చిత్రకళా ప్రపంచంలో ఆయన ఓ మహా వృక్షం. చిత్రకళకు ఎనలేని కీర్తిని ఆర్జించిన పెట్టిన అద్భుత కళాకారులు ఆయన. ఆయనే భారతీయ సాంప్రదాయ చిత్ర లేఖనంలో అద్భుతాలు సాధించిన చిత్ర లేఖకులు కొండపల్లి శేషగిరి రావు. తెలుగు చిత్రకళను అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించి, విశ్వ వ్యాపితం చేసిన గొప్ప కళాకారులు శేషగిరిరావు. కొండపల్లి శేషగిరి రావు Kondapalli Seshagiri Rao (జనవరి 22, 1924 – జూలై 26, 2012) తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ధ చిత్రకారులైన కొడపల్లి శేషగిరి రావు 1924 జనవరి 22 న వరంగల్ జిల్లా, పెనుగొండ గ్రామంలో ఒక బ్రాహ్మణ భూస్వామ్య కుటుంబంలో జన్మించారు.
వేయి స్తంభాల గుడి, రామప్ప గుడి, పరిసరాల శిల్ప కళా సౌందర్యాన్ని, ఆయా దృశ్యాల నుండి స్ఫూర్తిపొంది తన మనో ఫలకంపై ముద్రించుకుని, సుదీర్ఘ, సునిశిత అధ్యయనంతో కొన్ని వందల చిత్రాలకు ఆయన జీవం పోశారు.
చిన్నతనం లోనే ఆయనలోని సృజనాత్మకతను పరిశీలించిన ఆ పాఠశాల డ్రాయింగ్ మాస్టర్ దీనదయాళ్ ఆనాడే కొండపల్లి గొప్ప కళాకారుడవుతాడని గ్రహించారు. ప్రోత్సహించారు. బెంగాల్, శాంతినికేతన్ లో చిత్రలేఖనం అభ్యసించి, జె ఎన్ టి యు ఫైన్ అర్ట్స్ కళాశాలలో అధ్యాపక వృత్తి చేపట్టారు. అయితే ఆయన చిత్రలేఖనా ప్రస్థానం అప్రతి హతంగా సాగింది. భారతీయ ఇతిహాస అంశాలను చిత్రించడంలో శేషగిరిరావు పట్టు సాధించారు. ఆయనది అందె వేసిన చేయిగా మలుచు కున్నారు.
అజంతా, ఎల్లోరా గుహాల చిత్రాలను (తిరిగి) గీసిన చిత్రకారుడు జలాలుద్దిన్ ద్వరా కొన్ని మెళకువలు నేర్చుకున్నారు. జైపూర్ లోని బనస్థలి విద్యాపీట్ లో “ఫ్రెస్కో” పెయింటింగ్ పద్ధతిని అభ్యసించారు.
ప్రకృతి, చారిత్రక గాథలను.. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలాన్ని ఆయన సజీవ చిత్రాలుగా మలిచారు. ఆయన చిత్రాలలో శకుంతల, దమయంతి, రామాయణం వంటి పురాణాల వివిధ సన్నివేశాలు పలువురి ప్రశంసలు అందు కున్నాయి. లేపాక్షి తదితర చారిత్రక చిత్రకళా కేంద్రాలను దర్శించి, తన భావానుగుణంగా రూపు నిచ్చారు. వరూధినీ- ప్రవరా ఖ్యుడు, రాణి రుద్రమ, గణపతి దేవుడు, శకుంతల చిత్రాలను చిత్రించారు. పోతన భాగవతాన్ని 16 సార్లకు పైగా చదివి, కొండపల్లి అద్భుత సృష్టి చేశారు. చిత్రించారు. అజంతా, ఎల్లోరా, రామప్ప, రాచకొండ దేనినీ ఆయన వదల లేదు. దశాబ్దాల నాటి రంగుల్లో ఆంధ్రపత్రికలో ముఖచిత్రంగా వచ్చిన పోతన చిత్రాన్ని వందలాది తెలుగువారు ఫ్రేములు కట్టించు కున్నారంటే ఆయన ప్రతిభ స్పష్టం అవుతున్నది. ఆక్వా టెక్స్‌చర్ పెయింటింగ్‌లకు ఆయన మార్గదర్శకుడిగా చెబుతారు. ఆయన చిత్రాలను దేశ పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీ , సాలార్ జంగ్ మ్యూజియం లలో ప్రదర్శించారు. కైరో, ఇటలీ, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, కోలాలాంపూర్, లండన్, అమెరికా, మాస్కో తదితర దేశాల్లో జరిగిన ఎగ్జిబిషన్లలో శేషగిరిరావు చిత్రాలు ప్రదర్శిత మయ్యాయి. వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం, పిట్స్‌బర్గ్ వేంకటేశ్వర స్వామి ఆలయాలకు ఆయన చిత్రాలు మరింత శోభను తీసుకు వచ్చాయి.
1975లో ప్రపంచ తెలుగు మహాసభలకు ఆయన రూపొందించిన తెలుగుతల్లి పెయింటింగ్ ప్రశంసలు పొందింది. తెలుగు మహాసభల సందర్భంగా కొండపల్లి శేషగిరిరావు తెలుగు తల్లిని సాక్షాత్కరింప జేశారు. ఆ చిత్రం ఆధారంగానే తెలుగు తల్లి విగ్రహాలనూ రూపొందించారు. విశ్వామిత్రుడు వంటి ఐతిహాసిక వ్యక్తుల నుంచి, శాతవాహనులు, విష్ణుకుండినులు, పల్నాటి బ్రహ్మనాయుడు వంటి చారిత్రక వ్యక్తుల నుంచి, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వరకూ తన చిత్రంలో నీరాజనం పలికారు కొండపల్లి. అన్నమయ్య, త్యాగయ్య వంటి వాగ్గేయకారులు, జానపద కళాకారులు ఆయన కళా రూపాల్లో ఒదిగి పోయారు. మహాత్మా.గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్ర్తి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలతో పాటు ఎంతో మంది ప్రముఖులు ఆయన చిత్రాలను మెచ్చు కున్నారు.1994 లో శేషగిరిరావును అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రత్యేకంగా సత్కరించారు. మ్యాక్స్ ముల్లర్ భవన్ డైరెక్టర్ పీటర్ స్విడ్జ్‌ల అభినందనలు అందుకున్నారు. 1950 నుంచి 90 వరకు ఆయన 37 వ్యాసాలు రాశారు. అవి ‘చిత్ర, శిల్పకళా రామణీయకము’ పేరుతో 2009లో పుస్తకంగా వెలువడ్డాయి.
హైదరాబాదు, మైసూరు, మద్రాసు, ఆలిండియా ఆర్ట్ ఎగ్జిబిషన్స్, కోల్‌కతా అకాడమీ ఆఫ్ ఫైనార్ట్, ఏపీ లలిత కళా అకాడమీ అవార్డులను అందుకున్నారు. భారత దేశ స్వాతంత్ర సమరంలో పాల్గొన్న అరవై వసంతాల తరువాత ప్రభుత్వం, జులై 2005 లో శేషగిరి రావును “స్వాతంత్ర సమర యోధుడిగా” గుర్తించి 3,000 రూపాయల వేతనం అందించింది.
కేంద్ర మానవ వనరుల శాఖ పక్షాన 1988లో ఎమిరిటస్ ఫెలోషిప్‌ను, తెలుగు యూనివర్సిటీ ద్వారా డాక్టరేట్‌ను ఆయనకు అందజేశారు.1993 లో రాజీవ్ రత్న ఎవార్డు పొందేరు. 1996 లో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. ప్రతిష్ఠాత్మక హంస అవార్డును కూడా ఆయన అందుకున్నారు.
