Tuesday, August 9, 2022
HomeLifestyleLife styleబహుజనుల ఆత్మగౌరవ పతాక ఝల్కారీబాయి

బహుజనుల ఆత్మగౌరవ పతాక ఝల్కారీబాయి


దేశ స్వాతంత్ర్య పోరాటంలో మహిళల త్యాగాలు, భాగస్వామ్యాలు కూడా మరువ లేనివి. అలాగే ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలోనూ ఒక త్యాగశీలి భాగస్వామ్యం చాలా మందికి తెలియనిది.

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం అంటే వెంటనే గుర్తుకు వచ్చేది ఝాన్సీ రాణి. 1857వ సంవత్సరం సిపాయిల తిరుగుబాటు ఒక చరిత్ర. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది ఝాన్సీ లక్ష్మీబాయి. బ్రిటిష్ పాలనకు లొంగక, వారికి తన రాజ్యం స్వాధీన పరచడానికి ససేమిరా ఇష్ట పడక, రాజ్య రక్షణ కోసం జరిగిన యుద్ధంలో ఝాన్సీ వీరోచిత పోరాటం, వీర మరణం గురించి అందరికీ తెలిసిందే. ఈ పోరాటంలో ఝాన్సీ లక్ష్మీబాయికి నమ్మిన బంటుగా, విశ్వాస పాత్రురాలిగా, ఆత్మార్పణం గావించిన ఒక వీరదళిత నారి గురించి చాలా మందికి తెలియదు. ఆమె ఝల్కారీబాయి… ఝల్కారీబాయి గురించి తెలుసుకోక పోవడం చరిత్రకు అన్యాయం జరిగినట్లే భావించాలి.

ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి లక్ష్మీ బాయి.1857లో అలజడి రేగడంతో ఝాన్సీ పట్టణం విప్లవ కారులకు నిలయంగా మారింది. లక్ష్మీబాయి స్వచ్ఛంద సైన్యాన్ని సమీకరించడం ద్వారా ఆత్మరక్షణ బలోపేతం చేసింది. మహిళలను కూడా సైన్యంలో చేర్చుకుని వారికి ఆయుధ శిక్షణను ఇవ్వనారంభించింది. ఆమె దగ్గర సైన్యాధ్యక్షులుగా ఉన్న వారంతా ఆమె యుద్ధం చేస్తున్న కారణానికి మద్దతుగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారే. సెప్టెంబరు, అక్టోబరు 1857 లో ఆమె ప్రక్క రాజ్యాలైన దతియా, ఓర్చా రాజ్యాల నుంచి దాడిని విజయవంతంగా ఎదుర్కొన గలిగింది.

హిందువులకు ఆవు పవిత్రం, ముస్లింలకు, పంది అసహ్యం. కానీ ఆంగ్లేయులు వాడే తూటాలకు ఆవుకొవ్వును, పందికొవ్వును వాడేవారు. అది సహించలేని సిపాయిలలో తిరుగుబాటు మొదలయ్యింది. ఇది గ్రహించిన ఆంగ్లేయులు హిందువులను, ముస్లింలను అనేక ఇబ్బందులకు గురిచేసారు. అది సహించలేని సిపాయిలు ఆంగ్లేయులపై తిరుగుబాటు చేయాలని సంకల్పించు కున్నారు. రాజ్యాన్ని ఆంగ్లేయులు ఆక్రమించుకోగా పారిపోయిన ఝాన్సీలక్ష్మీబాయి తాంత్యాతోపే మొదలైన తిరుగుబాటు దార్లతో చేయి కలిపి ఢిల్లీ, కాన్పూరు, ఔధ్ , ఝాన్సీతో పాటు అన్నీ ప్రాంతాలలో ఒకేసారి తిరుగుబాటు చేయాలని నిర్ణయించు కున్నారు. కానీ బ్రిటీష్ వారు పెట్టిన బాధలకు ఓర్వలేని
మంగల్ పాండే అనే భారత సిపాయి తిరుగుబాటు చేయడంపై ఆంగ్లేయులు అప్రమత్తమై ఝాన్సీరాణిని నిర్బంధించి ఝాన్సి రాజ్యాన్ని కైవసం చేసుకున్నారు. ఇది భారత చరిత్రలో మొదటి స్వాతంత్య్ర సంగ్రామం. భారతనారీ క్షేత్రంలో మచ్చుతునక ఝాన్సీ లక్ష్మీబాయి.

అయితే ఈ సమరంలో ఝల్కారీబాయి అనే వీరనారి పాత్ర మరువ లేనిది.

ఝల్కారీబాయి (నవంబరు 22, 1830 – 1858) భారతీయ మహిళా సైనికురాలు. 1857 సిపాయి తిరుగుబాటు సందర్భంగా జరిగిన ఝాన్సీ యుద్ధంలో ప్రముఖపాత్ర పోషించింది. ఆమె ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యంలోని మహిళా విభాగంలో సైనికురాలు.
భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో సిపాయి తిరుగుబాటుగా, ‘ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం’గా ప్రసిద్ధిగాంచిన 1857-58 నాటి వీరోచిత పోరాట ఘట్టంలో ఝాన్సీరాణి లక్ష్మీబాయికి ప్రతిరూపంగా కీలక భూమికను పోషించిన ఘనత దళిత బహుజన భూమి పుత్రిక ఝల్కారిబాయికే దక్కుతుంది. బుందేల్‌ఖండ్ ప్రాం తంలో ప్రజలు పాడుకునే జానపద బాణీల్లో ఝాన్సీలక్ష్మీబాయి సరసన ఝల్కారిబాయి సాహసాలను పాటల రూపంలో నేటికీ గుర్తు చేసుకోవడం విశేషం.

ఝాన్సీ సమీపంలోని భోజ్‌లా గ్రామంలో కోరీ కులానికి చెందిన సదోవర్ సింగ్, జమునాదేవి దంపతులకు నిరుపేద వ్యవసాయకూలీ కుటుంబంలో 1830 నవంబర్ 22న జన్మించిన ఝల్కారిబాయి వీరనారిగా ఎదిగి, నేడు దళిత బహుజనుల ఆత్మగౌరవ పతాకగా మారింది. చిన్న వయసులోనే తల్లి మరణించడంతో తండ్రి పెంపకంలో గుర్రపుస్వారీ, కత్తిసాము వంటి యుద్ధ విద్యలు నేర్చుకుంది. అడవిలో పశువులను మేపుతున్న ఝల్కారిపై దాడి చేసిన చిరుత పులిని కేవలం చేతికర్రతో చాకచక్యంగా హతమార్చిన ఘటన సంచలనం రేపింది. ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యంలో ఆయుధ విభాగంలో పనిచేస్తున్న పూరణ్‌ సింగ్‌ను వివాహం చేసుకున్న ఝల్కారిబాయి, తదనంతర కాలంలో లక్ష్మీబాయికి సన్నిహితమై సైన్యంలో చేరి ‘దుర్గావాహిని’ మహిళా సాయుధ దళానికి నాయకత్వం వహించింది.
సిపాయి తిరుగుబాటు సందర్భంగా శత్రు సేనలతో జరిగిన యుద్ధంలో ప్రముఖ పాత్రను పోషించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయింది. 1858 ఏప్రిల్ 3న బ్రిటిష్ జనరల్ హగ్ రోజ్ నాయకత్వంలో బ్రిటిష్ సేనలు ఝాన్నీ రాజ్యాన్ని చుట్టుముట్టాయి. ఆ దాడి నుంచి లక్ష్మీబాయి సురక్షితంగా తప్పించుకుని కల్పి ప్రాంతంలో పోరాడుతున్న తిరుగుబాటు నాయకులను కలుసు కోవడానికి అనువుగా, ఝల్కారీబాయి తానే ఝాన్సీ లక్ష్మీబాయి నంటూ కోట ముందు ప్రత్యక్షమై బ్రిటిష్ సేనలను ముప్పుతిప్పలు పెట్టింది. ఆ దాడిలో ఝాన్సీలక్ష్మీబాయి రూపంలో బందీగా పట్టుబడ్డ ఝల్కారిబాయిని గుర్తుపట్టిన బ్రిటిష్ సేనలు, తదనంతర కాలంలో ఆమెను విడిచిపెట్టారా లేదా చంపేశారా అన్నది చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. 1858 జూన్ 17,లో రెండో రోజు యుద్ధములో రాణి మరణించింది. ఈ ఝల్కారిబాయి సాహసంతో స్ఫూర్తి పొందిన దళిత బహుజన రాజకీయ పార్టీల కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఝల్కారిబాయి జీవితాన్ని, పోరాట ఘట్టాలను నాటకాలు, కథలుగా మలచి ఊరూరా ప్రచారం చేయడం జరిగింది. భారత ప్రభుత్వం, ఆమె జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంపును విడుదల చేయడం గమనార్హం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments