ఆంద్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా హంసల దీవిలో వెలసిన శ్రీవేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా మాఘ శుద్ధ నవమి నుండి బహుళ పాడ్యమి వరకూ నిర్వహిస్తారు. అందులో భాగంగా స్వామివారి వైభవంగా కళ్యాణోత్సవం ఈనెల 15న మంగళ వారం ఘనంగా నిర్వహిస్తారు. కృష్ణానది సముద్రంలో కలిసే పవిత్ర సంగమ ప్రదేశం హంసలదీవి. దాదాపు వెయ్యేళ్ల క్రితం నిర్మించిన కృష్ణా జిల్లా కోడూరు మండలం హంసలదీవి గ్రామంలో రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి నిత్య పూజలందుకుంటు, భక్తులను అనుగ్రహిస్తున్న వేణుగోపాల స్వామి దేవాలయం ప్రత్యేకతను సంతరించుకుంది. వేణుగోపాల స్వామికి నెలవై, పవిత్రమైన పుణ్య క్షేత్రంగా, పవిత్ర స్థలంగా భావించ బడుతున్న ఆలయాన్ని దగ్గరలో ఉన్న సాగరంలో కృష్ణానది క్షేత్రంలో స్నానం ఆచరించిన అనంతరం అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. హంసల దీవికి సంబంధించి ఓ పురాణ కథనం ప్రచారంలో ఉంది. పాపులకు సంబంధించిన పాపాలను ప్రక్షాళన చేస్తున్న కారణంగా గంగానది మలినమైపోయి, తన దుస్థితిని శ్రీహరికి విన్నవించు కోగా, విష్ణుమూర్తి గంగాదేవిని కాకి రూపంలో సకల పుణ్యతీర్థాలలో స్నానమాచరించమనీ, ఏ క్షేత్రంలో తను హంసగా మారుతుందో అది మహోన్నతమైన దివ్యక్షేత్రమై అలరారుతుందని, హంసగా మారాక తిరిగి ఎప్పటిలానే పవిత్రతతో ప్రవహించమని వైకుంఠ నాథుడు చెప్పినట్లు పురాణ కథనం.సకల పుణ్య తీరాలలో స్నానం చేస్తూ వెళుతున్న కాకి కృష్ణవేణి సాగర సంగమం చేసే ప్రదేశంలో మునిగి లేవగానే హంసగా మారిపోయింది. అందుకే ఇది హంసల దీవిగా పేరుపొందిందని స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. అద్భుత శిల్పకళకు అద్దం పడుతున్న వేణు గోపాలస్వామి ఆలయాన్ని సముద్రపు ఆటు పోట్లు తట్టుకునే విధంగా నిర్మించారు. శ్రీవేణు గోపాలస్వామి ఆలయాన్ని దేవతలు నిర్మించారని స్థల పురాణం ఆధారం. ఒక్క రాత్రిలోనే నిర్మాణం పూర్తిచేసే సంకల్పంతో, నిర్మాణం చేపట్టి గోపురం నిర్మిస్తుండగా తెల్ల వారడం వలన దేవతలు వెళ్లి పోయారని, అందుకే గాలిగోపురం కాలేదని చెపుతారు. తరువాత ఇక్కడ అయిదు అంతస్తుల గాలి గోపురం నిర్మించారు. పరమ హంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామిచే 1977లో అది ప్రారంభించ బడింది. శ్రీవేణుగోపాలస్వామి ఆలయం మౌర్య చక్రవర్తుల పాలనా కాలంలో నిర్మాణం పూర్తయి ఉండవచ్చని చరిత్రకారుల భావన. ఆలయ ముఖ మండప స్తంభాల మీద అనేక శాసనాలు ఉన్నాయి. ఇక్కడ మాఘ పౌర్ణమి నాడు ప్రత్యేకమైన పూజలు, మహోత్సవాలు, అన్నదా న కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆలయంలోని శ్రీవేణు గోపాల స్వామి పిలిస్తే పలుకు తాడని భక్తులు విశ్వసిస్తారు.కాకర పర్తి గ్రామంలో బయటపడిన శ్రీవేణుగోపాల స్వామిని హంసల దీవికి తెచ్చి ప్రతిష్ఠించారు. అయితే ప్రపంచంలో ఎక్కడా కనిపించని విధంగా ఈ విగ్రహం నీలమేఘ ఛాయలో ఉండడం విశేషం. దేవాలయ కుడ్యాలపై అందంగా చెక్కిన రామాయణ సంబంధ ఘట్టాలు భక్తులను ఆకట్టు కుంటాయి.కళ్యాణోత్సవం ముందు రోజు ఉదయం స్వామి వారిని శాస్త్రోక్త పద్ధతిలో పెళ్ళి కుమారుని చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి, తెల్ల వారి ఉదయం శ్రీ రాజ్యలక్ష్మి అమ్మ వారికి కుంకుమ పూజను, రాత్రికి స్వామి వారి కళ్యాణం నిర్వ హిస్తారు. పౌర్ణమినాడు రథోత్సవం మరునాడు చక్రస్నానం ఆదిగా సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
