహిని) నదులు కలిసే ప్రాంతమై నందున
త్రివేణీ సంగమంగా ప్రసిద్ది చెందింది.
గతంలో ప్రాణహిత నదికి పుష్కరాలు 12.01.1999 నుండి 23.01.1999 వరకు కాళేశ్వరం వద్ద నిర్వహించారు. ఆ తరువాత 06.12.2010 నుండి 17.12.2010 వరకు జరిగాయి.
శుభకృత్ నామ సంవతార చైత్ర శుద్ధ ద్వాదశి బుధవారము 13.04.2022 నుండి
24.04.2022 వరకు ప్రణీత నదికి పుష్కర కాలము ఆచరించ బడుతుంది.
తెలంగాణ, మహారాష్ట్ర–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు.. గడ్చిరోలి, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈ పుష్కరాలు జరగనున్నాయి.
ప్రాణహిత పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా పలుచోట్ల ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం.. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ వద్ద.. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తుమ్మిడిహట్టి వద్ద పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద సాధారణ ప్రజల కోసం ఒకటి, వీఐపీల కోసం మరొకటి ఘాట్లు ఏర్పాటు చేస్తున్నారు.
రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494