ఆచరణాత్మక మానవతావాది హేమలతా లవణం……………………………….. ఫిబ్రవరి 26… హేమలతా లవణం జయంతి…………………………… రామ కిష్టయ్య సంగన భట్ల…. 9440595494……………………………జోగినీ దురాచార నిర్మూలన, నేరస్థుల సంస్కరణల కోసం అవిరళ కృషి జరిపిన మహిళా సంఘ సంస్కర్త, ప్రముఖ రచయిత్రి డాక్టర్ హేమలతా లవణం.స్వాతంత్య్రానంతర భారత దేశంలో సంఘ సంస్కరణ ఉద్యమానికి అవిరళకృషి చేసిన ప్రముఖ సామాజిక సేవకురాలు. సంఘం విస్మృతులైన దళితులను, గిరిజనులను సంస్కరణోద్యమ అజెండాలో చేర్చి సమకాలీన భారత చరిత్రలో ఒక ప్రధాన మైలురాయిగా మిగిలారు. సుప్రసిద్ధ కవి గుఱ్ఱం జాషువా కుమార్తెగా, సంఘసేవకుడు గోపరాజు రామచంద్రరావు (గోరా) కోడలిగా, లవణానికి జీవన సహచరిగా, అన్నింటినీ మించి సాంఘిక సంస్కర్తగా చిరపరిచితులు ఆమె.ఆస్తికురాలిగా జీవితం ప్రారంభించి, వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వాన్ని పెంపొందించుకున్న ఆమె నాస్తికురాలిగా మారారు. ప్రశ్నించే చైతన్యం, పరీక్షించే మనస్తత్వం, సమాజంలో అణగారిన ప్రజల అభ్యున్నతికి పాటుపడాలన్న తపన, దారిద్ర్యాన్ని, అసమానతలను తొలగించి తోటి మానవులకు తోడ్పడాలన్న ఆలోచన ఆమెను క్రొత్తపుంతలు తొక్కడానికి పురికొల్పాయి. తనలో నిహితమైన శక్తి సామర్థ్యాలను, సంఘ సంస్కరణాభిలాషను, సమాజ కళ్యాణ కార్యక్రమాలను పెంపొందించేందుకు ఆమె ముందడుగు వేశారు. స్టువర్తుపురం దొంగతనాలు వృత్తిగా జీవించిన కుటుంబాలను మంచి మార్గంలో పెట్టిన మనత హేమలతదే. హేమలతా లవణం (ఫిబ్రవరి 26, 1932 – మార్చి 20, 2008) గుంటూరు జిల్లా వినుకొండలో జాషువా మరియమ్మలకు 1932 సంవత్సరం ఫిబ్రవరి 26 న ఆఖరి సంతానంగా జన్మించారు.ఆమె ప్రాథమిక, మాధ్యమిక విద్య గుంటూరులో సాగింది. మద్రాసు క్వీన్స్ కళాశాలలో బి.ఏ బంగారు పతక గ్రహీత. నాస్తికత్వం, ప్రజాస్వామ్య విలువలు, గాంధేయ వాదం తదితర విలువలకు కట్టుబడిన గోరా కుమారుడు లవణంతో ఆమె వివాహం జరిగింది. వర్ణభేదాలను అతిక్రమించి జరిగిన ఆమె వివాహం అప్పట్లో సంచలనం కలిగించింది. వినోబా భావే భూదాన యాత్రలో ఆయనతో పాటు చంబల్ లోయలో పర్యటించి బందిపోటు దొంగల్లో మానసిక పరివర్తన తెచ్చేందుకు కృషిచేేశారు. 1961లో వాసవ్య విద్యాలయాన్ని స్థాపించి సమత, మమతల కోసం పాటు పడ్డారు. శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో ఆర్థిక సమతా మండలి అని సేవా సంస్థను స్థాపించి వెనుక బడిన వారిలో, నిమ్న కులాల్లో చైతన్యం కోసం పలు కార్యక్రమాలు చేపట్టారు. 1981లో కావలిలో ‘నవవికాస్’ అనే సంస్థను స్థాపించి దాని ద్వారా అణగారిన వర్గాలను ఆదుకొన్నారు. జోగినులను, వారి పిల్లలను ఆదుకోవడానికి ‘సంస్కార్’ చెల్లి నిలయం అనే సంస్థలు ఏర్పరచారు. అంధ విశ్వాసాలు ‘బాణామతి’ మహిళల జీవితాలను ధ్వంసం చేస్తోన్న వైనాన్ని గుర్తించి వాటిని ఆరోగ్య సమస్యగా గుర్తింప చేయడానికి కృషి చేశారు. రెండు వేలకు పైగా జోగినులను సంస్కరించడమే కాక ప్రభుత్వం చేత వారికి పొలాలు ఇప్పించి, జోగినులకు వివాహాలు జరిపించారు. సంస్కార్ సంస్థను స్థాపించి, నిజామాబాదు జిల్లాలో జోగినీ వ్యవస్థ నిర్మూలణకు ఆమె చేసిన కృషి ఫలితంగా “ఎన్టీ రామారావు ప్రభుత్వం జోగినీ వ్యవస్థ నిర్మూలణ చట్టాన్ని” తెచ్చింది. వర్ణాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించారు. బాలికల కోసం నిజామాబాద్ జిల్లా, గాంధారి గ్రామంలో ప్రత్యేక పాఠశాల నిర్మించారు. చైల్డ్ ఎట్ రిస్క్ (సి.ఎ.ఆర్) పేరుతో దొంగలు, తాగు బోతులు, వ్యభిచార వృత్తిలో కూరుకు పోయిన వారి పిల్లల కోసం సంస్కరణ కేంద్రం స్థాపించారు.”గోరా కోడలు కావడం తన జీవితంలో జరిగిన గొప్ప విషయం” అనేవారు హేమలత. అప్పటి వరకు ఇంటి బాధ్యతలు చదువుకి మాత్రమే పరిమితమైన ఆమె బయటి ప్రపంచాన్ని చూసింది లవణంతో కలిసి చేసిన యాత్రల్లోనే. అయితే, అతి తక్కువ కాలంలోనే సంఘసేవికగా మారి పోగలగడం వెనుక ఆమెలో ఉన్న దయా గుణం, స్పందించే హృదయం కారణాలు అంటారు.జాషువా కావ్యాలు అందరికీ అందుబాటులో ఉండాలన్న దృఢసంకల్పంతో వాటన్నిట్నీ ముద్రించారు. స్వయంగా పలు ప్రక్రియల్లో రచనలు చేశారు. అహింసా మూర్తులు – అమర గాథలు, నేరస్థుల సంస్కరణం, జీవన ప్రభాతం, జాషువా కలం చెప్పిన కథ, మా నాన్నగారు, జీవన సాగరం, అనుభవ తరంగాలు, నేరస్తుల సంస్కరణ, తాయెత్తు – గమ్మత్తు, మృత్యోర్మా అమృతంగమయ వంటి పలు రచనలు చేసిన ఆమె ‘జీవన ప్రభాతం’ నవలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం పొందారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆత్మగౌరవ పురస్కారం, కర్ణాటక ప్రభుత్వం నుంచి దేశస్నేహి పురస్కారం, అమెరికా నుంచి ఎథీయిస్ట్ ఎచీవ్మెంట్ అవార్డు, 2003 సంవత్సరానికి రెడ్ అండ్ వైట్ బ్రేవరి అవార్డు, సావిత్రి పూలే అవార్డు వంటివి ఎన్నో పొందారు. ఆంధ్ర, నాగార్జున విశ్వ విద్యాలయాల సిండికేట్ మెంబరుగా పనిచేశారు. స్టూవర్టుపురం దొంగల పునరావాసం – సంస్కరణ దురాచారంపై హేమలతా లవణం విశేషంగా కృషి చేశారు. 1977 దివిసీమ ఉప్పెనలో బాధితులకు పునరావాస సేవలందించారు. 1979లో ప్రకాశం, నెల్లూరు, 1996 తూర్పుగోదావరి జిల్లా తుపాను విపత్తు సమయంలో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆమె సంఘ సేవికగా చేసిన కృషికి, రచనలకు తెలుగు విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్, తానా ఎచ్చీవ్మెంట్, వరల్డ్ ఎచ్చీవ్మెంట్ అవార్డులు అందుకున్నారు. మాజీ ముఖ్య మంత్రులు ఎన్టీఆర్, చంద్రబాబు నుంచి తెలుగు ఆత్మగౌరవ అవార్డులు తీసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి నుంచి ఉగాది పురస్కారాన్ని, అంబేద్కర్ శతజయంతి సందర్భంగా భీమరత్న అవార్డును పొందిన ఏకైక మహిళ హేమలత. గుఱ్ఱం జాషువా ఫౌండేషన్ స్థాపించి దేశంలో తొమ్మిది మంది కవులకు పురస్కారాలు అంద చేశారు. అండాశయపు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ విజయవాడ లోని నాస్తిక కేంద్రంలో మార్చి 20, 2008 న శాశ్వత నిద్రలోకి జారుకున్నారు హేమలతా లవణం.
ఆచరణాత్మక మానవతావాది హేమలతా లవణం……
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
RELATED ARTICLES