Monday, August 8, 2022
HomeLifestylespecial Editionశాస్త్రీయ, సినిమా సంగీతాన్ని మేళవించిన మహదేవన్

శాస్త్రీయ, సినిమా సంగీతాన్ని మేళవించిన మహదేవన్శతాధిక వత్సర భారతీయ సినీ ప్రస్థానంలో సంగీత దర్శకులలో ముందు వరసలో ఉండే వారిలో కె.వి మహదేవన్ ఒకరు. ఎం.ఎస్ విశ్వనాథన్ సమకాలీకుడైన, మహదేవన్ 1942లో ఆనందన్ అనే తమిళ సినిమాతో చిత్రరంగములో అడుగుపెట్టి ఆరు వందలకు పైగా దక్షిణ భారత సినిమాలకు సంగీతం సమకూర్చారు. తెలుగు రాకున్నా అద్భుత స్వర కల్పన చేసి, సంగీతానికి భాష అనే ఎల్లలు లేవు అని నిరూపించిన వారిలో మహాదేవన్ అగ్రగణ్యులు.

తెలుగు ప్రేక్షకుల నోళ్లలో నిరంతరం నానే పాటలను అందించిన ఘనత ఆయనది. యాభయ్యేళ్లకి పైగా సినిమా ప్రయాణం చేసిన ఆయన దక్షిణాది ప్రేక్షకుల్ని సుస్వర సాగరంలో ముంచెత్తారు. సినీ సంగీతాన్ని పరిపుష్టం చేశారు. శాస్త్రీయ సంగీతాన్ని, సినిమా సంగీతముతో మిళితం చేసే ఒరవడికి అయన ఆద్యుడని భావిస్తారు.

కె.వి.మహదేవన్, 1942లో సినీ రంగ ప్రవేశం చేశారు. తమిళ, కన్నడ, మలయాళ, తెలుగు భాషల్లో 600 పైచిలుకు చిత్రాలకి స్వరాలు సమకూర్చారు. తెలుగులో ‘లవకుశ’, ‘శంకరాభరణం’, ‘సిరివెన్నెల’, ‘శ్రుతిలయలు’, ‘పెళ్ళి పుస్తకం’, ‘సప్తపది’, ‘స్వాతికిరణం’ తదితర ఆణిముత్యాల్లాంటి చిత్రరాజాలకి స్వర సొబగులద్ది చరిత్రని సృష్టించారు కె.వి. లెక్కలేనన్ని రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాల తో పాటు, ఆయన రెండు జాతీయ పురస్కారాల్ని సంపాదించు కొన్నారు. ఎందరో గాయకుల్ని సినీ రంగానికి పరిచయం చేసి, వారికి జీవితాల్ని ప్రసాదించిన ఘనత వహించారు.

మహాదేవన్ 1917లో మార్చి 14న తమిళనాడు లోని నాగర్‌కోయిల్‌లో లక్ష్మీ అమ్మాళ్, వెంకటాచలం అయ్యర్ (భాగవతార్) లకు జన్మించారు. మహాదేవన్ తండ్రి వెంకటాచలం భాగవతార్ గోటు వాద్యంలో నిష్ణాతులు. వారి కుటుంబమంతా సంగీతజ్ఞులే. నాలుగేళ్ల ప్రాయంలోనే మహాదేవన్ నాదస్వర వాద్యానికి ఆకర్షితుడై నాదస్వర విద్వాన్ రాజరత్నం పిళ్లై దగ్గర శిష్యరికం చేశారు. అలాగే బూదంపాడి అరుణాచల కవిరాయర్ వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకొని కొన్ని కచ్చేరీల్లో పాల్గొన్నారు. ఏడవ తరగతి వరకు మాత్రమే చదివారు. కొన్ని నాటకాలలో నటించారు. సినిమాలో చేరాలని టి.వి.చారి సహాయంతో మద్రాసులో అడుగు పెట్టారు. “తిరుమంగై ఆళ్వార్” అనే తమిళ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా నటించే అవకాశం లభించింది. టి. ఎ.కల్యాణం దగ్గర కూడా పనిచేసి వృత్తి మెలకువలు నేర్చుకున్నారు.

మహాదేవన్ మిత్రుడైన కొళత్తుమణి సలహాతో, కొళత్తుమణికి సంగీత దర్శకుడైన ఎస్.వి.వెంకట్రామన్ తో మంచి పరిచయం ఉన్న కారణంగా ఆయన దగ్గర సహాయకునిగా చేరారు. అప్పటికే అక్కడ సహాయకునిగా పనిచేస్తున్న టి.ఎ.కల్యాణంతో మంచి పరిచయం ఏర్పడింది. కల్యాణం దగ్గరే సినిమా సంగీతంలోని పట్లు, మెళకువలు నేర్చుకున్నారు.

1942 వ సంవత్సరంలో “మనోన్మణి” అనే తమిళ సినిమాలో “మోహనాంగ వదనీ” అనే పాటకు సంగీతం సమకూర్చే అవకాశం లభించింది. తరువాత “దేవదాసి” అనే సినిమాకు సంగీతం సమకూర్చారు. కాని ఆ సినిమా పెద్దగా ఆడక పోవడంతో అంతగా పేరు రాలేదు. ఆ తరువాత చాలా కాలం వరకు మళ్లీ అవకాశం రాలేదు.

1952లో మలయాళీ యువకుడు పుహళేంది పరిచయం అయ్యాడు. మహాదేవన్ మనసు గెలుచుకున్నాడు. ఆయన చివరి వరకు మహాదేవన్ తోనే పనిచేశారు. 1958 వ సంవత్సరంలో ప్రతిభా సంస్థ నిర్మించిన “దొంగలున్నారు జాగ్రత్త” అను సినిమాకు తొలిసారిగా తెలుగులో స్వరాలు అందించారు. అదే సంవత్సరంలో విడుదలైన ముందడుగు సినిమాతో మహాదేవన్ ప్రతిభ బహిర్గతం అయింది. 1962 లో విడుదలైన “మంచి మనసులు” కేవలం పాటల వల్లే సినిమా హిట్టయిది అని పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా “మావా…మావా…మావా… ఏమి ఏమే భామా” పాట అనూహ్య జనాదరణ పొందింది. అప్పటి నుంచి మహాదేవన్ ను సినీ రంగంలో మామ అని పిలిచారు.
1963లో వచ్చిన “మూగ మనసులు” తిరుగులేని స్థానానికి చేర్చాయి. తెలుగు సినిమా సంగీతంలో ఓ కొత్త బాణీకి ఊపిరి పోశారు.
కవి పాట రాశాకే దానికి స్వరాలను సమకూర్చే ప్రత్యేకత ఆయనది. పాటలోని సాహిత్యాన్ని అధిగమించ కుండా స్వరాలను అల్లేవారు. ఒక్కోసారి సాహిత్యం కోసం బాణీల్లో మార్పులూ చేర్పులూ చేసే వారు. తెలుగు తెలియక పోయినా… కవి రాసిన సాహిత్యం అర్థం కాకపోయినా… అడిగి మరీ దానర్థం తెలుసుకొని సందర్భానుసారం స్వరాలను అందించేవారు. లే లే లే నారాజ”, “మావ మావ మామ” లాంటి ఆ తరం మాస్ పాటలకు స్వరపరిచింది కూడా ఆయనే.
స్వర చక్రవర్తికి 82 ఏళ్లు దాటాక “సహస్ర చంద్రదర్శనం” వేడుక చేశారు.

సంపూర్ణ రామాయణము, తిరువిళయదాల్ వంటి పౌరాణిక చిత్రాలకు పేరుమోసిన మహాదేవన్ శాస్త్రీయ సంగీతాన్ని, సినిమా సంగీతముతో మిళితం చేసే ఒరవడికి ఆద్యుడని భావిస్తారు. అనేక మంది సినీ సంగీత దర్శకులకు ఆయన గురువు. సంగీతం సమకూర్చిన సినిమాలలో శంకరా భరణం, దసరా బుల్లోడు, గోరింటాకు, ఇక భక్తి చిత్రాలైన అయ్యప్ప స్వామి మహత్యం, అయ్యప్ప స్వామి జన్మ రహస్యం, భార్గవ ఆర్ట్స్ ప్రొడక్షన్ లో వచ్చిన సుమారు అన్ని చిత్రాలకు స్వరాలను అందించారు. ఆయన సంగీతము సమకూర్చిన చివరి సినిమా కబీర్ దాస్ (2003) లో చనిపోయిన తరువాత విడుదలైంది. చనిపోక ముందు చివరి సినిమా ” కె. విశ్వనాధ్ తీసిన “స్వాతి కిరణం”. ఆ సినిమాకు రెండు పాటలనే స్వరపరిచగా, ఆరోగ్యం సరిగా లేని కారణంగా మిగిలిన పాటలను పుహళేంది స్వరపరిచారు. అయన పేరునే టైటిల్స్ లో వేసి గురుభక్తిని చాటుకున్నారు పుహళేంది. అలాగే తమిళంలో చివరి సినిమా మురుగనే తుణై (1990).

కందణ్ కరుణై చిత్రానికి జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు (1967);
శంకరాభరణం; సినిమాకు జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు (1980); హైదరాబాదు ఫిలిం సర్కిల్ సంగీత చక్రవర్తి (1976); రాజమండ్రిలోని లలిత కళానికేతన్ స్వరబ్రహ్మ (1976) బిరుదు ప్రదానం చేశారు.
జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకునిగా పురస్కారం అందుకొన్న మొదటి వ్యక్తిగా నిలిచారు.

ఆయన జీవిత చరమాంకం హృదయ విదారకంగా గడిచింది. చివర్లో నరాల బలహీనత, మాట కూడా పడి పోవడం, మతి స్థిమితం కూడా తప్పింది. అలాంటి స్థితి చూసి, చాలా మంది
కంటతడి పెట్టుకున్నారు. చివరకు శ్వాసపీల్చు కోవటం కష్టమై తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో ఉండి 2001, జూన్ 22న 83 సంవత్సరాల వయసులో మద్రాసులో మరణించారు. సినీ సంగీత ప్రపంచంలో ధృవ తారగా నిలిచారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments