Thursday, June 30, 2022
HomeLifestylespecial Editionమసక బారుతున్న కౌటుంబిక సంబంధాలు

మసక బారుతున్న కౌటుంబిక సంబంధాలు

భారతీయ సంస్కృతికి, సంప్రదాయాలకు, నాగరికత పురోగతికి మూలమైనది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఆ వ్యవస్థ మూలాలే నేడు ఆధారాలను కోల్పోతున్నాయి. రక్త సంబంధము, సహచరత్వము, ఒకే నివాసం అంశాల విషయంలో కుటుంబ నైతిక, సామాజిక సూత్రాలు, సమైక్యత, సంఘటిత సమిష్టి జీవన విధానం గురించి ఈ కాలంలో పట్టింపులు లేకుండా పోతున్నాయి(importance of Family In Daily Life).

కుటుంబం అనగా ఒకే గృహంలో నివసించే కొంత మంది మానవుల సమూహం. వీరు సాధారణంగా పుట్టుకతో లేదా వివాహముతో సంబంధమున్నవారు. సమాజంలో వివిధ మతపరమైన వివాహ చట్టాలు కుటుంబ వ్యవస్థను గుర్తించాయి.

నాగరికత విస్తరణకు పూర్వమే మనదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉందని వివిధ గ్రంథాలలో పొందుపరచబడి ఉంది. నాగరిక ప్రపంచంలోనూ మన దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మూడుపువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లింది. మనదేశంలో ఉమ్మడి కుటుంబాలు సిరిసంపదలతో తూలతూగాయనడంలో సందేహం లేదు. ఒక కుటుంబంలో తాత మొదలు వారి పిల్లలు వారి పిల్లలు ఇలా మూడు నుంచి నాలుగు తరాలు ఉమ్మడి అనే గొడుగు కింద ఒదిగి పోయేవి. ఇంటి లోని పెద్దకు అందరూ గౌరవం ఇవ్వాల్సిందే. ఆయన మాటే వేదవాక్కు. అందరిదీ ఉమ్మడి వ్యవసాయమే. సమష్టి సంపదనే, సమష్టి భోజనాలే ఉండే వంటే ముచ్చటేస్తుంది. తల్లిదండ్రులు, అత్తమామలు, అక్క చెల్లెళ్లు, అన్నదమ్ములు, బావా మరదళ్లు, బంధు మిత్రులు, తాతలు, బామ్మలు, మనవలు, మనవ రాండ్రతో కళకళలాడే ఉమ్మడి కుటుంబాలు ఆప్యాయతలు ప్రేమానురాగాలకు నిలయాలు. పిల్లలు చిన్నవయస్సులో ఉన్నపుడు తల్లిదండ్రుల చెంతనే ఉంటారు. వారు పెద్దవారై పెళ్ళిళ్ళు అయిపోతే ఎవరి కుటుంబాలు వారివే. అంటే ఒక కుటుంబం నుంచి మరిన్ని కుటుంబాలు ఉద్భవిస్తున్నాయి. ఒక కుటుంబం మరెన్ని కుటుంబాలను సృష్టించి నప్పటికీ వంశవృక్షపు వేళ్లు మాత్రం మొదటి కుటుంబం వద్దే ఊనుకుని ఉంటాయి. అందుకే సంవత్సరంలో ఒక రోజైనా అందరూ కలుసు కోవాలని సరదాగా గడపాలని కోరుకోవడం సహజం.

importance of Family In Daily Life

ఆధునిక యుగంలో ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఒకరినొకరు పలుకరించుకునే సమయం చిక్కని కుటుంబాలు ఎన్నో. కేవలం ఫోన్‌లోనో, మొబైల్‌లోనో యోగ క్షేమాలు కనుక్కునే కుటుంబాలు కూడా లేకపోలేదు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలకు మనదేశం పుట్టిల్లు. ఇప్పుడు ఆ సంస్కృతి భూతద్దం పెట్టి వెతికినా దొరకదంటే అతిశయోక్తి కాదు. అనేక కుటుం బాలు వ్యక్తిగత కారణాలతో విచ్ఛిన్నం కావడం మనం రోజూ చూస్తూ ఉన్నదే. అయినప్పటికీ మన దేశంలో అనేక కుటుంబాల మధ్య కనిపించే అన్యోన్యతా భావం మరే దేశంలోనూ కనిపించదు.

విదేశీ పాలకుల పాలనలో ఉమ్మడి కుటుంబాలుగా చెలామణి అయిన ఎన్నో కుటుంబాలు నవనాగరిక ప్రపంచంలో విచ్ఛిన్న మయ్యాయి. ఆధునికత పెరగడం, నాగరికత పురోభివృద్ధి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వెరసి ఉమ్మడి వ్యవస్థ మీద తీవ్ర ప్రభావాన్ని చూపింది. నవ నాగరిక ప్రపంచంలో రెండు కుటుంబాలు కాదు కదా రెండు మనసులు కూడా కలసి జీవించ లేని పరిస్థితి నెలకొంది.

importance of Family In Daily Life

డబ్బు సంపాదన కోసం కనీసం భార్యభర్తలు కూడా ఒక చోట కూర్చుని ఒకరినొకరు పలకరించుకునే సమయం చిక్కడం లేదంటే మన కుటుంబాలు ఎంతగా విచ్ఛిన్న మయ్యాయో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి కుటుంబాలలో కలిసి మెలిసి మనగలిగే మనస్తత్వాలు లోపించి పెళ్లయిన మరునాడే వేరు కాపురాలు పెట్టుకుని జంటలుగా ఒంటరై పోతున్నారు. దీంతో సలహాలిచ్చే పెద్ద దిక్కులు లేకపోవడం, ఆపదలో ఆదుకునే ఆత్మీయులు దూరం కావడం, కనీసం మనసులోని బాధలను పంచుకునే బంధువులు కరువవ్వడం నేటి సమాజంలో మనకు నిత్యం కనిపించే దృశ్యం.

కుటుంబ దౌర్జన్యం చట్టం 498-ఎ ను దుర్వినియోగం చేయడం ద్వారా కొందరు భార్యలు, భర్తలతో పాటు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు బనాయించి వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. బోగస్‌ వరకట్న కేసులు బనాయించడం ద్వారా దేశవ్యాప్తంగా వేల మంది పురుషులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే పురుషులు వివాహం చేసుకోవడానికి వెనుకంజ వేసే పరిస్థితి వస్తుంది. భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న విభేదాలు న్యాయస్థానం వెలుపలనే పరిష్కరించు కోవడం సముచితంగా ఉంటుందని విజ్ఞులు, అనుభవజ్ఞులు అభిప్రాయ పడుతున్నారు.

రామ కిష్టయ్య సంగన భట్ల... 9440595494
రామ కిష్టయ్య సంగన భట్ల… 9440595494
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments