మన తెలుగు సంస్కృతికి ప్రతీక, భారతీయ సనాతన సంప్రదాయానికి పతాక, చక్రపాణి మానస పుత్రిక బి.నాగిరెడ్డి పిల్లల పత్రిక…చందమామ. దాదాపు ఆరున్నర దశాబ్దాల క్రితం, 1947 జూలై నెలలో తొలిసారిగా ‘చందమామ’ ఆవిష్కృతం అయింది. సరళమైన భాష, చక్కటి శైలి, చిన్న చిన్న పదాలు అర్ధవంతమైన భాష, ఆకర్షణీయ మైన బొమ్మలు. చందమామ అనిర్వచనీయ కథలన్నీ ఆ బాల గోపాలాన్నీ మరో ప్రపంచానికి తీసుకెళ్ళే వశీకరణ రూపాలే. చందమామ గురించి కవిసమ్రాట్, ‘చందమామ నా చేత కూడా చదివిస్తున్నారు. పత్రిక రావడం ఆలస్యమైతే కొట్టువాడితో దెబ్బలాడతా’ అని ఒక సందర్భంలో అన్నారంటే చందమామ ఎంత ప్రసిద్ధి పొందిందో, పిల్లల పెద్దల మనసులో ఎంత స్థానం సంపాదించుకుందో అర్థం చేసుకోవచ్చు.
చందమామతో ప్రత్యేక సంబంధం అనుబంధం కలిగిన అసమాన చిత్రకారుడు శంకర్. చందమామ తాతయ్యగా గుర్తింపు పొందిన శంకర్ పేరు తీయగానే గుర్తొచ్చేవి భేతాళ కథలు. ప్రతినెలా శవంలోకి బేతాళుడు ప్రవేశించి కథచెప్పి, ప్రశ్నలడిగి, హెచ్చరించి, విక్రమార్కుడికి మౌనభంగం చేసి, అతను వచ్చిన పని కాకుండా చేసేవాడు. బాలల పత్రిక చందమామలో చిత్రకారునిగా “విక్రం, భేతాళ” కథలలో చిత్రాలు వేయడం ద్వారా శంకర్ గుర్తించ బడ్డారు. ఆయన చిత్రాలలో “శంకర్” అనే సంతకం ఉంటుంది. ఆయన వేసిన బొమ్మలు అన్నీ ఒక ఎత్తు, బేతాళ కథలకు శీర్షిక బొమ్మగా వేసిన బొమ్మ ఒక ఎత్తు. బేతాళ కథలకు ప్రత్యేక శీర్షిక బొమ్మగా విక్రమార్కుడు చేతిలో కరవాలం భుజాన శవాన్ని మోసుకుంటూ వెడుతూ ఉంటే, శవంలోని బేతాళుడు కథ చెప్పటం ఆయన వేసిన బొమ్మ ప్రపంచ ప్రసిధ్ధి పొందింది. తెలుగు పత్రికా చరిత్రలో అతి ఎక్కువకాలం ధారావాహికగా కొనసాగిన శీర్షిక చందమామలో బేతాళ కథలే. చందమామలో చివరివరకూ ఆయన వేసిన బేతాళ బొమ్మనే కొనసాగించారు.
చందమామ పత్రికతో 60ఏళ్లకు పైగా మమేకమై, మొట్ట మొదట పనిచేసిన చిత్రకారులైన వడ్డాది పాపయ్య, తోడా వీర రాఘవన్ (చిత్రా) లతో పాటు కలిసి పని చేశారు.1955లో చక్రపాణి, కుటుంబరావు తెలుగులో బేతాళ కథలకు అప్పటివరకు వస్తున్నవాటిని మార్చి కొద్దిగా మార్పులు చేర్పులు చేసి బొమ్మలు గీయమని సూచించగా, 2012 చివరి వరకు ఆయన చిత్రాలు గీస్తూనే వచ్చారు. చందమామలో శంకర్ బొమ్మలు వాటిని అనుసరించిన పిల్లలకు పౌరాణిక పాత్రలు ఇలా ఉంటాయని చెరగని ముద్రలు వేసిన గొప్పదనం శంకర్ కే దక్కింది. చందమామలో వచ్చిన రామాయణం, మహా భారతం సీరియల్స్‌కి వేసిన బొమ్మలతో పౌరాణిక పాత్రలకు దివ్యత్వం కలిగించిన గొప్ప ఆర్టిస్టు శంకర్. పురాణాల పాత్రలను పిల్లలకే కాదు పెద్దలకు కూడా కళ్ళకు కట్టిన ఘనత ఆయనది.
సుపరిచితుడైన చిత్రకారుడైన కరతొలువు చంద్రశేఖరన్ శివ శంకరన్ (కె.సి.శివశంకరన్) “శంకర్” గా 1924 జూలై 19న తమిళనాడు లోని ఈరోడ్ సమీపంలోని గ్రామంలో జన్మించారు. శంకర్ తన బాల్యం నుండే కళ పట్ల మక్కువ పెంచుకున్నారు. తన చరిత్ర పరీక్షలలో అతను చారిత్రక పాత్రల చిత్రాలను గీసేవారు. నాగిరెడ్డి కూడా చదువుకుంటున్న కుతియాల్ పేట్ ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్ ఉపాద్యాయుడు శంకర్ లోని ప్రతిభను గుర్తించారు. ఆదివారాలలో అతని వద్దకు వచ్చేటట్లు చేసారు. అక్కడ శంకర్ ఇతర విద్యార్థులు గీచిన చిత్రాలను సదిదిద్దడం ద్వారా తన డ్రాయింగ్ ఉపాధ్యాయునికి సహాయం చేస్తూ అందుకు బదులుగా చిత్రలేఖనానికి ఆవసరమైన సామాగ్రి అయిన డ్రాయింగ్ పుస్తకాలు, పెన్సిల్స్, ఎరేజర్లను సంపాదించారు.1946లో తమిళ పత్రిక కలైమగై లో చిత్రకారునిగా నెలకు 85 రూపాయల వేతనంతో చేరారు. 1952 లో అతని సంపాదన 150 రూపాయలు. తన పెద్ద కుటుంబానికి పోషించడానికి సరిపోని స్థితిలో ఆయన మరొక 150 సంపాదించడానికి ఇతర పత్రికలను ఆశ్రయించారు. ఆ సంవత్సరం నాగిరెడ్డి చందమామ పత్రికలో చిత్రకారునిగా 350 రూపాయల నెల జీతంతో నియమించారు. కానీ రికార్డులలో వేతనం 300 మాత్రమే చూపించేవారు. ఎందుకంటే అప్పటికే పనిచేస్తున్న ప్రధాన చిత్రకారుడు చిత్రాకు కూడా జీతం 350 రూపాయలు. చిత్రా, శంకర్ లు ప్రత్యర్థులుగా వృత్తిజీవితంలో ఉన్నా, 1978లో చిత్రా మరణించే వరకు మంచి స్నేహితులుగా ఉన్నారు. నాగిరెడ్డి ఒక సందర్భంలో చిత్రా, నాగిరెడ్డి చందమామ పత్రికకు రెండు ఎద్దులు. రెండూ లేకుండా ఎద్దుల బండి గ్రామానికి చేరుకోలేదు అని వ్యాఖ్యానించారు. చందమామ పత్రికలో శంకర తో పాటు రాజి, వడ్డాది పాపయ్య కూడా కలిసి పని చేశారు. శంకర్ 2020, సెప్టెంబరు 29న చెన్నై సమీపంలోని పోరూర్ లోని స్వగృహంలో మరణించారు.
