Saturday, November 26, 2022
Homespecial Editionరుతు సంబంధమైన పర్వం 'హోళి'

రుతు సంబంధమైన పర్వం ‘హోళి’

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి


పండగల ప్రాదుర్భావానికి
మూడు ముఖ్య కారణాలుగా కనిపిస్తాయి. ఒకటి మహాపురుషుల జన్మదినాలు. రెండవది గొప్ప సంఘటనలకు స్మృతి చిహ్నాలుగా జరుపుకునేవి. మూడవది రుతువులను బట్టి నిర్వర్తించుకునేవి. హోళి రుతు సంబంధ పర్వం. ప్రత్యేకించి వసంత రుతువుకు సంబంధించిన పండగ. మాఘమాసపు కృష్ణపక్ష పంచమి అంటే వసంత పంచమి దినాలకే, వసంత రుతువు లక్షణాలు పొడసూపుతాయి. కాగా ఫాల్గుణ పూర్ణిమ నాటికి అవి మరింత ప్రస్ఫుటమవుతాయి. రాగి రంగుతో చిగుళ్ళు, ఆకుపచ్చ రంగుతో పత్రాలు పలు రంగులతో పూలు దర్శనమిచ్చే సమయం. తొలకరి పంటలన్నీ ఇంటికి చేరి, పునాస పంటలన్నీ పంట ముఖాల పసిమితో ఉండే కాలమిది. ఇలా వర్ణోన్మీలనం ఈనాటి రంగులీలకు ప్రాతిపదికగా మారింది. హోళి పండగను హిందూ దేశంలో వివిధ ప్రాంతాలలో, వివిధ రకాలుగా జరుపుకోవడం కద్దు. హోలీ పండుగను భారత దేశంలోనే కాకుండా నేపాల్‌, బంగ్లాదేశ్‌ తదితర దేశాల్లో కూడా వైభవంగా జరుపు కుంటారు. వసంత కాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను ‘వసంతోత్సవం’ పేరిట జరుపుకునేవారు. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి.

బృందా వనంలో శ్రీకృష్ణుడు గొల్లపడుచు లతో వినోదించిన పూజకు, ఈ పండగకు కొన్ని చోట్ల సంబంధం ఉంది. బాలకృష్ణుని ఊయలలో పరుండచేసి, బుక్కా, గులాల్, ఎర్రపాడి చల్లి పూవులు వేసి, పూజ చేస్తారు. దీనిని డోల జాతరగా పిలుస్తారు. ‘డోల’ అంటే ‘ఊయల’, ఫాల్గుణ పూర్ణిమ వసంత సంబంధం. కొందరు ఔత్తరాహికులకు ఫాల్గుణ పౌర్ణమి కడచిన మరుసటి దినం సంవత్సరాది. దక్షిణాపథ వాసులైన కర్నాటక, మహారాష్ట్ర తెలుగు జాతీయులకు మరోపక్షంలో చైత్ర మాసాది ఉగాది. సూర్యుడు మేష రాశిలో ప్రవేశించే దినం తమిళుల వత్సరాది. ఇవన్నీ వసంతరుతు ప్రారంభం లోనే కావడం గమనార్హం. ఫాల్గుణ పౌర్ణమి దినమంతా ఉత్సవ దినమే. రంగులు కలిపిన నీళ్ళు ఒకరిపై ఒకరు చల్లు కుంటారు. ఇలా నీళ్ళు చల్లుకునే క్రీడనే వసంతోత్సవం అంటారు.
వసంత కాలంలో వాతావరణం మెలమెల్లగా మారతూ, వైరల్ జ్వరం, జలుబు లాంటి వ్యాధులు ప్రబలడం కారణంగా, వాటి నివారణ,. ఉపశమనానికి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన, నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందని పెద్దలు చెప్పేవారు.

పూర్వకాలంలో మోదుగు పువ్వులు తెచ్చి రోట్లో పోసి దంచి, నీళ్ళతో కలిపి చల్లుకునే వారని జానపద పాటల ద్వారా గ్రహింప వీలగు తున్నది. మోదుగు పువ్వును దంచి శీతల కషాయం చేసి, చల్లు కోవడం వైద్య ప్రక్రియలో భాగమై, ఆరోగ్య వర్ధక మవుతుంది. మోదుగను సంస్కృతంలో ‘పలాశ’ అంటారు. బ్రహ్మచర్య వ్రత దీక్షితుడైన ఉపవీతుడైన వటునకు దండధారణ, పలాశ వృక్ష ఛాయలో ఉపనయన కార్యకలాపం, పలాశ పత్రాలతో కుట్టిన విస్తట్లో భోజనం ఆచరణగా ఉంది. వసంత కాలంలో ఎటువంటి వారికైనా కామోద్దీపనం కలగడం సహజం. కామాన్ని అదుపులో ఉంచుకొనుటకు మోదుగ ఆమోఘ సాధనం. ఉద్రేకాన్ని అణిచే ఉచిత వైద్య ప్రకియ ఇది. ఏప్రిల్ 1వ తేదీ క్రైస్తవుల “ఆల్ ఫూల్స్స్ డే”కు భారత దేశ హోలీ వేడుకలకు పోలిక లున్నాయి. ఇది వసంతోత్సవం, గ్రామీణ క్రీడలు, ప్రేమ కలాపాలకు సంబంధించింది. యూరోపియన్ల అల్లరి చిల్లరి చేష్టలకు, హిందువుల బుక్కా, గులాల్, రంగునీళ్ళు చల్లుకోవడం, చిమ్ముకోవడం, వేళాకోశాలు చేసు కోవడాలకు దగ్గరి పోలికలు ఉన్నాయి. వేళాకోళాలు, ఆనందంలో మునిగి తేలడాలు అతిశయంగా ప్రదర్శితం అవుతూ, యువత ఇంటింటికీ తిరిగి పండగ ఖర్చులకు మామూళ్ళు దండుకునే కార్యక్రమం ఎక్కడా చూసినా దర్శనమిస్తున్నది.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments