భారత రాజ్యాంగ నిర్మాత, విద్యాధికుడు, తత్వవేత్త, సంపాదకుడు, విప్లవకారుడు, దార్శనికుడు, చరిత్రకారుడు, ప్రాసంగికుడు, రచయిత, దళిత జన బాంధవుడు, అర్ధ శాస్త్రజ్ఞుడు, స్వతంత్ర భారత తొలి న్యాయ శాఖ అమాత్యులు, న్యాయవాది, బౌద్ధ ధర్మ పునరుద్ధారకుడు, భారతరత్న డాక్టర్ భీమ్ రావు రాంజీ అంబేద్కర్ బహుముఖ ప్రజ్ఞాశాలి… 1891 ఏప్రిల్ 14న నాటి సెంట్రల్ ప్రావిన్సెస్ లో సైనిక స్థావరం ఐన మహోమ్ ఊరిలో రాంజీ మలోజి సాక్పాల్, భీమాబాయి దంపతులకు 14వ, చివరి సంతానంగా జన్మించిన భీమ్ రావు, క్రమశిక్షణతో పెరిగి ప్రతిదినం రామాయణ, భారత, తుకారాం, మోరోపంత్ ల గీతాలు గానం చేసేవారు. ఆధునిక మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలో అంబావడే పట్టణంలో ఆయన కుటుంబం జీవించినందున, మరాఠీ నేపథ్యాన్ని కలిగి ఉన్నారు. వారి కుటుంబం శాకాహారం తీసుకునేది. మొహర్లు అస్పృశ్యులుగా, పరిగణింప బడిన కాలంలో, బాల్యం నుండి అంటరాని తనాన్ని ఎదుర్కొని, ఎన్నో అవమానాలకు గురైనారు. 1996లో ప్రాథమిక విద్య, ఏలిఫిస్టన్ హైస్కూల్ లో 1907లో ఎస్ ఎస్ ఎల్ సీ పూర్తి చేశారు. 1908లో 16వ ఏటనే రమా బాయ్ తో వివాహం జరిగింది. బరోడా మహారాజు షాయాజీ గాయేక్వాడ్ ద్వారా 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో ఏలిఫిస్టన్ కళాశాలలో బిఏ ఉత్తీర్ణులు అయినారు. 1913లో రాజుగారి ఆర్థిక సాయంతో కొలంబియా యూనివర్సిటీలో చేరారు. 1915 – 16 లో ఎం. ఏ, పీహెచ్ డీ సాధించారు. 17 లో తిరిగి వచ్చి మహారాజు మిలిటరీ కార్యదర్శిగా పనిచేశారు. కొల్హాపూర్ మహా రాజు సాహు మహారాజ్ సహాయంతో, “మూక్ నాయక్” పక్ష పత్రికకు సంపాదకత్వం వహించారు. సాహూ మహరాజ్ సాయంతో 1920లో విదేశీ చదువులకు పయనమయ్యారు. 22 లో బారిస్టర్ ఎట్ లాకు ఆహ్వానం అందింది. 27మార్చి 20న మహద్ చెరువు నీరు స్వీకరించి పోరాటం జరిపారు. 27లో “బహిష్కృత భారతి”” మరాఠీ పక్ష పత్రిక ప్రారంభించారు. 27 డిసెంబర్ 25న “మనుస్మృతి”ని దహనం చేశారు. 1930లో నాగపూర్ ప్రసిద్ధ ఉపన్యాసం గావించారు. 30 నవంబర్ 12న మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. 2వ సమావేశంలో దళితులకు ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపు విషయంలో మహాత్మా గాంధీతో తీవ్రంగా విభేదించారు. 32 లో రాంసే మెక్ డొనాల్డ్” కమ్యునల్ అవార్డు” ప్రకటన ద్వారా ప్రత్యేక నియోకవర్గాల ప్రతిపాదన జరిగింది. పూనా ఒప్పందం ద్వారా కమ్యునల్ అవార్డు కన్నా ఎక్కువ స్థానాలు వుమ్మడి నియోజక వర్గాలలో ఇచ్చేందుకు ఓప్పందం కుదిరింది. 35 మార్చి 24న రమాబాయ్ మరణించింది. 36లో ” కుల నిర్మూలన” గ్రంథాన్ని రచించారు. 42 జూలై 18న షెడ్యూలు కులాల ఫెడరేషన్ ను స్థాపించారు. 42 నుండి 46 వరకు వైస్రాయి క్యాబినెట్ లో “కార్మిక మంత్రి”గా పని చేశారు. 47 ఆగస్టు 3న “న్యాయశాఖ మంత్రి”గా బాధ్యతలు స్వీకరించారు. ఆగస్టు 19న “రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్” గా నియమితులైనారు. 48 ఏప్రిల్ 15న తమ 55వ ఏట బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శారదా కబీర్ ను ద్వితీయ వివాహ మాడారు. 50 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదం పొందింది. 51 లో న్యాయ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. 52 లో ముంబాయి శాసన సభ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 56 అక్టోబర్ 14న నాగపూర్ లో “బౌద్ధ మతం” స్వీకరించారు. డిసెంబర్ 6న ఢిల్లీలో పరమ పదించారు. అంబేడ్కర్ మరాఠీ, హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, పాళీ, సంస్కృతం, బెంగాలీ, పర్షియన్, ఫ్రెంచ్, జర్మన్ తదితర భాషలలో ప్రావీణ్యత సాధించడమే కాక పాళీ – ఇంగ్లీష్ నిఘంటువు కూడా రాశారు. ఆయనను ఒక వ్యక్తిగా కాక, శక్తిగా, మహోద్యమంగా, విద్యావేత్తగా, సాంఘిక సంస్కర్తగా, స్వతంత్ర ప్రతిభకు చిరునామాగా, సాహిత్య వ్యాప్తికి నిరంతర కృషి సల్పి, మానవత్వాన్ని, సకల జన సంక్షేమాన్ని కోరిన భారత రత్నంగా, ప్రతి భారతీయుడు పూర్తిగా స్ఫూర్తిని తీసుకోవాల్సి ఉంది…
రామ కిష్టయ్య సంగనభట్ల…
9440595494