వేప పువ్వు గుణ వంతమైన ఓషధి. రక్తాన్ని శుద్ధి చేసి, వృద్ధి పరిచే గుణం కలిగి ఉంటుంది. వైద్యానికి చాలావరకు ఉపయోగించే వేప చెట్టుకు ప్రాధాన్యత ఉంది. వృక్ష సర్వాంగాలు వైద్యానికి ఉప యుక్తాలే. ప్రధానంగా రోగ క్రిమి నాశని (యాంటీ బయాటిక్) గా వాడటం కద్దు. మానవునికి ఆరోగ్య ప్రదాయిని అయిన వృక్ష రాజా లలో వేప ముఖ్యమైనది. స్వర్గలోకంలో ని “Ambrosia” వృక్షం యొక్క అంశతో, భూలోకాన “వేపచెట్టు” పుట్టిందని, మహారాష్ట్ర సంప్రదాయక విజ్ఞానం స్పష్ట పరుస్తున్నది. ప్రాణవాయువు మూలాధారమైన వేప వృక్ష గాలి ఆరోగ్య ప్రధానమైనదని, విజ్ఞాన శాస్త్రం స్పష్టం చేస్తున్నది. వేపపువ్వు, వేప ఆకు రెండూ ఉపయోగకరమైనవి. ఆయుర్వేద వైద్యులు వేపాకు విరివిగా వాడతారు. చర్మవ్యాధులకు పచ్చి వేపాకు నలుగు పెడతారు. అమ్మవారి జబ్బులలో రోగులకు, ఆకులు దట్టంగా ఉండే వేప రొట్ట వాడుతారు. వ్యాధులు సోకకుండా, ఇళ్ళ ముంగిళ్ళలో వేపాకు తోరణాలు కడుతుండడం, సర్వత్రా దర్శనమిచ్చే దృశ్యం. వసంత రుతువు సంబంధిత పర్వదినమైన ఉగాదినాడు దొరికే వేప పువ్వు వాడమనే పెద్దల ఉద్దేశం, ప్రాప్త కాలజ్ఞతకు నిదర్శనం. ఆ ఆచారమే సంప్రదాయ సిద్ధం, స్తవనీయం, సర్వోత్తమం.
ప్రకృతి ఆరాధనకు పెరు మోసిన మన పెద్దలు, రుతు సంబంధమైన ఆయా పండుగల కార్యకలాపాలలో, ఆయా రోజులలో లభ్యమయ్యే, ప్రకృతి పదార్థాలకు, వేదాంతార్థంతో
కలిపి ప్రాధాన్యత కల్పించారు. రాగల కష్టాలను, సుఖాలను అనుభవించడానికి, సంసిద్ధంగా ఉంటామని సూచించడానికి, “ఉగాది” నాడు, “నింబ కుసుమ భక్షణం”, “పచ్చడి సేవనం” విధిని కల్పించారు. వేప చెట్టుకు వృక్ష శాస్త్ర నామం Helia azadirachta అని. ఇందులో Helia అన్నది గ్రీకు పదం. azadirachta అన్నది పారశీక తద్భవం. పారశీక భాషలో వేప చెట్టుకు,Helia azadirachta అని పేరు. దీనికి ఉత్తమ వృక్షం అని అర్థం పంచాంగంలో “నింబ కుసుమ భక్షణం” అని ఉన్నా, “ధర్మసింధువు” ఈ పర్వపు ఆచరణ విధానంలో “నింబ పత్రాషనం” అని ఉంటుంది. దీనినిబట్టి ఉగాదినాడు వేపాకు తినాలని స్పష్టమవుతున్నది. పువ్వైనా, ఆకైనా, వేప చెట్టుకు సంబంధించినవి సేవించడం ఉగాది విధాయక కృత్యాలలో ఒకటిగా మత గ్రంథాలు తెలుపుతున్నాయి. పొరుగు వారైన కర్ణాటక వారు అరవ వారు, ఉగాది రోజులు వేరైనా, ఆనాడు ప్రత్యేకంగా వేప వాడతారు. తెలుగువారితో సంపర్కం ఉన్న తావులలో వారిలాగే వేప పువ్వులు ఉగాది పచ్చడికి వినియోగిస్తారు.ఇక మాళవ, మహారాష్ట్ర, వంగ దేశస్తులు ఉగాది నాడు వేపపువ్వు కాకుండా వేపాకులను వాడతారు. మాళవ దేశస్థులు ఉగాది నాడు, వేపాకులను ముద్దగా నూరి సేవిస్తారు. వంగ దేశస్థుల ఉగాది తెలుగు వారి కంటే నెల రోజుల అనంతరం రావడం చేత, వేపపువ్వు అప్పటికి అరుదుగా లభించే కారణంగా వేపాకు వాడతారు. తెలుగునాట ఉగాది నాటికి వేపచెట్లు, ముమ్మరంగా పోతపోసి ఉంటాయి. అందుకే మన పూర్వీకులు వేప వృక్ష సంబంధిత కొత్త చిగుళ్ళను ఉగాది పర్వదినాన తినడాన్ని నిర్ణయించారు. వేప పువ్వు పచ్చడి ఉగాది నాడు మాత్రమే తినడమే కాదు, దాని లభ్యతను బట్టి విశేషంగా సేకరించి, ఎండబెట్టి ఉంచుకొని, ఏడాది పొడుగునా వేయించుకుని కూరలో, పచ్చడి గానో చేసుకుని, దానితో చారు కాచుకొని సేవిస్తూ, రక్తశుద్ధి, రక్త వృద్ధిని కలిగించుకోవడం, ఆరోగ్య కాముకుల ఆచరణ. “ఉగాది పండుగ నాడు ఏమి చేస్తే, ఏడాది పొడవునా అదే చేస్తుంటారు” అనే నానుడి, వేపపువ్వు వాడకం విషయంలో వాస్తవమే అనిపిస్తుంది.
ఆరోగ్యకరం… నింబ కుసుమ సేవనం
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
RELATED ARTICLES