Saturday, November 26, 2022
Homespecial Edition"ఇట్లు మీ విధేయుడు" భమిడిపాటి

“ఇట్లు మీ విధేయుడు” భమిడిపాటి

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

భమిడిపాటి రామగోపాలం (ఫిబ్రవరి 6, 1932 – ఏప్రిల్ 7, 2010) గా తెలుగు రచయిత, పత్రికా సంపాదకులు.

విజయనగరం జిల్లా పుష్పగిరిలో 1932 ఫిబ్రవరి 6న జన్మించారు. తండ్రి సూర్యనారాయణ ఎలిమెంటరీ స్కూల్‌ టీచర్‌. అమ్మ సూరమ్మ. ఇద్దరు తమ్ముళ్లు. ఉద్యోగ రీత్యా తండ్రి వివిధ ఊళ్లు తిరిగారు. విజయ నగరంలో స్థిరపడ్డారు. ఐదో తరగతి వరకు నాన్న ఇంటి దగ్గరే చదువు. అలమండ హయ్యర్‌ ఎలిమెంటరీ స్కూల్లో ఆరో తరగతి. 1951లో బీ.ఏ. భాగల్‌పూర్‌ యూనివర్సిటీ నుంచి ఎం.ఏ. (ఇంగ్లిషు), ఆంధ్రా యూనివర్సిటీలో ఎం.ఏ. (తెలుగు) చేశారు. విజయనగరం సత్రంలో ఉచిత భోజనం చేస్తూ, పిల్లలకు ట్యూషన్లు చెప్పి డబ్బు సంపాదించి, అది ఇంటికి ఇస్తూ చదువుకున్నారు.

1951లోనే విజయ నగరంలోనే సెన్సస్‌ ఆఫీసులో చెకర్‌గా ఉద్యోగ జీవితం మొదలైంది. అప్పటి మద్రాసు సర్వే విభాగంలో గుమస్తాగా, సర్వేయర్‌గా, హెడ్‌ సర్వేయర్‌గా పనిచేశారు. వివిధ ప్రదేశాలు తిరిగారు. 1967లో నర్సరావుపేటలో ఉద్యోగం చేశారు. అప్పటికే రచనా వ్యాసంగంలో ఉండటం, రేడియో స్టేషన్‌కు వెళుతుండటం వంటి వ్యాపకాల వల్ల తరచూ విజయవాడలో ఉండేవారు.

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కు బదిలీ అయ్యారు. కాఫీ అన్నా, ఆంధ్ర పత్రిక పత్రి కన్నా, రేడియో అన్నా ప్రాణం. ఉద్యోగానికి సెలవు పెట్టి బెజవాడ వీధుల్లో తిరుగుతూ నార్ల వెంకటేశ్వరరావు కంటబడ్డాడు. ఆయన అక్కడిక్కడే ఉద్యోగం ఇచ్చి ఆంధ్రజ్యోతిలో ఎడిటర్‌ పురాణం సుబ్రహ్మణ్యశర్మకు అసిస్టెంట్‌గా నియమించాడు. 1967 నుంచి 68 వరకు అక్కడ పనిచేశారు. 1985-86 మధ్య మద్రాసు నుంచి వెలువడే ఉదయ భారతి పత్రిక ఎడిటర్‌గా చేశారు. 1974లో విశాఖ పోర్టులో చేరి, 1990లో ఉద్యోగ విరమణ చేశారు. 1974-78 మధ్య ‘ఈనాడు’ కల్చరల్‌ రిపోర్టర్‌గా పనిచేశాడు. ఆంధ్రప్రభ, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లకూ కొన్నాళ్లు పనిచేశారు.

భమిడిపాటి చాలా చమత్కారులు. ముక్కుకు సూటి వ్యక్తి. ఆయన కధలు వ్రాసే తొలినాళ్ళలో ఒక పత్రిక ఆయన కధను ప్రచురించి పారితోషికం 3 రూపాయలు ఆయనకు పంపలేదట! వెంటనే ఆయన ఆ పత్రికాఫీసుపై కోర్టుకెళ్ళారు. “రచయిత ఎంతో సమయాన్ని వెచ్చించి బుర్ర చించుకొని మీకు పంపిస్తే, మీరు దాన్ని అచ్చేసి అమ్ముకొని సంపాదించు కొన్నప్పుడు దానిలో ఒక్క మూడు రూపాయలు పారితోషికాన్ని అతనికి పంపలేరా? ఆ వ్యక్తి కొత్త రచయిత అయితే మాత్రం నిర్లక్ష్యం చేస్తారా? ” అని కోర్టు తీర్పు యిస్తూ, ఈ కేసుకు చెందిన కోర్టు ఖర్చులు కూడా ఆ పత్రికా కార్యాలయం చేత యిప్పించింది.

78 ఏళ్ళ వయసులో రెండు కాళ్లు వేళ్లూ పడిపోయినా సహాయకులకు మౌఖికంగా చెబుతూ సాహితీ వ్యాసంగాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఆస్టియో ఆర్థరైటిస్‌ వల్ల రెండు కాళ్లు పని చేయలేదు. 2004 నుంచీ కాలివేళ్లు, చేతి వేళ్లకు తిమ్మిరి. ఇంటా, బయటా చక్రాల కుర్చీలోనే. అయినా సాహితీ వ్యాసంగాన్ని మానలేదు. ఆరు కథా సంపుటాలు, మూడు నవలలు వెలువరించారు. తన ఆత్మకథను “ఆరామ గోపాలమ్” ‌పేరుతో సచిత్రంగా ప్రచురించారు. ప్రముఖ వ్యక్తులు, సంస్థలపై 17 సావనీర్లు రూపొందించారు. మిత్రుడి జ్ఞాపకార్థం నెలకొల్పిన జ్యేష్ఠ లిటరరీ ట్రస్ట్‌ తరపున అనేక పుస్తకాలు ప్రచురించారు. ‘ఇట్లు మీ విధేయుడు’కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్నారు.

1980 – నేనెందుకు వ్రాస్తున్నాను? వ్యాస సంపుటికి పులుపుల వెంకట శివయ్య సాహితీ సత్కారం (అత్తలూరి నరసింహారావుతో కలిసి), 1991 – ఇట్లు మీ విధేయుడు గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించాయి.

2010 ఏప్రిల్ 7 న భమిడిపాటి రామగోపాలం (భరాగో) విశాఖ నగరంలో కృష్ణా కళాశాల సమీపంలోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు.

ఎవరూ ఊహించలేని ఆయన శరీరానికున్న సమస్యలు, మొరాయించే చేతి వేళ్ళు, కదలని కాళ్ళు, కదలికకు సహకరించని శరీరం, చెప్పినమాట వినని గుండె, ఇంకా ఇలా ఎన్నెన్నో సమస్యలు, నిత్య జీవిత పోరాటాలు. ఒక్క మెదడు చురుకుగా పనిచేస్తే చాలు… ఎన్ని రుగ్మతలనయినా జయించవచ్చని నిరూపించి చూపిన ధృఢ చిత్త వ్యక్తి ఆయన.
జీవితాన్ని ఎదిరించి, శాసించి, కష్టానికీ, నష్టానికీ లొంగక- తన షరతులమీదే జీవికని నడిపించి- హఠాత్తుగా, ఠీవిగా, గర్వంగా వెళ్ళిపోయిన ఓ “ఉద్యమం” అయన. ఎందరికో స్ఫూర్తిని కలిగించున హాస్య రచయిత భమిడిపాటి.

నేను సున్నా నుంచో… మరీ చెప్పాలంటే మైనస్‌ నాలుగు నుంచో జీవితం మొదలు పెట్టాను. పేదరికం చాలా గొప్పది. అది పని చేసే ఉద్దేశం కలుగ చేస్తుంది.
“నేను నా జీవితాన్ని సంపూర్ణంగా జీవించాను. సంతోషంగా బతికాను. బతికినంత కాలం పనిచేస్తూ ఉండటమే నా లక్ష్యం. సాహితీ రంగంలో నాకంటే ఘనులు చాలా మందే ఉన్నారు. కానీ నా ప్రత్యేకత నాకుంది. నాకు భోజనం, దుస్తులు, ధనం మీద ఆసక్తి తక్కువ. అందుకే ఇంత సంతోషంగా ఉండగలుగు తున్నాను. జీవితాన్ని తేలిగ్గా తీసుకోవాలి”. భమిడిపాటి పై వాక్యాలు చూస్తే, ఆయన వ్యక్తిత్వం, జీవితంలో సంతృప్తితో బ్రతికిన తీరు స్పష్టం అవుతుంది.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments