హిందూమత పురాణాలలో శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాలలో రెండవ అవతారం కూర్మావతారం. దశావతారాలలో కూర్మావతారం నేరుగా రాక్షస సంహారం కోసం అవతరించినది కాకపోయినా, విశిష్ట ప్రయోజనాన్ని బట్టి ఉద్దేశింప బడినది(Kurma Jayanti).
కూర్మము అనగా తాబేలు. అసురు వేధింపులకు తాళలేక ఇంద్రాది దేవతలు బ్రహ్మతో కలసి పురుషోత్తముని ప్రార్ధించారు. కారణాంతరంగుడైన శ్రీ హరి అమృతోత్పాదన యత్నాన్ని సూచించాడు. పాల సముద్రంలో సర్వ తృణాలు, లతలు, ఓషధులు వేసి మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని, వాసుకి మహా సర్పాన్ని తరి తాడుగా చేసుకుని మధిస్తే సకల శుభాలు కలుగుతాయని, అమృతం లభిస్తుందని పలికాడు. ఆ మేరకు ఇంద్రుడు దానవులనూ సాగర మధనానికి అంగీకరింప చేసాడు. పాముకు విషం తల భాగంలో ఉంటుంది. అది మృత్యు స్వరూపం. రాక్షసులు తామసులు. తమస్సు పాప భూయిష్టం. దాన్ని అణచివేస్తే తప్ప లోకంలోనైనా, మనస్సులోనైనా ప్రకాశం కలుగదు. అందుకే శ్రీహరి రాక్షసుల్ని మృత్యు రూపమైన వాసుకి ముఖం వద్ద నిలిపాడు. మధనంలో బరువుగా ఉండి కింద ఆధారం లేకపోవటంతో పర్వతం సముద్రంలో మునిగి పోయింది. బ్రహ్మాండాన్ని తలపింపజేసే పరిమాణంతో సుందర కూర్మ రూపంలో శ్రీ మహావిష్ణువు అవతరించాడు. పాల సముద్రంలో మునిగి పోయిన సుందర పర్వతాన్ని తన కర్పకం (వీపు) పై నిలిపాడు. క్షీరసాగర మధనంలో చిట్ట చివర లభించిన అమృత కలశానికై దేవ దానవులు కలహించగా, విష్ణువు మోహిని రూపం దాల్చి, రాక్షసులను సమ్మోహితుల్ని చేసి దేవతలకు అమృతం ప్రసాదించాడు. ఇది కృతయుగం లో సంభవించిన అవతారం. కూర్మ అవతారాన్ని పోతన తన భాగవతంలో ఇలా వర్ణించాడు.
“సవరనై లక్ష యోజనముల వెడల్పై కడు గఠోరంబైన కర్పరమున
నదనైన బ్రహ్మాండమైన నాహారించు ఘనతరంబగు ముఖ గహ్వరంబు విశ్వంబుపై వేఱు విశ్వంబు పైబడ్డ నాగిన గదలనియట్టి కాళ్ళు వెలిగి లోనికి జనుదెంచు విపుల తుండ మంబుజంబుల బోలెడి యక్షియుగము సుందరంబుగ విష్ణుండు సురలతోడి
కూర్మి చెలువొందనొక మహా కూర్మమయ్యె”.

అలా దేవదేవుని అండతో సముద్ర మథన కార్యం కొనసాగింది. ముందుగా జగములను నాశనము చేయగల హాలా హలము ఉద్భవించినది. దేవతల మొర విని, కరుణించి, పరమ శివుడు హాలా హలాన్ని భక్షించి, తన కంఠంలోనే నిలిపాడు. అందుచేత ఆయనను గరళకంఠుడు అనీ, నీలకంఠుడు అనీ అంటారు. తరువాత సుర (మధువు), ఆపై అప్సరసలు, కౌస్తుభము, ఉచ్ఛైశ్రవము, కల్పవృక్షము, కామధేనువు, ఐరావతము వచ్చాయి. ఆ తరువాత త్రిజన్మోహినియైన శ్రీలక్ష్మీదేవి ఉద్భవించింది. సకలదేవతలు ఆమెను అర్చించి, కీర్తించి, కానుకలు సమర్పించు కొన్నారు. ఆమె శ్రీమహావిష్ణువును వరించింది. చివరకు ధన్వంతరి అమృత కలశాన్ని చేతబట్టుకొని బయటకు వచ్చాడు. తరువాత విష్ణువే మోహినిగా ఆ అమృతం దేవతలకు దక్కేలా చేశాడు. “క్షితిరతి విపులతరే తవ తిష్ఠతి పృష్టే, ధరణి ధరణ కిణ చక్ర గరిష్టే
కేశవ! ధృత కచ్ఛప రూప!
జయ జగదీశ హరే!” అంటూ
జయదేవుడు స్తోత్రంలో కూర్మావ తార వర్ణన గావించాడు.
ప్రపంచం లోనే ఏకైక కూర్మ దేవాలయంగా చెప్పబడుతున్న పుణ్యక్షేత్రం శ్రీకూర్మం. శ్రీకాకుళం జిల్లాలోని గార మండలంలో శ్రీకాకుళం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వంశధారా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది.
కృతయుగంలో శ్వేతరాజు, ఆయన భార్య వంశధారల తపస్సుకు, భక్తికి మెచ్చుకున్న కూర్మనాధుడు వారి కోరిక ప్రకారం ఈ క్షేత్రంలో పశ్చిమ ముఖంగా వెలిశాడట. ఈ క్షేత్ర ప్రస్తావన కూర్మ, బ్రహ్మాండ, పద్మ పురాణాలలో వుంది. శ్రీరాముడు, బల రాముడు, జమదగ్ని మొదలైన పురాణ పురుషులెందరో ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాలు చెబుతున్నాయి.
మరే దేవాలయంలోను లేనివిధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభా లున్నాయి. ఈ స్తంభాలు రెండూ శివ కేశవులకు ప్రతీకలుగా చెప్తారు. ఇది వైష్ణవ క్షేత్రమే. అయినా శివ కేశవులకు చిహ్నాలుగా చెప్పే ఈ ధ్వజస్తంభాలు శివకేశవుల అభేద తత్వాన్ని సూచిస్తున్నాయి.
ఈ క్షేత్రం కృతయుగం నాటిది. దేవాలయంలోని మూలవిరాట్టు సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి చేత ప్రతిష్టించ బడిందట. కూర్మావతారం మందిరం శిల్పకళాశైలి విశిష్టమైనది. 11వ శతాబ్దం కాలం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి.
