– రాయల్ కాలేజ్ గ్లాస్గో భాగస్వామ్యంతో సేవల్లో మెరుగుదల
– నిమ్స్‌ను సందర్శించిన రాయల్ కాలేజ్ అధ్యక్షులు డాక్టర్ మైక్ మెకెర్డీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
నిమ్స్ ఆస్పత్రిలో సేవల్ని మరింత మెరుగుపరిచేందుకు కొంత పరిశోధనలకు శ్రీకారం చుట్టేందుకు రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ ఆఫ్ గ్లాస్గో, నిమ్స్ పరస్పర సహకారం అందించుకోనున్నట్టు ఆ కళాశాల ప్రెసిడెంట్ డాక్టర్ మైక్ మెకెర్డీ తెలిపారు. ఇంగ్లాండ్, స్కాట్లాండ్ దేశాల్లో నాణ్యమైన వైద్యాన్ని, పరిశోధనల్ని అందిస్తున్న ఈ సంస్థ అధ్యక్షులు హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిని గురువారం సందర్శించారు. నిమ్స్ డైరెక్టర్ నగరి బీరప్ప నేతృత్వంలో వివిధ విభాగాల బాధ్యులతో నిర్వహించిన సమావేశంలో డాక్టర్ మైక్ మాట్లాడారు. ఆస్పత్రిలో పేదలకు అందుతున్న నాణ్యమైన వైద్యసేవలను కొనియాడారు. యాంటీ బయోటిక్స్, ఇతర మందుల వినియోగం, వివిధ రకాల పరిశోధనల గురించి నిమ్స్ వైద్యులతో చర్చించారు. రెండు సంస్థల మధ్య పరస్పర ఒప్పందం ద్వారా పరిశోధనలు మరింత వేగవంతం చేయొచ్చని అన్నారు. నిమ్స్ ఎండీ, పీజీ, ఎంసీఎచ్ విద్యార్థులు ఇంగ్లాండ్ వెళ్లి వైద్య సేవలు, పరిశోధనలపై తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని, అలాగే అక్కడి వైద్య విద్యార్థులు నిమ్స్‌కొచ్చి తెలుసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా వైద్య వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన అవగాహన చిత్రాలను నిమ్స్ డైరెక్టర్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎంవో ఓయస్‌డి డాక్టర్ గంగాధర్, డాక్టర్ పరంజ్యోతి, డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ తిర్మల్గ్, డాక్టర్ శాంతి వీర్, డాక్టర్ కృష్ణ రెడ్డి, పలు విభాగాల అధిపతులు, వైద్యులు పాల్గొన్నారు.