5.1 C
New York
Saturday, June 3, 2023
Homespecial Editionహిందీ భాష వ్యాప్తికి మోటూరి ఎనలేని సేవలు

హిందీ భాష వ్యాప్తికి మోటూరి ఎనలేని సేవలు

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

మోటూరి సత్యనారాయణ హిందీ భాష ప్రచారానికి ఎనలేని సేవలు అందించిన విద్యావేత్త. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన భారత రాజ్యాంగ సభలో సభ్యులు. 1966 వరకు రాజ్యసభ (భారత ప్రభుత్వ ఎగువ సభ) లో నామినేటెడ్ సభ్యులు. భారత రాజ్యాంగంలో హిందీని అధికారిక భాషగా మార్చడంలో ఆయన ముఖ్యపాత్ర పోషించారు. రాజభాష కమిషన్ సభ్యులుగా, స్వాతంత్ర్య సమర యోధులుగా, రాజ్యసభ సభ్యులుగా, హిందీ వికాస సమితి స్థాపకులుగా, హిందీ ప్రచార సభ ప్రథాన కార్యదర్శిగా, బహుభాషా వేత్తగా బహుముఖ సేవలు అందించిన ప్రతిభా శాలి. భారత ప్రభుత్వ పద్మశ్రీ, పద్మ భూషణ్ పురస్కార గ్రహీత.

మోటూరి సత్యనారాయణ (ఫిబ్రవరి 2, 1902 – మార్చి 6, 1995) 1902, ఫిబ్రవరి 2 వ తేదీన కృష్ణా జిల్లా దొండపాడు గ్రామంలో పెద పిచ్చయ్య, రత్తమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య అనంతరం తెలుగు, సంస్కృతం అభ్యసించాడు. ఆంధ్ర జాతీయ కళాశాలలో ఉన్నతులైన గురువుల వద్ద శిక్షణ పొంది హిందీ బాగా అభ్యసించారు. తర్వాత ఇంగ్లీషు, తమిళం, కన్నడం, మలయాళం, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ మొదలైన భాషలు కూడా నేర్చుకున్నారు. ఆయనకు రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక, ఐతిహాసిక, వైజ్ఞానిక, సాంకేతిక విషయాలలో లోతుగా ప్రవేశం ఉండేది. అయన హిందీ ప్రచారంతో జీవితాన్ని ప్రారంభించి క్రమంగా సంఘటకులుగా, కార్యదర్శిగా, చివరకు 1938లో హిందీ ప్రచార సభకు ప్రధాన కార్యదర్శి అయి 1961 వరకు కొనసాగారు. ఆ సంస్థ ప్రథమ ప్రధాన కార్యదర్శి పండిత హరి హర శర్మకు కుడిభుజంగా ఉండి సహకరించారు. అయన దూరదృష్టి, అవగాహన వల్లనే ఈ సభ హిందీ సాహిత్య సమ్మేళనం, ప్రయాగవారి బంధనం నుండి విముక్తి పొంది 1927లో స్వతంత్ర సంస్థగా ఆవిర్భవించింది.

మోటూరి ప్రధాన కార్యదర్శిగా ఉన్నంతకాలం దక్షిణ భారత హిందీ ప్రచార సభ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింప దగినది. 1936లో ప్రచారసభకు 4 రాష్ట్రాలలో, 4 ప్రాంతీయ శాఖల నిర్మాణం అయన దూరదృష్టిని నిరూపిస్తుంది.
మోటూరి సత్య నారాయణ… మహాత్మాగాంధీ, రాజేంద్ర ప్రసాద్ లకు అత్యంత విశ్వాస పాత్రులు. 1946లో జరిగిన సభ రజతోత్సవానికి బాపూజీ 12 రోజులు ఉండి సమావేశాలు జరిపించారు. ప్రతి దినం గాంధీ ప్రార్థనా సమావేశాలలో వేలాది మంది పాల్గొనేవారు. మద్రాసు కార్పొరేషన్ నుండి త్యాగరాయ నగరంలో సుమారు ఐదున్నర ఎకరాల భూమిని సంపాదించి అప్పటి అవసరాల కనుగుణంగా భవనాలను నిర్మించారు. ముద్రణాలయం, పుస్తక ప్రచురణ, పరీక్షలు నిర్వహించడం ద్వారా ఆదాయం సమకూర్చారు. హిందీ ప్రచారాన్ని పెంపొందించడానికి ప్రతి రాష్ట్రంలోను, కొన్నిజిల్లాలలోను, మండలాల వారీగా సంరక్షకులను ఏర్పాటుచేసి నూతన ప్రణాళికల ద్వారా దక్షిణ భారతమంతా మారుమూలల వరకు హిందీని వ్యాపింప జేశారు. మోటూరి నేతృత్వ కృషి ప్రజలలో హిందీ పట్ల ప్రేమ, గౌరవం పెంచింది. 1942 లో క్విట్ ఇండియా ఉద్యమంలో జైలు శిక్ష అనుభవించారు. స్వాతంత్ర్య సమర యోధులుగా తామ్రపత్ర గ్రహీతలయ్యారు. రాజకీయ రంగంలో కూడా విలువైన సేవలు అందించారు. భారత రాజ్యాంగ చట్టంలో 17వ భాగం రాజభాష అధ్యాయ నిర్మాణంలోను, దాని డ్రాఫ్టింగ్, రాజ్యాంగ సభలో నెగ్గించడంలో అయన కృషి, సహకారం ఎంతో ఉన్నాయి. రాష్ట్రపతి ద్వారా 1954 నుండి 1966 వరకు వరుసగా రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేయబడ్డారు. 1956లో రాజభాషా కమిషన్ కు సభ్యులుగా పనిచేశారు.

తెలుగు భాషా సమితి స్థాపక కార్యదర్శిగా ”తెలుగు విజ్ఞాన సర్వస్వం” 16 భాగాలలో ప్రచురించారు. అదే విధంగా హిందీ వికాస సమితిని కూడా స్థాపించి హిందీలో ”విశ్వవిజ్ఞాన సంహిత” పేరుతో హిందీ విజ్ఞాస సర్వస్వాలను ప్రచురింప చేశారు.

ఆంధ్ర విశ్వ విద్యాలయం ఆయనను కళాప్రపూర్ణతో గౌరవిస్తే, కొన్ని విశ్వ విద్యాలయాలు గౌరవ డాక్టరేట్ తో సన్మానించాయి. భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ (1958), పద్మభూషణ్ (1962) పురస్కారాల్ని ఇచ్చి గౌరవించింది. అయన సేవలను పురస్కరించుకుని హైదరాబాదులో రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన 1957లో పెద్ద ఎత్తున అభినందన సభ జరిపి అభినందన గ్రంథం సమర్పించారు. ఆయన 1995 సంవత్సరం మార్చి 6 వ తేదీన పరమపదించారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments