5.1 C
New York
Sunday, April 2, 2023
HomeLifestyleDevotionalఎనిమిది మంది చిరంజీవులలో ఒక్కడు హనుమంతుడు...

ఎనిమిది మంది చిరంజీవులలో ఒక్కడు హనుమంతుడు…

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

వైశాఖ కృష్ణ దశమి హన్మాన్ జయంతి
……………………………….

రామకిష్టయ్య సంగనభట్ల…
 9440595494
 …………………..

అశ్వథామ బలిర్వ్యాస : హనుమాన్ శ్చ విభీషణ: కృప : పరశురామశ్చ సప్తేతే చిరజీవిన: మార్కండేయస్తు అష్టమ: ప్రోక్త :

అశ్వత్థామ, బలి చక్రవర్తి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, మార్కండేయుడు తదితరులను చిరంజీవులుగా భావిస్తారు.

 ఒక కల్పం… నాలుగు వందల ముప్పయి రెండు మిలియన్ల సంవత్సరాలు జీవించే ఎనిమిది మంది చిరంజీవులలో ఒకరైన హనుమంతుని జయంతి ప్రత్యేకత కలిగి ఉంది. భారతావనిలో వివిధ ప్రాంతాలలో హన్మాన్ జయంతిని వివిధ మాసాలలో జరుపు కుంటారు. ఆంజనేయుడు, హనుమంతుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. ఉత్తర భారత దేశంలో వారణాసిలో సంకట మోచన దేవాలయం, అయోధ్యలో హన్మాన్ గార్హి దేవాలయాలలో ఈ పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో \మార్గళి\ మాసం అనగా డిసెంబర్ లేదా జనవరిలలో జరుపు కుంటారు. ఒరియా క్యాలెండర్ ప్రకారం విషుభ సంక్రాంతి మొదటి రోజున వైశాఖంలో పాటించే ఆచారం ఉంది. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటకలలో వైశాఖ కృష్ణపక్ష మందు పెద్ద హన్మాన్ జయంతిగా జరుపుకునే సాంప్రదాయం ఉంది. చైత్ర పౌర్ణమి (చిన్న హన్మాన్ జయంతి)తో ప్రారంభించి, హన్మాన్ దీక్షలను వైశాఖ కృష్ణ పక్ష దశమి (పెద్ద హన్మాన్ జయంతి)కి ముగిసేలా 41రోజుల మండల దీక్షలను చేపట్టడం ఆనవాయితీగా, సాంప్రదాయ సిద్దంగా వస్తున్నది. ప్రధానంగా రామాయణంలో హనుమంతుని పాత్ర అద్వితీయం. రామాయణంలోని ఆరు కాండల్లోని చివరి మూడు కాండల్లో కథ నడిచిన మహనీయుడు హనుమంతుడు. హనుమంతుని స్తుతించే హనుమత్కవచాన్ని ఆంజనేయాలయంలో లక్ష ఇరవై అయిదు సార్లు పఠించిన వారికి గాలిలో ఎగిరే శక్తి, ఆణిమాద్యష్టసిద్ధులు లభ్య మవుతాయని నమ్మకం. ప్రేతపతి అయిన శివునికి ఎంత భూతాల మీద ఆధిపత్యం ఉందో హనుమంతునికి అట్టిది కలదని భావిస్తారు. పంచభూతాలను వశం చేసుకున్న పరమాత్ముడు ఆయన.. జ్ఞానేంద్రియాలను నియంత్రణలో ఉంచుకోగలిగిన మహాశక్తిశాలి. అందుకే గ్రహ పీడకు ఆంజనేయుని కొలుస్తారు. ఉన్మాద రోగాలకు ఆంజనేయ ప్రదక్షిణలు చేస్తారు. చిన్న పిల్లలకు ఆంజనేయ బొమ్మ చెక్కిన యంత్రపు బిళ్ళలను మెడలో కడుతారు. పిల్లలు, పెద్దలు ఆపత్సమయాలలో, భయం కలిగే వేళలలో ఆంజనేయ దండకం చదువడం చిరకాలంగా అనుసరిస్తున్న సంప్రదాయం. శివాజీ గురువైన సమర్ధ రామదాసు హనుమంతుని భక్తుడు కాగా, మహారాష్ట్రుల జెండా మీద గదాపాణియైన హనుమంతుడు ఉంటారు. పాండవ మధ్యముడైన అర్జునుని జెండాపై ఉపవిష్ణుడై హనుమంతుడు మహా భారత యుద్ధంలో అర్జునునికి రక్షణగా ఉన్న గాధ అందరికీ తెలిసిందే. 

హనుమంతుడికి స్వర్గ ప్రాప్తి లభించినా, పవనసుతుడు అందుకు అంగీకరించక, తాను భూమిపైనే రాముడి భక్తుడిగా కలకాలం ఉండిపోతానని కోరుకుంటాడు. అందుకు శ్రీ రాముడు కూడా ఒప్పుకుంటాడు. ఈ కారణంగానే భూమిపై రాముడిని ఇప్పటికీ భజనలు, కీర్తనలతో కొలుస్తున్నారు. ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న ఆంజనేయుడు, అవతార పురుషుడు అయిన శ్రీ రాముడినే తన హృదయంలో బంధించి భక్తిలో ఎవరికీ సాటి లేదని చాటాడు. హనుమంతుడు సీతా రాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూ మతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దైవంగా నిత్య పూజలు అందుకుంటున్నాడు. ప్రతి గ్రామానికీ ఆయన క్షేత్ర పాలకుడు. అంటే గ్రామ రక్షకుడు. 

భగవద్దాసులలో సాటిలేని ఆంజనేయుని పూజకు ఉద్దిష్టమైన చైత్ర పూర్ణిమతోపాటు, వైశాఖ బహుళ దశమి నాడు కూడా ప్రత్యేక ఆర్చనలు, పూజాదులు నిర్వహించడం సదాచార సాంప్రదాయంగా వస్తున్నది. రావణుని బారి నుండి శనిని ఆంజనేయుడు కాపాడుతాడు. అందుకు రుణపడిన శనీశ్వరుడు.. హనుమంతుడిని సేవించేందుకు ఉద్యుక్తుడవుతాడు. అయితే తన భక్తులకు శని ప్రభావం లేకుండా చూడాలని శనీశ్వరుడిని హనుమ అడుగుతాడు. అప్పటి నుంచి హనుమంతుడిని కొలిచేవారిపై శని చెడు ప్రభావం ఉండదనే విశ్వాసంతో, శని దేవుని పూజించేవారు తప్పనిసరిగా అంజన్నను కొలుస్తారు. 

అసమాన భక్తాగ్రేసరుడు, ఆదర్శ పురుషుడు, నమ్మిన బంటు, సంస్కృతాద్యనేక భాషలు, వ్యాకరణాది శాస్త్రాలు, సంగీతాది కళలలో నిష్ణాతుడు అయిన చిరంజీవి ఆంజనేయుని నమ్ముకొని, భక్తి శ్రద్ధలతో, 
హనుమాన్ చాలీసా రోజూ పఠిస్తే శని చెడు ప్రభావం సోకదని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments