ఇందిరా గాంధీని పార్టీ నుండి బహిష్కరించిన బ్రహ్మానందరెడ్డి

Date:

భారత దేశ రాజకీయాలను ఒంటి చేత్తో కొంతకాలం శాసించిన ఇందిరా గాంధీని స్వంత పార్టీ కాంగ్రెస్ నుండి బహిష్కరించింది ఎవరో తెలుసా? ఆయన అపార రాజకీయ అనుభవం కలిగిన నాటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, అదీ ఒక తెలుగు వారు కావడం విశేషం. ఆయనే రాష్ట్ర కేంద్ర రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కలిగిన దివంగత ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, గుంటూరుకు చెందిన కాకలు తీరిన నాయకుడు కాసు బ్రహ్మానందరెడ్డి. ఆనాటి కాంగ్రెస్ పెటెంట్ సింబల్ అయిన ఆవు దూడ గుర్తు కనుమరుగు అయి, నిట్టనిలువునా రెండుగా చీలిన కాంగ్రెస్ చీలి పోయిన ఈ సంఘటన గురించి తెలుసు కోవాలంటే నాలుగు, అయిదు దశాబ్దాల క్రితం నాటికి వెళ్లాల్సిందే..
స్వాతంత్య్రానంతరం, ఎమర్జెన్సీ ప్రభావ ఫలితంగా, కాంగ్రెస్ పార్టీ1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పార్టీ ఊహించని రీతిలో తొలి ఓటమిని చవి చూసింది. అనంతరం దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు క్రమానుగతంగా జరిగాయి. 1977 లోక్‌సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాసు బ్రహ్మానందరెడ్డి, పశ్చిమ బెంగాల్‌కు చెందిన నేత సిద్ధార్థ శంకర్ రే పోటీ పడ్డ నేపథ్యంలో రాజకీయ చతురతతో బ్రహ్మానందరెడ్డి విజయం సాధించి నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షులు అయ్యారు. ఆ క్రమంలో ఇందిరా గాంధీతో విభేదాలు తలెత్తాయి. ఇందిర తనవర్గంతో కలిసి సొంత కుంపటి పెట్టుకున్నారు. తర్వాత ఇందిరా కాంగ్రెస్ గా పేరు పెట్టుకున్నారు.

అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగి, అలా ఎన్నికైన అతి కొద్ది మంది అధ్యక్షులలో ఆయన ఒకరు. దాంతో 1978 జనవరి 1న ఇందిరను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు అప్పటి అధ్యక్షుడు కాసు బ్రహ్మానందరెడ్డి ప్రకటించారు. అలా ఒక వర్గానికి ఇందిరా గాంధీ నాయకత్వం వహించగా, మరో వర్గానికి కాసు సారథ్యం వహించాడు. “ఇందిరా కాంగ్రెస్” కు పోటీగా ఆయన నేతృత్వంలోని పార్టీ ఆయన పేరుతోనే “రెడ్డి కాంగ్రెస్” గా రూపాంతరం చెందింది.

కాసు బ్రహ్మానందరెడ్డి (జూలై 28, 1909 – మే 20, 1994) బ్రహ్మానందరెడ్డి 1909 జూలై 28 న గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపాన తూబాడు గ్రామంలో జన్మించారు.

పన్నెండటవ ఏట విజయవాడ కాంగ్రెసు సదస్సుకు విచ్చేసిన మహాత్మా గాంధీని సందర్శించారు. గాంధీజీ బోధనలో ప్రభావితుడై జీవితాంతం గాంధీ టోపీ, ఖద్దరు దుస్తులు ధరించారు. టంగుటూరి ప్రకాశం పంతులు సాహచర్యం, బోధనలు అతనిని స్వాతంత్ర్య ఉద్యమం వైపు నడిపాయి. లా ప్రాక్టీసును పక్కనబెట్టి బ్రిటిషు వారిపై పోరాటానికి నడుం బిగించి, పలు మార్లుపోలీసు లాఠీ దెబ్బలు తిన్నారు. సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. 1942లో బ్రిటిషు వారికి వ్యతిరేకంగా కాంగ్రెసు పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రిగా, గుంటూరు జిల్లాకు చెందిన తల పండిన రాజకీయ దురంధరుడు కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రి పదవులతో పాటు అనేక పార్టీ పదవులను నిర్వహించారు. జిల్లాబోర్డు సభ్యునిగా ఆయన రాజకీయ జీవితం ప్రాంరంభించి, మొదటి సారిగా 1946 లో మద్రాసు ప్రెసిడెన్సీ శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. 1952 లో మద్రాసు రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పల్నాడు నియోజకవర్గం నుండి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసి, సీపీఐ అభ్యర్థి కోలా సుబ్బారెడ్డి చేతిలో ఓడిపోయారు. 1955 లో ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఫిరంగిపురం నియోజకవర్గం నుండి కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 1952నుండి 1956 వరకు రాష్ట్ర కాంగ్రెసు కమిటికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసారు. 1956 లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత ఆంధ్ర రాష్ట్ర శాసన సభ్యులంతా ఆంధ్రప్రదేశ్ లోనూ సభ్యులుగా కొనసాగారు. ఆ విధంగా బ్రహ్మానందరెడ్డి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సభ్యుడై, నీలం సంజీవరెడ్డి మంత్రి వర్గంలో పురపాలన శాఖ మంత్రిగా, దామోదరం సంజీవయ్య మంత్రి వర్గంలో వాణిజ్య శాఖ, ఆర్థిక శాఖలు నిర్వహించారు. 1964 ఫిబ్రవరి 29 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఉవ్వెత్తున ఎగసిన అప్పటి తెలంగాణ ఉద్యమం కారణంగా కాసు… 1971 సెప్టెంబరు 15న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. పీవీ నరసింహారావు సీఎం అయ్యారు. అలా కాసు, కేంద్రమంత్రి వర్గంలో 1974 వ సంవత్సరంలో బాధ్యతలు చేపట్టి, కమ్యూనికేషన్, హోం, పరిశ్రమల శాఖలను నిర్వహించారు.1978 లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో ఇందిరా కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఫలితంగా రెడ్డి కాంగ్రెసును 1980 లో ఇందిరా కాంగ్రెసులో విలీనం చేశారు.

బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు పరిచారు. రాష్ట్రాభివృద్ధికి దోహదపడే దీర్ఘకాలిక ప్రాజెక్టుల పనులను పూర్తి చేయించారు. బహుళార్థ సాధక ప్రాజెక్టు నాగార్జున సాగర్ పనులు కాసు హయాంలోనే పూర్తయ్యాయి. సాగర్ నిర్మాణానికి అవసరమైన నిధుల సేకరణకు ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నాగార్జున సాగర్ మొదటిదశ పూర్తి కాగానే, 1966 ఫిబ్రవరి ఆగస్టు 3న నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారు. రాయలసీమ ప్రాంత వరదాయిని తుంగభద్ర ప్రాజెక్టు హైలెవల్ కెనాల్ ప్రాజెక్టుకు అవసరమైన క్లియరెన్సుల మంజూరు, నిధులు సమ కూర్చడానికి కాసు బ్రహ్మానంద రెడ్డి కృషి చేసారు. పోచంపాడు ప్రాజెక్టుకు రూపకల్పన చేసారు. అప్పట్లో ఎల్.ఐ.సి.నుంచి పది కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుని బలహీనవర్గాల వారికి ఇళ్లు నిర్మించారు. ఆయన హయాంలో పంచాయతీ చట్టం అమలులోకి తెచ్చారు.

కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన బ్రహ్మానందరెడ్డి 1994 మే 20 న హైదరాబాద్ లో మరణించారు.

రామకిష్టయ్య సంగనభట్ల... 9440595494
రామకిష్టయ్య సంగనభట్ల… 9440595494

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

సన్న బియ్యం పిరం –

– 15రోజుల్లో 25కిలోల బస్తాపై రూ.200పైనే పెంపు– వరిసాగు విస్తీర్ణం...

నేను సీఎం కావాలంటే మోడీ ఎన్‌ఓసీ అక్కర్లేదు

– మేం ఎవరికీ బీ టీం కాదు –  కాంగ్రెస్‌ సచ్చిన...

తెలంగాణ ఓటర్లు 3,17,32,727 –

– కొత్త ఓట్లు 17.01 లక్షలు తుది జాబితా విడుదలనవ...

15 శాతం ఐఆర్‌ ప్రకటించాలి –

– సీఎస్‌ ఓఎస్డీ విద్యాసాగర్‌కు యూఎస్‌పీసీ వినతినవతెలంగాణబ్యూరో- హైదరాబాద్‌రాష్ట్రంలోని ఉద్యోగులు,...