ఓంకారం ప్రణవం. ప్రణవనాదమే ఆదిబీజాక్షరం. అది సకల వాంగ్మయానికి మూలం. ఓంకారం తల్లి లాంటిది. వేదోపనిషత్తుల్లో, ఆగమ శాస్త్రాల్లో మంత్రయుక్తంగా(Mantram) ఉండే అక్షరాలు బీజాక్షరాలు. బీజాక్షరాలను మొదటగా రుషులు ప్రస్తావించారు. వారు మంత్రద్రష్టలు.
బీజంలో మహావృక్షం దాగిఉన్నట్లు, బీజాక్షరాల్లో అఖండ జ్ఞాన సంపద, ఆధ్యాత్మిక పరిజ్ఞానం ఉన్నాయి. బీజాక్షరాలను తంత్రాలన్నారు. మననం చేసేదే మంత్రం అంది వేదం.
ఉపాసకుడు మంత్రార్థాన్ని విచారణ చేసుకొని మననం చేస్తే విశేష ఫలమని చెప్పాయి శ్రుతులు. తెలిసిచేసే కర్మకు ఫలం అధికమన్నారు ఆదిశంకరులు. మహాకవి కాళిదాసు పూర్వాశ్రమంలో అక్షరంముక్క నేర్వని నిరక్షరుడు. తనకు తెలిసిన మార్గం దేవిని ప్రసన్నంచేసేలా చేసింది. ఆమె అనుగ్రహంతో మహాకవీశ్వరుడయ్యాడు కాళిదాసు.
యజుర్వేదంలో ఏడు కాండలు ఉన్నాయి. కాండ అంటే భాగం. మధ్యదైన నాలుగో కాండంలో శ్రీరుద్రం ఉంది. శ్రీరుద్రం మధ్యభాగంలో పంచాక్షరి మహామంత్రం ఉంది. పంచాక్షరి మధ్యభాగంలో ‘శివ’ అన్న ఈశ్వర స్వరూపమైన రెండు బీజాక్షరాలున్నాయి.
‘శివ’ అంటే అందరినీ బ్రహ్మానందంతో శమింపజేయువాడు, సజ్జనుల మనసులందు శయనించి ఉండేవాడని రుద్రసూక్తమ్ చెబుతోంది.
పరమేశ్వరుడు పంచముఖేశ్వరుడు. పంచముఖ మంత్రాలు క్షుప్తంగా ఉండి విశేషార్థాలను తెలుపుతాయి. అనంతవిశ్వం ఈశ్వరమయమని ఈశ్వర తత్వం ప్రబోధిస్తుంది. శ్రీరామ నామ తారకమంత్రం- కష్టాల కడలిని దాటించే నావ. తాపత్రయాలను తొలగించి సుఖసంతోషాలను ప్రసాదించేది తారకమంత్రం.
నిత్యం పఠించే శ్లోకాలకు, మంత్రాలకు తేడా ఉంది. శ్లోకాలు భగవానుడి గుణగణాలను కీర్తించే స్తుతులు, స్తోత్రాలు. మంత్రం భగవానుడి తత్వ జ్ఞానాన్ని మనోఫలకంపై ముద్రించుకొని ఆయన అనుగ్రహాన్ని పొందేందుకు మననం చేసుకొనే స్వరం. మంత్రాలు దేవతల సూక్ష్మరూపాలుగా పురాణేతిహాసాలు అభివర్ణించాయి.
శ్లోకాల్లోనూ ఎంతో అద్భుతరీతిలో బీజాక్షరాలను రుషిప్రపంచం పొందుపరచింది. మంత్ర పఠనంకన్నా శ్లోక పఠనం కొంత తేలిక. వీటివల్ల ఓంకారోపాసన చేసిన ఫలం దక్కుతుందని, దేవీదేవతలు ప్రీతిచెంది అనుగ్రహిస్తారని రుషిమండలం ప్రబోధించింది. మార్కండేయ మహర్షి చండీమంత్రాన్ని చండీ సప్తశతి శ్లోకాల్లో పొందుపరచారు. సప్తశతి పారాయణ చేస్తే చండీమంత్రాన్ని జపించినట్లే.
వాల్మీకి మహర్షి ఇరవై నాలుగువేల శ్లోకాలతో శ్రీమద్రామాయణాన్ని రచించాడు. గాయత్రి మహామంత్రానికి 24అక్షరాలు.ఈబీజాక్షరాలను శ్రీరామాయణంలో పొందుపరచారని అంటారు.
మంత్రం (Mantram)ఆత్మ ప్రకాశానికి, అర్థ ప్రకాశానికి హిమాలయం లాంటిది. ఒక్కొక్క మంత్రాక్షరానికి శరీరంలో ఒక్కొక్క స్థానం ఉంది. ఉచ్చారణ దోషం లేకుండా దిటవైన స్వరంతో పఠిస్తే శరీరంలోని నాడులన్నీ ఉత్తేజితమవుతాయి. రక్త ప్రసారాన్ని క్రమబద్ధం చేస్తుంది మంత్రపాఠం. ఈ సాధన అంతరంగ శుద్ధికి, ఆత్మ చైతన్యానికి దోహదపడుతుంది.
ఏ పని చేస్తున్నప్పటికీ అందుకు అనుకూలమైన మానసిక స్థితి అవసరం. అప్పుడే మంచి ఫలితాలు అందుతాయి. లక్ష్యంపైన మనసు లగ్నం అయ్యేందుకు మంత్రపఠనం దోహదపడుతుంది. మంత్ర(Mantram) పఠనంలో వినయం, ఆరాధనా భావం ఉండాలి. మననంలో భక్తి ప్రపత్తులు ఉండాలి.ఈవైఖరి లేనిమంత్రాధ్యయనం వ్యర్థం.
మంత్రాలకున్న మహత్తు ప్రియంగా, మంచిగా, మృదువుగా పలికే పలుకులకు ఉంటుంది. మాటే మంత్రంలా పనిచేస్తుంది. హితవైన మాటలు సర్వ జనాభిమానాన్ని పొందేలా చేస్తాయి. మాట కలిపితే శత్రువు మిత్రుడౌతాడు. మాటల్లోని సంస్కారం మనిషిని ఉన్నతంగా నిలుపుతుంది. ప్రియంగా, మంచిగా పలికే ప్రతిమాటా మంత్రమే.