5.1 C
New York
Saturday, March 25, 2023
HomeLifestyleDevotionalధర్మపురిని దర్శిస్తే యమపురి ఉండదు

ధర్మపురిని దర్శిస్తే యమపురి ఉండదు

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

భారతీయ ప్రాచీన ఆర్ష విద్యా సభ్యతా సంస్కృతులకు పట్టుకొమ్మగా, హైందవ సనాతన సంప్రదాయాలకు నెలవుగా, అనాది కాలంగా హైందవ ధర్మ ప్రచార కేంద్ర బిందువుగా, పవిత్ర గోదావరి నదీ తీరాన వెలసి ఆస్తిక ప్రపంచానికి వరదాయిగా, భక్తి ముక్తి ప్రదా యినిగా విరాజిల్లుతున్నది… జగిత్యాల జిల్లాలోని గోదావరీ తీరస్థ సుప్రసిద్ధ తీర్ధమైన ప్రాచీన ధర్మపురి పుణ్యక్షేత్రం. తెలుగు నేలపై సుప్రసిద్ధ పుణ్య క్షేత్రంగా, దక్షిణ కాశీగా, నవనారసింహ క్షేత్రాలలో ఉత్కృష్టమైనదిగా, హరిహర క్షేత్రంగా, పౌరాణిక ఐతిహాసిక, చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకున్నదీ క్షేత్ర రాజం. బ్రహ్మండ, స్కందాది పురాణాలలో ధర్మపురి క్షేత్ర ప్రాశస్త్యం ప్రశంసించ బడినది. ఈక్షేత్ర దేవస్థాన అంతర్గతంగా ఉన్న యమ ధర్మరాజు మందిరం విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. భారతావని లోనే అరుదుగా, అపురూపంగా ధర్మపురి క్షేత్రంలో వెలసిన “యమ ధర్మరాజును దర్శిస్తే యమపురి ఉండబోదని” ప్రతీతి. హిరణ్యకశిపుని సంహారానంతరం, ఉగ్ర నారసింహుని శాంతింప జేసేందుకై బ్రహ్మాది దేవతలు పుణ్య తీర్ధమూ, పవిత్ర క్షేత్రమూ అయిన ధర్మపురిలో తపో, యజ్ఞ, ధ్యానాది సత్కర్మల నొనరించినట్లు స్థల పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకానొక సమయాన యమ ధర్మరాజు, తన లోకమునందు అనేక నరక బాధలను అనుభవించు చున్న పాపులను గాంచి, నిట్టూర్పులు విడిచి, తనలో తను ఇట్లు విచారించెనని, పుణ్యాత్ములను దర్శించినచో పుణ్యము, పాపాత్ములను చూసినచో పాపమే లభించునని, నిత్యము పాపులను దర్శించుటచే తనకు పాప సంచయమే కలుగు చున్నదని, తన యందు స్వయంకృత పాప మనునది ఏమాత్రము లేకున్ననూ, పాపుల నిత్య దర్శనముతో మనశ్శాంతి కలుగడం లేదని తలంచి, మనశ్శాంతిని పొందుటకు పుణ్య క్షేత్ర దర్శన ప్రయాణ ఉన్ముఖుడై, సమస్త క్షేత్రముల తిరిగి చివరకు ధర్మపురికి ఏతెంచెనని, ఈ క్షేత్రమున గోదావరి నదీ స్నానమాచరించగనే యమునకు మనశ్శాంతి కలుగెనని, పాపాత్ముల దర్శన దోషములు తొలగెనని, బ్రహ్మాండ, స్కాంద పురాణాంతర్గత ధర్మపురి క్షేత్ర మహాత్మ్యం ఆధారంగా నైమిశారణ్యంలో సూత పౌరాణికుడు, శౌనకాది మహర్షులకు వివరించినట్లు, నారదుడు పృథు మహారాజుకు క్షేత్ర మహిమను తెలిపినట్లు వివరించ బడింది. యమ ధర్మ రాజు నృసింహుని మందిరాని కేగి చేసిన పూజలకు ప్రసన్నుడైన నారసింహుడు, యమధర్మరాజును తన సన్నిధిలో నివసించుమని తెలిపెనని, యముడు గోదావరిలో స్నానమాచరించిన స్థలమునకు ”యమకుండ”మని పేరు కలుగునట్లు, అచట స్నానమాచరించి నృసింహుని పూజించు వారికి యమలోక బాధలు కలుగ కుండునట్లు, సర్వపాప విముక్తి కలుగునట్లు నరసింహుడు వరమిచ్చినట్లు, యమ ధర్మరాజు తన అంశ రూపమును శ్రీనరసింహ మందిర పురోభాగమున నిలిపినట్లు పురా ణాలు విశదీకరిస్తున్నాయి. లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో యోగానంద నరసింహ ప్రధానాలయం ముందు భాగాన ఉంది యమ ధర్మరాజు మందిరం. కోరలతో, యమ దండాన్ని ధరించిన భీకరాకార ఆరు అడుగుల భారీ విగ్రహం ఇందుంది. ‘దక్షిణాభి ముఖీగంగా, యత్ర దేవో నృకే సరీ, తత్రశ్రీర్విజయోర్భూతి:, కాశ్య యశ్యత గుణం భవేత్” అని దక్షిణాభి ముఖియై ప్రవహిస్తున్న గోదావరి తీరస్థమైన ధర్మపురి క్షేత్రం విశిష్టతను కలిగి యున్నది. వేరెచ్చటనూ కానరాని విధంగా, ధర్మపురి క్షేత్రం వద్ద గోదావరి దక్షిణ వాహినిగా ప్రవహిస్తున్నది. అష్ట దిక్పాలకులలో ఒకరైన యముడు దక్షిణ దిశాధిపతి. అంతేకాక గ్రహాల దృష్ట్యా కుజుడు దక్షిణ దిశాధిపతి. కుజ గ్రహానికి మూలాధిపతి నరసింహుడని పరాశరుడు “బృహత్ పరాశర హోరా శాస్త్రం” నందు నుడివి ఉన్నాడు. కనుక ధర్మపురిలో దక్షిణ వాహిని.యైన గౌతమి యందు దక్షిణాభిముఖులై, స్నానాలు ఆచరించి, నరసింహుని దర్శిస్తే నరక బాధలుండవని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇంతటి ప్రాధాన్యతను సంతరించికున్న ధర్మపురిలో వెలసిన యమ ధర్మరాజునును దర్శించే భక్తుల సంఖ్య నానాటికీ అధిక మవుతున్నది. ఇటీవల సంభ విస్తున్న అనూహ్య ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా, అకాల మృత్యు నివారణకై అధర్వణ వేదంలో పేర్కొనబడిన “ఆయుష్య సూక్త” ప్రత్యేక పూజాదులలో అంతర్భాగంగా అభిషేకం, ఆయుష్య సూక్తం, యమ సూక్త మంత్రం, పురుష సూక్తం, శ్రీసూక్త పఠనాలు, జ్వరహర స్తోత్రం, రోగ నివారణ సూక్తాలు,యమాష్టకాది పూజలలో పాల్గొనేందుకై సుదూర ప్రాంతాల నుండి భక్తులు క్షేత్రానికి విచ్చేస్తున్న భక్తుల సంఖ్య నానాటికీ అధికమవుత్నుది.

ఏప్రిల్ 11వ తేదీ…ధర్మరాజ దశమి లేదా యమ ధర్మరాజ దశమి మృత్యు సంబంధ హిందూ దేవుడు అయిన యమ భగవానుడికి అంకితం చేయబడింది. యమ ధర్మరాజు అని కూడా పిలువబడే యమ ధర్మరాజు కు అంకితం చేసిన పూజ ఆ రోజు జరుగుతుంది. ఈ వ్రతాన్ని 10 వ రోజు చైత్ర మాసం శుక్ల పక్షంలో పాటిస్తారు. ప్రాథమి కంగా రోజున చేసే పూజలు భక్తుడి నుండి మరణ భయాన్ని తొలగించడానికి సహాయ పడుతాయి.

రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments