Wednesday, November 30, 2022
Homespecial Editionసహస్రాధిక వ్యాస రచయిత జానమద్ది

సహస్రాధిక వ్యాస రచయిత జానమద్ది

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

తెలుగు భాష వికాసం కోసం అహర్నిశలూ శ్రమించి, అహరహం ఆలోచించి, నిరంతరం తపించిన సాహితీ తపస్వి జానమద్ది హనుమచ్ఛాస్త్రి. విజ్ఞాన సర్వస్వంగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా, ఎందరికో ఆదర్శప్రాయంగా, స్ఫూర్తి దాయకంగా, మార్గ నిర్దేశం చేశారు హనుమచ్ఛాస్త్రి.

జానమద్ది హనుమచ్ఛాస్త్రి 1926 జూన్ 5 న అనంతపురం జిల్లా రాయదుర్గం లో జన్మించారు.
జానకమ్మ , సుబ్రహ్మణ్యశాస్త్రి వీరి తల్లిదండ్రులు. ఎస్ఎ్‌సఎల్‌సీ తరువాత కొన్ని కారణాల వల్ల పై చదువులు చదవలేక పోయినా, ఉపాధ్యాయ శిక్షణ అనంతరం, ఉపాధ్యాయుడిగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. ఆ తరువాత ఆంగ్లంలోను, తెలుగులోను ఎంఏ పట్టాలు పొందారు. చాలా కాలం కడప డిగ్రీ కళాశాలలో ఆంగ్లోపన్యాసకులుగా పనిచేశారు. జానమద్ది యవ్వన దశలో రంగస్థల నటుడిగా కూడా రాణించారు. నాట్య కళాప్రపూర్ణ బళ్లారి రాఘవాచారితో పరిచయం ఏర్పడటం, నాటక రంగం మీద ఆయనకు ఇష్టం ఏర్పడడమే కాక రాఘవ సరసనే పాదుకా పట్టాభీషేకం నాటకంలో నటించారు. తర్వాత చంద్రగుప్త నాటకంలో జానమద్ది చంద్రగుప్తుడు తల్లి ముర పాత్రను ఎంతో గొప్పగా పోషించారు. ఇలా రంగస్థల నటుడిగా కూడా తన ప్రతిభ కనబరిచారు.

స్కూళ్ల ఇన్ స్పెక్టర్ గా, జిల్లా విద్యావిషయక సర్వే ఆఫీసర్ గా, కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ గా నాలుగు దశాబ్దాలు పనిచేశారు.

కడప లో సి.పి.బ్రౌన్ స్మారక గ్రంథాలయ వ్యవస్థాపకులు. ట్రస్టును నెలకొల్పి, దాని మొదటి కార్యదర్శిగా అహర్నిశలూ పాటుపడి 10 లక్షల రూపాయల విరాళాలు సేకరించారు. జానమద్ది కృషి కారణంగా బ్రౌన్ లైబ్రరీలో దాదాపు లక్ష గ్రంథాలు, 300 వరకు తాళపత్ర గ్రంథాలు, తెలుగు గ్రామాల స్థానిక చరిత్ర తెలిపే మెకంజీ కైఫీయత్తులు, బ్రౌన్ లేఖలు, రాతప్రతులు సమ కూరాయి. బ్రౌన్ లైబ్రరీకి ఏటా ముప్ఫై లక్షల రూపాయల గ్రాంట్ ను ముఖ్య మంత్రి రాజశేఖర రెడ్డి తో మంజూరు చేయించుకొన్న ఘనత ఆయనది.

డాక్టర్‌ జానమద్ది ఆరు దశాబ్దాల తన సాహితీ ప్రస్థానంలో సహస్రాధిక వ్యాసాలను రాశారు. శతాధిక ప్రముఖుల జీవిత చరిత్రలను గ్రంథస్తం గావించారు. ఆయన రచన ప్రచురించని పత్రిక లేదనే ఖ్యాతి పొందారు. ఆకాశ వాణి కేంద్రాల నుంచి అనేక అంశాలపై 150కి పైగా ప్రసంగాలు చేశారు.

కరుణశ్రీ, బోయి భీమన్న, దాశరథి, పురిపండ అప్పలస్వామి, పుట్టపర్తి నారాయణాచార్యులు, శ్రీ శ్రీ, డా.బెజవాడ గోపాలరెడ్డి మొదలైన ప్రసిద్ధులైన సాహితీ వేత్తలతో ఆయనకు సాన్నిహిత్యం ఉండేది. కవి సమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణతో ఆయనకు స్నేహం ఉండేది.

తెలుగు, ఆంగ్ల, కన్నడ దిన, వార, మాస పత్రికలలో ప్రచురితమైన దాదాపుగా 2500 వ్యాసాలు వీరి నిరంతరం సాహితీ సేవకు ప్రతిబింబాలు.

1964లో పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్యకు, తాళ్లపాకలో గుడి కట్టించడానికి తాళ్లపాక గ్రామస్థులకు ప్రేరణనిచ్చి సఫలీకృతులయ్యారు. తాళ్లపాకలో ప్రసిద్ధి చెందిన అన్నమయ్య గుడికి ఆనాడు బీజం వేసింది జానమద్ది వారే. సర్వమత సౌభ్రాతృత్వంతో జీవిత యాత్ర సాగించిన ఆయన జాన్‌ అహ్మద్‌ శాస్త్రి గా పేరు గడించారు.

జానమద్దికి అనేక అవార్డులు లభించాయి.1980లో బళ్లారి రాఘవ శతజయంతి పురస్కారం, కర్ణాటక రాష్ట్ర పురస్కారం, ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడమీ పురస్కారం, 1988లో వావిలాల గోపాలకృష్ణయ్యచే పురస్కారం, 2003లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిచే సత్కారం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కారం,
లోకనాయక్ ఫౌండేషన్ సాహితీపురస్కారం, కవిత్రయ పురస్కారం, గుంటూరులో అయ్యంకి వెంకటరమణయ్య అవార్డు, అనంతపురం లలిత కళా పరిషత్ అవార్డు, ధర్మవరం కళాజ్యోతి వారి సిరిసి ఆంజనేయులు అవార్డు, కడప సవేరా ఆర్ట్స్ వారి సాహితీ ప్రపూర్ణ అవార్డు, మదనపల్లి భరతముని కళారత్న అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారం, ఢిల్లీ ఆంధ్ర సంఘం సత్కారం, అయ్యంకి వెంకటరమణయ్య పురస్కారం… ఇలా మూడు పదులకు పైగా సత్కార, పురస్కారాలను అందుకొన్నారు. ఉడిపి పెజావరు పీఠాధిపతిచే ‘ధార్మికరత్న’ బిరుదు మొదలైన అనేక పురస్కారాలు ఇతనికి లభించాయి. శాస్త్రిగారి నిర్విరామ తెలుగు భాషా సాహిత్యసేవను గుర్తించి జ్ఞానపీఠ పురస్కార్‌ గ్రహీత డా.సి.నారాయణరెడ్డి ఆయనను ‘బ్రౌన్‌శాస్త్రి’ బిరుదుతో సత్కరించారు. తనకెన్ని సత్కారాలు జరిగినా ఈ బిరుదు తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పేవారు.

జానమద్ది హనుమచ్ఛాస్త్రి ఫిబ్రవరి 28,2014న మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతూ కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments