Saturday, November 26, 2022
Homespecial Editionవినికిడి పట్ల అవగాహన అవసరం...

వినికిడి పట్ల అవగాహన అవసరం…

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

మాట్లాడడానికి, వినికిడి అవినాభావ సంబంధముంది. చెవులు వినిపిస్తేనే మాటలు వస్తాయి. మనకు వినిపించే శబ్దాలు మెదడులోకి వెళ్లి నిక్షిప్తం అవుతాయి. ఆయా మాటలను వినటం, వాటిని అనుకరించటం ద్వారానే మాటలు నేర్చుకుంటామనే సంగతి చాలామందికి తెలియదు. పుట్టిన వెంటనే ఏడుపుతో పాటు చుట్టుపక్కల శబ్దాలనూ వినటం జరుగుతుంది. తద్వారా పరిసరాలను, ప్రపంచాన్ని అర్థం చేసుకోవటం మొదలెడతాం. తల్లి మాటకు మనసు ఉప్పొంగినా, తండ్రి మాటకు ఒళ్లు పులకించినా అంతా వినికిడి ద్వారానే. మాటలు రావటానికి వినికిడి అత్యంత కీలకం. అన్నింటికీ వినికిడే మూలం. వినికిడి లేకపోతే జీవితమే నిశ్శబ్దంగా మారిపోతుంది. దీన్ని సకాలంలో గుర్తించలేకపోవటం మూలంగానే ఎంతోమంది చెవిటి-మూగ పిల్లలుగా మిగిలిపోతుండటం విషాదం.పిల్లలు తల్లి కడుపులో ఉండగానే 16 వారాల గర్భం సమయంలోనే శబ్దాలను వినగలుగుతారు. పుట్టిన వెంటనే తల్లి గొంతును గుర్తించగలుగుతారు కూడా. అయితే కొందరు పిల్లలకు పుట్టుకతోనే వినికిడి లోపం ఉంటుంది. కొందరికి మాటలు వచ్చిన తర్వాత రకరకాల సమస్యలతో వినికిడి దెబ్బతినొచ్ఛు. దురదృష్టవశాత్తు మనదేశంలో ప్రతి వెయ్యి శిశువుల్లో 5-6 మంది వినికిడి లోపంతో పుడుతున్నారని, వీరిలో తీవ్ర వినికిడి లోపం గలవారు 1-2 మంది ఉంటున్నారని అంచనా. గర్భిణులు వేసుకొనే కొన్నిరకాల యాంటీబయోటిక్‌ మందులతోనూ పిల్లల్లో వినికిడి లోపం తలెత్తొచ్చు. పుట్టిన వెంటనే ఏడ్వకపోవటం వల్ల మెదడుకు తగినంత ఆక్సిజన్‌ అందక మాటలు, వినికిడికి సంబంధించిన భాగాలు దెబ్బతిన వచ్చు. వినికిడి లోపానికి దారితీయొ చ్చు.ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనా ప్రకారం- ప్రపంచవ్యాప్తంగా 46.6 కోట్ల మంది పిల్లలు, పెద్దలు, 110 కోట్లమంది యువత వినికిడి లోపంతో బాధపడుతున్నారు. దీంతో ఎంతోమంది శారీరకంగా, మానసికంగా, సామాజికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. వినికిడి లోపాన్ని సరిదిద్దటానికి ఇప్పుడు మంచి చికిత్సలు, సాధనాలు అందుబాటులో ఉంటున్నాయి. సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకుంటే చాలావరకు ఇబ్బందుల పాలు కాకుండా చూసుకోవచ్ఛు. అందువల్ల వినికిడి లోపం గురించి తెలుసుకొని ఉండటం, అవగాహన కలిగుండటం ప్రతి ఒక్కరి బాధ్యత. పుట్టిన వెంటనే శ్రవణ పరీక్ష చేయటం ద్వారా సమస్యను ముందే గుర్తించే వీలుంది. అవసరమైన చికిత్స చేయటానికి వీలుంటుంది. ప్రతి శిశువుకూ పుట్టిన వెంటనే వినికిడి పరీక్ష చేయించాలి. ప్రతి బిడ్డకూ పుట్టగానే ఆటోఎకోస్టిక్‌ ఎమిషన్‌ పరీక్ష చేసి, వినికిడి సామర్థ్యాన్ని గుర్తించటం తప్పనిసరి. సమస్య 30 డెసిబెల్స్‌ కన్నా ఎక్కువ ఉంటే వినికిడిలోపం ముప్పు ఉందనే అర్థం. ఇలాంటి వారికి బ్రెయిన్‌స్టెమ్‌ ఎవకోడ్‌ రెస్పాన్స్‌ ఆడియోమెట్రీ (బెరా) పరీక్ష ద్వారా వినికిడి లోపం ఎంత ఉందని తెలుసుకోవాల్సి ఉంటుంది. తీవ్రతను బట్టి చికిత్స తీరు తెన్నులను నిర్ధారిస్తారు.వినికిడి లోపాన్ని ముందే గుర్తించి వినికిడి సాధనాలను, కాక్లియార్‌ ఇంప్లాంట్లను అమర్చగలిగితే వీరిని అందరి పిల్లలా ఎదిగేలా చేయొచ్ఛు చక్కటి జీవితాన్ని అందించవచ్చు.వినికిడి లోపం ఒక మాదిరిగా ఉన్న పిల్లలకు వినికిడి సాధనాలు బాగా ఉపయోగ పడతాయి. ఇవి శబ్దాలు పెద్దగా వినిపించేలా చేస్తాయి. దీంతో బాగా వినిపిస్తుంది. అనంతరం పిల్లలకు స్పీచ్‌ థెరపీ చేయటం ద్వారా మాటలు బాగా వచ్చేలా చేయొచ్ఛు సమస్యను ఎంత త్వరగా గుర్తించి చికిత్స చేస్తే అంత త్వరగా మాటలు వస్తాయి. తీవ్రం, మరీ తీవ్ర సమస్య గలవారికి కాక్లియార్‌ ఇంప్లాంట్‌ను అమర్చాల్సి ఉంటుంది. వీరికి ఆడిటరీ వెర్బల్‌ థెరపీ కూడా అవసరం. శబ్దాలు వినిపించటం, అవి మెదడులో నిక్షిప్తమయ్యేలా చూడటం, తిరిగి మాట్లాడేలా చేయటం దీనిలోని ముఖ్యాంశం. దీన్ని కూడా వీలైనంత త్వరగానే చేయాలి. ఆలస్యమైనకొద్దీ మాటల స్పష్టత దెబ్బతినే ప్రమాదముంది. పెద్దవారిలో ఒక మాదిరి నుంచి మధ్యస్థంగా వినికిడి లోపం ఉన్న వారికి వినికిడి సాధనాలు బాగా ఉపయోగ పడతాయి. తీవ్రం నుంచి మరీ తీవ్ర వినికిడిలోపం గలవారికి కాక్లియార్‌ ఇంప్లాంట్‌ సర్జరీ ద్వారా వినగలిగేలా చేయవచ్చు. వయసుతో పాటు వచ్చే మార్పుల్లో ఎలాంటి తేడా కనిపించినా వినికిడి లోపాన్ని అనుమానించాల్సి ఉంటుంది. మళ్లీ మళ్లీ చెప్పమని అడుగుతుండటం, టీవీ సౌండ్‌ పెంచుతుండటం, చదువులో వెనకబడిపోతుండటం, ప్రవర్తన సమస్యలు కనిపిస్తుండటం, చెవిలో చీము కారుతుండటం, చెవి నొప్పితో జ్వరం వంటివి ఉన్నా వినికిడి లోపాన్ని అనుమానించాలి.వయసుతో పాటు వచ్చే చెవుడు (ప్రెస్‌బయోసిస్‌) 50, 55 ఏళ్ల వయసులో మొదలవుతుంటుంది. వీరికి మంద్ర స్వరాలు (లో టోన్స్‌) బాగానే వినిపిస్తాయి గానీ ఉచ్చ స్వరాలు (హై టోన్స్‌) సరిగా వినిపించవు. ప్రశాంత వాతావరణంలో మాటలు బాగానే వినిపిస్తాయి. చుట్టుపక్కల చప్పుళ్లు ఉన్నప్పుడు ఇబ్బంది పడతారు. మాటలు సరిగా వినిపించవు. టీవీ సౌండ్‌ పెద్దగా పెడుతుంటారు.. కొంచెం దూరం నుంచి కూడా పిలిస్తే పలకలేరు. ఇది కుటుంబ సభ్యులకు ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తుంది. దీనికి మందులంటూ ఏవీ ఉండదు. సమస్య తీవ్రంగా ఉంటే వినికిడి సాధనాలు వాడుకోవాల్సి ఉంటుంది. సమస్య మరీ తీవ్రమైతే కాక్లియర్‌ ఇంప్లాంట్‌ అమర్చాల్సి ఉంటుంది. చెవిలో చీము, కర్ణభేరికి రంధ్రం పడటం మూలంగా వినికిడి లోపం రావచ్చు .సాయుధ దళాలు, గని కార్మికులు, పోలీసు సిబ్బంది వంటి వారికి ఇలాంటి లోపం రావొచ్ఛు. ఇది పూర్తిగా నివారించుకో దగిన సమస్య. చెవిలో నూనె వంటివేమీ పోయొద్దు. చెవిలోంచి చీము, నీరు వంటివి వస్తుంటే నిర్లక్ష్యం చేయొద్దు. పనిచేసే చోట, చుట్టుపక్కల పెద్ద శబ్దాలు లేకుండా చూసుకోవాలి. పెద్ద శబ్దాలు వచ్చే చోట పనిచేసే వారు చెవులకు మఫ్స్‌ ధరించాలి. వినికిడిలోపం ఎక్కువగా గలవారికి వినికిడి సాధనాలు వాడుకోవాల్సి ఉంటుంది. ఎక్కువసేపు డీజేలు, పెద్ద వాల్యూమ్ సంగీతం వంటివి వినవద్దు. ఇయర్‌ ఫోన్స్‌ వాడకంతో వినికిడి శక్తి కోల్పోయే ప్రమాదమున్నది. ఒక్క వినికిడి లోపమే కాదు, మానసిక ఇబ్బందులు, అసహనం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, నిద్రలేమి, తలనొప్పి వంటి అనేక సమస్యల బారిన పడుతున్నట్లు సర్వేల్లో తేలుతున్నది. భారత ప్రభుత్వం 2000 ఫిబ్రవరి 14న శబ్ద కాలుష్యం (నిబంధనలు- నియంత్రణ) చట్టం తీసుకు వచ్చింది. దానిప్రకారం పారిశ్రామిక ప్రాంతాల్లో పగటిపూట 75 డెసిబుల్స్‌, రాత్రి సమయాల్లో 70 డెసిబుల్స్‌ పరిమితి లోపే శబ్దం ఉండాలి. వాణిజ్య ప్రాంతాల్లో పగటిపూట 65 డీబీ, రాత్రి 55 డీబీకి మించిన శబ్దం ఉండరాదు. నివాస ప్రాంతాల్లో పగలు 55 డీబీ, రాత్రి 45 డీబీ పరిమితిలోపే శబ్దాలు ఉండాలి. నిశబ్ద ప్రాంతాల్లో పగలు 50డీబీ, రాత్రి 40డీబీ పరిమితి ఉండాలి. వైద్యశాలలు, విద్యా సంస్థలు, న్యాయస్థానాల వద్ద వాటికి వంద మీటర్ల దూరం వరకూ నిశ్శబ్ద జోన్లుగా ప్రభుత్వం తీర్మానించింది. ఇది కచ్చితంగా అమలు చేసే చర్యలు తీసుకోవాలి.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments