– 20 ఎకరాల భూమిపై కన్నేసిన ఎమ్మెల్యే
– న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యం
– నిజాం కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ భూక్యా తిరుపతి నాయక్ ఆరోపణ
– సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ న్యాయం చేయాలని విజ్ఞప్తి
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని, ప్రభుత్వం తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని జనగామ జిల్లా, తరిగొప్పుల మండలం బొత్తలపర్రె గ్రామానికి చెందిన బాధితుడు, నిజాం కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ భూక్యా తిరుపతి నాయక్, అతని భార్య మౌనిక అన్నారు. తమకు న్యాయం చేయాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. బొత్తలపర్రె గ్రామంలో సర్వే నెం.49లోని తమ 20 ఎకరాల వ్యవసాయ భూమిపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కన్నేసి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 30 ఏండ్ల కిందట భూమి అమ్ముకుని వెళ్లిన సమీప బంధువులను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తనపై, తన కుటుంబంపై ఉసిగొల్పి దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ 20 ఎకరాల భూమిని ఎమ్మెల్యే తన పలుకుబడితో అనుచరుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రికార్డుల్లో తన భూమి కనిపించకుండా పోయిందన్నారు. ఈ విషయమై జనగామ ఏసీపీ దేవేందర్ రెడ్డిని కలువగా ”దున్నే వాడిదే భూమి” అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బెదిరింపులకు గురిచేశారని చెప్పారు. గతంలో తనపై మూడుసార్లు హత్యాయత్నం జరిగినట్టు చెప్పారు. వారం కిందట ఎమ్మెల్యే అనుచరులు తన వ్యవసాయ బావి దగ్గర మోటారు వైర్లు కట్ చేసి విద్యుత్ సరఫరా నిలిపేసి దాడికి పాల్పడ్డారన్నారు. తనపై, వృద్ధులైన తన తల్లిదండ్రులపై దాడులు జరుగుతున్నా పట్టించుకునే నాధుడు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన తల్లిదండ్రులకు ఏం జరిగినా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి బాధ్యత వహించాలని హెచ్చరించారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానన్నారు. ఈ విషయంపై త్వరలో మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసి.. అనంతరం గవర్నర్‌కు వినతిపత్రం సమర్పిస్తానని తిరుపతి నాయక్ తెలిపారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని, లేకపోతే కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటామని కన్నీటి పర్యంతమయ్యారు.