ఆంధ్రా భద్రాచలంగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒంటిమిట్ట లోని ప్రాచీన కోదండ రామాలయం చారిత్రక, ఐతిహాసిక, పౌరాణిక ప్రాధాన్యం కలిగిన ప్రాచీన హిందూ దేవాలయం. ఈ కోవెలలో మూలమూర్తులు కోదండ రాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి. సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలలో వున్నందున ఆ క్షేత్రం ఏకశిలానగరం అని ప్రసిద్ధి గాంచింది. భారత దేశంలో హనుమంతుడు లేని రామాలయం అది ఒక్కటే. అక్కడ ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమితో ప్రారంభించి, బహుళ విదియ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఆలయ నిర్వహణ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానములకు అప్పగించింది.
రాక్షసుల బారినుండి తాము చేస్తున్న యాగరక్షణకు, దశరథుని ఒప్పించి చిన్నారులయిన రామ లక్ష్మణులను విశ్వామిత్రుడు తమ వెంట తీసుకెళ్లిన విషయం విదితమే. సీతారామ కల్యాణం జరిగాక కూడా, అలాంటి సందర్భమే ఒకటి కలుగగా, మృకండు మహర్షి, శృంగి మహర్షి… రాముని ప్రార్థించడంతో దుష్టశిక్షణ కోసం, కోదండ రాముడు సీతా లక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం, పట్టుకుని ఆ ప్రాంతానికి వెళ్ళి, యాగ రక్షణ చేశాడని పురాణ ఆధారం. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారనీ, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారనీ ఆ ప్రాంత ప్రజల విశ్వాసం. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థం ఉంది. సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని చెపుతుంటారు.
ఫ్రెంచి యాత్రికుడు ట్రావెర్నియర్ 16వ శతాబ్దంలో ఆ రామాలయాన్ని దర్శించి “భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి” అని కీర్తించాడు.
గోపుర నిర్మాణం చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది. ఆలయంలోని ప్రధాన విగ్రహాలు ఒకే శిలలో రాముడు, సీత, లక్ష్మణుడు విగ్రహాలు చెక్కబడ్డాయి. రాముని విగ్రహం పక్కన హనుమంతుని విగ్రహం లేని రామాలయం భారత దేశంలో ఇదొక్కటే. శ్రీరామ హనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామ లక్ష్మణుల ఏకశీలా విగ్రహం స్థాపించినట్లు కథనం.
ఈ కోదండ రామాలయానికి మూడు గోపుర ద్వారాలున్నాయి. విశాలమైన ఆవరణముంది. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. 32 శిలాస్తంభాలతో రంగ మంటపం నిర్మించ బడింది. రంగమంటపం విజయనగర శిల్పాలను పోలి ఉంది. పొత్తపి చోళులు, విజయ నగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు. ఒంటిమిట్ట నివాసి, ఆంధ్రవాల్మీకి అని పేరొందిన వావిలికొలను సుబ్బారావు (1863 – 1936) ఈ రామాలయాన్ని పునరుద్ధరించారు. స్వామికి ఆభరణాలను చేయించడంతో బాటు రామసేవా కుటీరాన్ని నిర్మించారు. ఆయన కొబ్బరి చిప్ప చేతపట్టి భిక్షాటన చేసి వచ్చిన సొమ్ముతో సుమారు పది లక్షల రూపాయల విలువైన ఆభరణాలను చేయించ గలిగారు. పోతన, అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగుండూరు వేంకటకవి, వరకవి మరెందరో ఈ స్వామికి కవితార్చన చేశారు. వావిలికొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించి, దానికి మందరం అను పేర వ్యాఖ్యానం కూడా వ్రాశారు. గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రక్కగా రథశాల – రథం ఉన్నాయి.
చోళ, విజయనగర వాస్తు శైలులు కనిపించే ఈ ఆలయ స్తంభాలపైన రామాయణ భాగవత కథలను చూడవచ్చు. ప్రౌఢ దేవరాయల ఆస్థానంలోని అయ్యల తిప్పరాజు ఆ ప్రాంతవాసి. ఆయన స్వామిపైన ”శ్రీ రఘువీర శతకాన్ని” రచించాడు. ఆయన మనవడే అష్ట దిగ్గజాల్లో ఒకడైన అయ్యలరాజు రామభద్రుడు.
చంద్రుని వెలుగుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. క్షీరసాగర మథనం ఆనంతరం, మహాలక్ష్మీదేవిని వైకుంఠ నాథుడు తన సతీమణిగా స్వీకరించాడు. పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేక పోతున్నానని ఆమె తోబుట్టువు అయిన చంద్రుడు స్వామి వారికి విన్నవించగా ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కల్యాణాన్ని వీక్షించవచ్చని మహా విష్ణువు వరమిచ్చాడు. దాని ప్రకారమే రాత్రిళ్లు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు.
కరోనా కారణంగా గత రెండేళ్లుగా బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే నిర్వహించగా, కోవిడ్ వ్యాప్తి అదుపులోకి రావడంతో ఈ ఏడాది ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. అందుకు అధికారులు తగిన విధంగా ఏర్పాట్లు చేశారు. ఈనెల 19వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేశారు.
ఈ నెల 15న చైత్ర శుద్ధ చతుర్దశి నాటి రాత్రి పున్నమి వెన్నెలలో సీతారాముల కల్యాణ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పౌర్ణమి రోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటలలోపు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం నిర్వహించ నున్నారు. ఒంటిమిట్ట కోదండ రామ స్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని… టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, డిప్యూటి ఈవో రమణ ప్రసాద్ ఆహ్వానించిన క్రమంలో, స్వయంగా హాజరై, సీతారాములకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సీఎం జగన్ సమర్పించ నున్నారు.
రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494