తెలుగు సాహిత్యానికి ఇంద్రగంటి ఎనలేని సేవలు

Date:

తెలుగు సాహితీ ప్రపంచంలో సుపరిచితులైన సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంతశర్మ. ఆయన
స్పృశించని సాహితీ ప్రక్రియ దాదాపు లేదనే చెప్పాలి. పండిత వంశంలో జన్మించి, సాహితీ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, సినిమా పాటలు రాసిన కవిగా, పండితునిగా, కథా రచయితగా, పత్రికా సంపాదకునిగా, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ ప్రత్యేక గుర్తింపు పొందారు.
తూర్పు గోదావరి జిల్లా, రామచంద్ర పురంలో శ్రీకాంత శర్మ మే 29 1944 న జన్మించారు. ఆయన తండ్రి ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి కవి గొప్ప కవి. తెలుగు పొట్టి కథలకు “కథానిక” అనే అద్భుతమైన పేరు సూచించి, ఆ సాహితీ ప్రక్రియకు ఒక సమున్నత స్థానాన్ని కల్పించిన హనుమచ్ఛాస్త్రి గొప్ప కవి
కావడం మూలాన, చిన్ననాటి నుండే సాహిత్య వాతావరణంలో పెరిగిన శ్రీకాంత శర్మ, విద్యార్థి దశలోనే రచనా వ్యాసంగం చేపట్టారు. తెలుగులో ఎం. ఏ. పట్టభద్రులై, తర్వాత అభ్యుదయ కవిగా శర్మ పేరొందారు.

అనేక​ లలిత గేయాలు కవితలు, సాహిత్య వ్యాసాలతో పాటు రేడియో నాటికలు, నాటకాలు, డాక్యుమెంటరీలు, సంగీత రూపకాలను రచించారు. జన్మనిచ్చిన పితృ దేవుల వారసత్వాన్ని నిలబెట్టడంతో పాటు, అర్థవంతమైన రచనలెన్నో చేసి, సాహితీ ప్రియుల హృదయాలలో చెరగని ముద్ర వేశారు శ్రీకాంత శర్మ. అపురూపమైన భావావేశం సొంతం చేసుకొని, ఆవేశాన్నైనా, ఆవేదననైనా అక్షరాల్లో లయబద్దంగా అమర్చ గలగడం, పాఠకుల మనసులతో పాటు, మెదళ్ళనీ రచనల ద్వారా కదిలించ గలగడం శ్రీకాంత శర్మ ప్రత్యేకతలు.

పలు తెలుగు సినిమాల్లో ఆయన పాటలు రాశారు. ‘కృష్ణావతారం’, ‘నెలవంక’, ‘రావుగోపాలరావు’, ‘రెండుజెళ్ల సీత’, ‘పుత్తడిబొమ్మ’, ‘చైతన్యరథం’ వంటి చిత్రాల్లో శ్రీకాంత శర్మ పాటలు రాశారు. తన కుమారుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన ‘సమ్మోహనం’ సినిమాలోనూ ఆయన పాటను రాశారు.

ఆంధ్రజ్యోతి వారపత్రికలో ఉప సంపాదకులుగా ఉద్యోగ జీవితం మొదలు పెట్టినా, కొంతకాలం సినిమా రంగంలో పని చేసినా, ఆలిండియా రేడియోలో అడుగు పెట్టాకనే శ్రీకాంతశర్మ సృజనాత్మకత పూర్తిగా రెక్కలు విప్పుకుంది. ఆయన రచించిన ఎన్నో సంగీత రూపకాలు జాతీయ స్థాయిలో బహుమతులు అందుకున్నాయి. ఆయన రచించిన లలిత గీతాలు ఈనాటికీ బహుళ ప్రాచుర్యంలో ఉన్నాయి. తెలుగు నాటక రంగానికీ, తెలుగు సాహిత్య రంగానికీ ఆయన చేసిన కృషి ఎన్నదగినది.

1976లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలొ అసిస్టెంట్ ఎడిటర్ గా శర్మ చేరాడు. తెలుగు ప్రసంగాల శాఖకు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాసంగికులు ఉషశ్రీకి సహాయకునిగా సంస్కృత కార్యక్రమాలు నిర్వహించారు. శర్మ వివిధ పత్రికలలో గేయాలు, కవితలు, సాహిత్యవ్యాసాలు వ్రాశారు. అనేక రేడియో నాటికలు, నాటకాలు, డాక్యుమెంటరీలు, సంగీత రూపకాలు రచించారు. రేడియో ప్రసంగాలు చేశాడు. 1994లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా నిజామాబాద్ కేంద్రంలో పని చేశాడు. 1995లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక సంపాదకులుగా చేరారు.

1977లో అనుభూతి గీతాలు కవితా సంపుటికి ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం, 1979లో నూతలపాటి సాహితీపురస్కారం, 1981లో ఆకాశవాణి వార్షిక పోటీలలో అమరామరం డాక్యుమెంటరీకి ప్రథమ బహుమతి, 1981లో ఆకాశవాణి వార్షిక పోటీలలో వర్షానందిని సంగీత రూపకానికి ప్రథమ బహుమతి, 1986లో ఆకాశవాణి వార్షిక పోటీలలో నేనుకాని నేను సృజనాత్మక రూపకానికి ప్రథమ బహుమతి, 1988లో ఆకాశవాణి వార్షిక పోటీలలో మాటా – మౌనం సంగీత రూపకానికి ప్రథమ బహుమతి, 1988లో ఆకాశవాణి వార్షిక పోటీలలో నిశ్శబ్దగమ్యానికి ద్వితీయ బహుమతి, 1990లో ఆకాశవాణి వార్షిక పోటీలలో మెట్లకు ద్వితీయ బహుమతి, తదితరాలు సొంతం చేసుకున్నారు.
ఆయన సతీమణి ఇంద్రగంటి జానకీబాల ప్రముఖ రచయిత్రి. నవలా రచయిత్రిగా, రేడియో కళాకారిణిగా, లఘు కథల రచయిత్రిగా, కవయిత్రిగా సుపరిచితులు.
కుమార్తె కిరణ్మయి కూడా లఘు చిత్రాలు తీస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చు కున్నారు. కుమారుడు ఇంద్రకంటి మోహన కృష్ణ సినీ దర్శకునిగా మంచి గుర్తింపు పొందారు. దర్శకునిగా ఆయన తొలి చిత్రం
2004లో గ్రహణంకు భారత జాతీయ చలన చిత్ర పురస్కారం, ఉత్తమ నూతన దర్శకులుగా నంది పురస్కారంతో పాటు ఆ సినిమాకు 11 అవార్డులు దక్కడం విశేషం. 2006లో మాయాబజార్, 2008 లో అష్టా చమ్మా, 2011లో గోల్కొండ హైస్కూల్, 2013లో అంతకు ముందు ఆ తర్వాత ( ఉత్తమ కథా రచయిత గా నంది అవార్డు), 2015లో బందిపోటు, 2016లో జెంటిల్ మాన్, 2017 లో అమీతుమీ, 2018లో సమ్మోహనం, 2020లో వి. తదితర చిత్రాలలో తన ప్రతిభను చాటారు.

రామకిష్టయ్య సంగనభట్ల... 9440595494
రామకిష్టయ్య సంగనభట్ల… 9440595494

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

బన్నీ కన్నా ముందు త్రివిక్రమ్ మరో సినిమా?

డివివి దానయ్య నిర్మాతగా ఈ కాంబో ఎప్పుడో సెట్ కావాల్సి...

‘సలార్’ పార్ట్1 లో ఎన్టీఆర్!

ప్ర‌భాస్ క్రేజీ ప్రాజెక్ట్ అయిన స‌లార్ మూవీ ఎప్పుడో రావాల్సింది....

గంటలు గంటలు డెస్క్ ముందు పనిచేస్తుంటారా? అయితే ఇది మీ కోసమే..

గంటలు గంటలు డెస్క్ ముందు పనిచేస్తుంటారా? అయితే ఇది మీ...