భారత జాతిపిత మహాత్మాగాంధీ దేశ స్వాతంత్య్ర సాధన కోసం ఎన్నో సార్లు నిరాహార దీక్షలు చేపట్టారు. అయితే గాంధీజీ స్వతంత్రం వచ్చిన తరువాత నిరాహారదీక్ష కూడా చేసారు. ఆ నిరాహార దీక్షనే మహాత్ముని హత్యకు కారణం అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు.
స్వాతంత్ర్యానంతరం గాంధీ ప్రయత్నాలు హిందూ – ముస్లిం విద్వేషాలను నివారించడానికి పరిమిత మయ్యాయి. ముస్లిం నాయకుడైన మహమ్మద్ ఆలీ జిన్నాను ప్రధాని మంత్రిగా చేసైనా దేశ విభజనను ఆపాలని గాంధీ భావించారు. ఇది హిందూ – ముస్లింల మధ్య మరింత చిచ్చు రాజేసింది. నెహ్రు, సర్దార్ వల్లబాయ్ పటేల్ లు గాంధీ విధానాన్ని వ్యతిరేకించారు. విభజన జరిగితే నే అల్లర్లు సమసి పోతాయని వారు భావించారు. దేశ విభజనో..అంతర్గత యుద్ధమో తేల్చుకోండని జిన్నా పిలుపు నివ్వడం గాంధీని ఇరకాటంలో పడేసింది. 1947 ఆగస్టు 15న దేశ మంతా సంబరాలు జరుపు కుంటుంటే…గాంధీ మాత్రం కలకత్తాలోని ఒక హరిజన వాడను శుభ్రం చేస్తూ గడపడం విశేషం.
దేశ విభజన ప్రతిపాదన, దానికి వ్యతిరేకంగా చెలరేగిన అల్లర్లు, అవి దారితీసిన ఉద్రిక్తతలు, మత ఘర్షణల ఫలితంగా అనూహ్యమైన రీతిలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రభుత్వం పరిస్థితిని అదుపు చేయలేని అసహాయ స్థితిలో పడింది. మొత్తం పోలీసు బలగాలు దేశ పశ్చిమ ప్రాంతానికి పంప బడ్డాయి. తూర్పు ప్రాంతంలో కల్లోలాలను అదుపు చేసే భారం గాంధీ పై పడింది. దేశ విభజనతో ముఖ్యంగా పంజాబు, బెంగాలులలో పెద్దఎత్తున సంభవించిన వలసల వల్ల మత కలహాలు, మారణ కాండలు ప్రజ్వరిల్లాయి. 1947లో కాశ్మీరు విషయమై భారత్ – పాకిస్తాన్ యుద్ధం తరువాత ఇంటా, బయటా పరిస్థితి మరింత క్షీణించింది. ముస్లిము లందరినీ పాకిస్తాను పంపాలనీ, కలసి బ్రతకడం అసాధ్యమనీ వాదనలు నాయకుల స్థాయిలోనే వినిపించ సాగాయి. ఈ పరిస్థితి గాంధీకి మింగుడు పడని అంశంగా మారింది. దీనికి తోడు విభజన ఒప్పందం ప్రకారము పాకిస్తానుకు ఇవ్వవలసిని 55 కోట్లు రూపాయలను ఇవ్వడానికి భారత ప్రభుత్వం నిరాకరించింది.
ఆ డబ్బు భారతదేశంపై పాకిస్తాన్ యుద్ధం చేస్తే యుద్ధానికి ఉపయోగ పడుతుందని సర్దార్ పటేల్ వంటి నాయకుల అభిప్రాయం. కాని అలా కాకుంటే పాకిస్తాన్ మరింత ఆందోళన చెందుతుందనీ, దేశాల మధ్య విరోధాలు ప్రబలి మత విద్వేషాలు సరిహద్దులు దాటుతాయనీ, అంతర్యుద్ధానికి దారితీస్తుందనీ గాంధీజీ అభిప్రాయం.
జనవరి 12, 1948. ఆ రోజు సాయంత్రం తన రోజువారీ ప్రార్థన సమావేశంలో, మరుసటి రోజు ఉదయం నుండి ఆమరణ ఉపవాసం కూర్చుంటానని గాంధీ ప్రకటించారు.
1948 జనవరి 13న మధ్యాహ్నం సుమారు 12 గంటలకు గాంధీజీ రెండు డిమాండ్లతో నిరాహార దీక్షలో కూర్చున్నారు. మొదటి డిమాండ్ పాకిస్తాన్‌కు భారత్ విభజన ఒప్పందంకు సంబంధించిన మిగిలిన రూ.55 కోట్లు ఇవ్వాలి. రెండోది దిల్లీలో ముస్లింలపై జరుగుతున్న దాడులు ఆగాలి. దీనికి ముందు గాంధీ తన రోజువారీ పనులను పూర్తి చేశారు. నెహ్రూ, పటేల్, ఆజాద్‌లతో ఆయన సుదీర్ఘ చర్చలు జరిపారు. కొంతమంది బిర్లా హౌస్ పచ్చిక బయళ్లలో గుమిగూడారు. ‘వైష్ణవ జ న్ తో తేనె కహియే తో పాటు, ఆయనకు ఎంతో ప్రియమైన భజన్లను, శ్లోకాలను పాడారు. తర్వాత ఖురాన్ మరియు గురు గ్రంథ్ సాహిబ్ నుండి శ్లోకాలు పఠించ బడ్డాయి.
అలా ఆయన ఢిల్లీలో తన జీవితంలో చివరి ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు. ఎవరెంతగా ప్రాధేయపడినా ఆయన తన దీక్ష మానలేదు. చివరకు భారత ప్రభుత్వం దిగివచ్చి పాకిస్తానుకు 55 కోట్ల డబ్బు ఇవ్వడానికి అంగీకరించింది. 1948 జనవరి 18న ఒక శాంతి కమిటీ ఏర్పాటైంది. ముస్లింలు దిల్లీలోని తమ ఇళ్లలోకి వెళ్లవచ్చని, హిందువులు, సిక్కుల ఆక్రమణ నుంచి మసీదులను విడిపిస్తామని, అక్రమ కబ్జాల నుంచి ముస్లింల ప్రాంతాలను విడిపిస్తామని, ఇళ్ల నుంచి భయపడి వెళ్లిపోయిన ముస్లింలు తిరిగి రావడానికి హిందువుల నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండదని ఆ కమిటీ మహాత్మా గాంధీకి హామీ ఇచ్చింది. హిందూ, ముస్లిమ్, సిక్కు వర్గాల నాయకులు సఖ్యంగా ఉండటానికి కట్టుబడి ఉన్నామని ఆయనవద్ద ప్రమాణం కూడా చేశారు. జనవరి 18న మధ్యాహ్నం 12.45కు మౌలానా ఆజాద్ ఇచ్చిన నారింజ రసం తాగిన మహాత్మా గాంధీ తన నిరాహార దీక్షను విరమించారు.
కాని ఈ మొత్తం వ్యవహారంలో గాంధీ పట్ల మతోన్మాదుల ద్వేషం బలపడింది. మత ప్రాతిపదికన పాకిస్తాన్ ప్రత్యేక దేశం ఏర్పాటుకు గాంధీ వ్యతిరేకిస్తున్నారని ముస్లింలు భావించగా, ముస్లింల వేధింపులపై ప్రతీకారం తీర్చుకునేందుకు గాంధీ తమకు అడ్డుపడుతున్నాడని హిందు తీవ్రవాదులు భావించారు.
ఈ నేపథ్యంలో గాంధీ హత్యకు దారితీసింది హిందు- ముస్లింల మధ్య నెలకొన్న కలహాలే అనే వాదన బలంగా ఉంది.
ఈ క్రమంలోనే నాథూరామ్ గాడ్సే పథకం ప్రకారం 1948 సంవత్సరం జనవరి 30వ తేదీ నాడు బిర్లా మందిర్ ప్రార్థన మందిరం మైదానంలో హత్య చేయడం జరిగిందని స్పష్టమయింది. “గాంధీ సమ్మతితో కాంగ్రెస్ లోని అగ్రనేతలు అంతా కలిసి దేశాన్ని చీలికలు – పేలికలుగా మార్చారని, దేశ విభజనకు సమ్మతి తెలిపి పెద్ద కుమారుడు వంటి గాంధీ భారత దేశానికి ద్రోహం చేయడం ద్వారా ఆయన తన ధర్మాన్ని నెరవేర్చడంలో ఘోరంగా విఫలం అయ్యాడని, అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే నేను తుది నిర్ణయానికి వచ్చానని, అందుకే తానే గాంధీని కాల్చి చంపానని”
.. గాడ్సే కోర్టులో వివరించాడు. స్వతంత్ర భారతదేశంలో ఉరితీయబడిన మొదటి వ్యక్తిగా గాంధీని చంపిన నాధురాం వినాయక్ గాడ్సే చరిత్రలో నిలిచి పోయాడు.
