రూరల్ క్రికెట్ ట్రోఫీ ఆవిష్కరించిన మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట 19 మార్చి 2021:
గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను జాతీయ స్థాయి క్రీడాకారులుగా తయారు చేయాలనే లక్ష్యంతో సకల క్రీడా సౌకర్యాలు కల్పించినట్లు, వీటిని సద్వినియోగం చేసుకుని జాతీయస్థాయి క్రీడాకారులుగా ఎదగాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆకాంక్షించారు.
ఆదివారం సిద్దిపేట ఆచార్య జయ శంకర్ క్రికెట్ స్టేడియంలో టి హెచ్ ఆర్ రూరల్ క్రికెట ట్రోఫీని అండర్ నైన్ టీన్ ఇండియా ఆటగాడు తిలక్ వర్మ, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ వేణుగోపాల్ రెడ్డి కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. గ్రామీణ క్రికెట్ ట్రోఫీ చాలా అద్భుతంగా జరుగుతున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ నిర్వహించిన స్ఫూర్తితో రూరల్ క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ టోర్నమెంట్ అద్భుతంగా సాగుతోందని ఇదే స్ఫూర్తితో ప్రతియేటా పోటీలను నిర్వహిస్తామన్నారు. ఈ క్రికెట్ టోర్నీ కి మొత్తం 98 జట్లు రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరికి ఫిజికల్ ఫిట్నెస్ అవసరమని క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు. తల్లిదండ్రులు పిల్లలను మార్కులు ర్యాంకులు తెచ్చు యంత్రాలు చూస్తున్నారని, చదువు తో పాటు పిల్లలకు క్రీడలు కూడా అంతే ముఖ్యమన్నారు. క్రీడల ద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుందన్నారు. పిల్లలను ఏ ఆటలో అభిరుచి ఉంటే ఆ ఆటలో తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. పిల్లలకు చదువుతో పాటు వారి ఫిట్నెస్ పట్ల తల్లిదండ్రులు ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. గెలుపు ఓటములు సహజమని ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో వ్యవరించాలని సూచించారు. టీమ్ లీడర్లు తమ జట్టు క్రీడ స్పూర్తితో ఆడేలా చూడాలన్నారు. సిద్దిపేట క్రికెట్ అసోసియేషన్ కు హెచ్ సీఏ-HCA గుర్తింపు కోసం ఆ దిశగా చర్యలు చేపట్టామన్నారు. తెలంగాణ క్రీడాకారుడు తిలక్ వర్మ అంతర్జాతీయ స్థాయిలో ఇండియాకు ప్రాతినిధ్యం వహించాలని మనసారా కోరుకుంటున్నట్లు మంత్రి చెప్పారు . అంతకు ముందు రంజీ క్రికెటర్ తిలక్ వర్మ మాట్లాడుతూ.. ఇండియా జట్టులో వెళ్లిన తర్వాత ఉప్పల్ స్టేడియంలో అవకాశం లభించిందని, ఇంత మంచి స్టేడియం సిద్ధిపేటలో ఉండటంతో మరో రెండేళ్ల ముందే ఇండియా జట్టులో క్రికెట్ ఆడేందుకు వెళ్ళే వాడినని చెప్పారు. మంత్రి హరీశ్ రావు సిద్ధిపేటను ఎంతగానో అభివృద్ధి చేశారని, హైదరాబాదు నుంచి సిద్ధిపేటకు వస్తే ప్రయాణం చేసినట్లు అనిపించలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ అసోసియేషన్ సెక్రెటరీ మల్లికార్జున్,మధు, బజ్జి విజయ్, తో పాటు ఆయా మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.