గ్రీన్‌ఫీల్డ్‌ హైవే సర్వే ఉద్రిక్తం –

Date:


– రెండు గ్రామాల నిర్వాసితుల దిగ్బంధం
– ఇండ్ల నుంచి రాకుండా పోలీసుల మోహరింపు
– రైతుసంఘం నేతలు ఎక్కడికక్కడ అరెస్టు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/ చింతకాని
గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణం కోసం ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో మంగళవారం నిర్వహించిన భూ సేకరణ సర్వే ఉద్రిక్తతకు దారితీసింది. ఈనెల 28వ తేదీలోగా సర్వే పూర్తి చేయకపోతే నోటిఫికేషన్‌ రద్దవుతుందనే పేరుతో అధికారులపై ప్రభుత్వం వైపు నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో కుండపోతగా వర్షం కురుస్తున్నా కొదుమూరు, వందనం గ్రామాల్లో సర్వే నిర్వహించారు. ఆదివారం నాడు సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకోవడంతో మంగళవారం ఖమ్మం, వైరా సర్కిళ్ల పరిధిలోని 300 మందికి పైగా పోలీసులను మోహరించి సర్వే చేపట్టారు. రైతులకు మద్దతుగా వస్తున్న సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఐ(ఎం) చింతకాని మండల కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, మండల కమిటీ సభ్యులు ఉపేందర్‌ను అరెస్టు చేసి కొణిజర్ల పోలీసుస్టేషన్‌కు తరలించారు.
రెండు ఊళ్ల దిగ్బంధం..
ఉదయాన్నే కొదుమూరు, వందనం గ్రామాలను పోలీసులు చుట్టుముట్టారు. నిర్వాసిత రైతుల ఇళ్లు, రోడ్లపైన మరికొందరు పహారా కాశారు. రైతులు ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. రెండు గ్రామాల నుంచి వెళ్లే దారులన్నీ బారికేడ్లతో మూసివేశారు. అటుగా వచ్చిన ప్రతి ఒక్కరినీ ఎవరు? ఏమిటి? అని ఆరా తీశారు. వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలను సైతం అన్ని వివరాలు తెలుసుకున్నాకే అనుమతించారు. వాహనాలపై వచ్చేవారి ఆధారాలను తనిఖీ చేశారు. ఐడీ కార్డులను పరిశీలించారు. రైతుసంఘాలు, వివిధ పార్టీల నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఉన్నతాధికారుల నుంచి సీరియస్‌ ఆదేశాలు రావడంతోనే ఈ సర్వే చేస్తున్నామని, ఎట్టిపరిస్థితుల్లో ఎవరు అడ్డుపడినా సర్వే ఆగదని ముందుగానే అధికారులు వివిధ పార్టీలు, రైతుసంఘాల నేతలకు చెప్పారు. జోరు వాన, మోకాళ్లలోతు బురదలోనూ సర్వే కొనసాగించారు.
అరెస్టులు.. అడ్డగింతలు..
తెలంగాణ రైతుసంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబుతో పాటు మరికొందరిని ఖమ్మం శివారు పుట్టకోటలోనే పోలీసులు అడ్డగించి, వెనక్కు పంపారు. సీపీఐ(ఎం)మండల నాయకులను అరెస్టు చేసి, కొణిజర్ల స్టేషన్‌కు తరలించారు. అడిషనల్‌ డీసీపీ సుభాష్‌చంద్రబోస్‌ ఆధ్వర్యంలో ఖమ్మం రూరల్‌ ఏసీపీ బస్వారెడ్డి, ఏసీపీలు రవి, నర్సయ్య, రెహమాన్‌, ఖమ్మం, వైరా కమిషనరేట్‌ పరిధిలోని సీఐలు, ఎస్సైలు 300 మంది వరకు పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.
సర్వే నిర్వహణ తీరు…
మండలంలోని కొదుమూరు, వందనం, నాగిలిగొండ, నేరడ, ప్రొద్దుటూరు రెవెన్యూలలో సుమారు 300 ఎకరాలు గ్రీన్‌ఫీల్డ్‌ హైవే కింద సేకరించాలి. వీటిలో కొదుమూరు, వందనం మినహా మిగిలిన గ్రామాల్లో సర్వే పూర్తయింది. ప్రజాభిప్రాయ సేకరణనూ వ్యతిరేకించారు. ఈ రెండు గ్రామాల ప్రజలు ఎంతకూ ఒప్పుకోకపోవడంతో దౌర్జన్యంగా మంగళవారం సర్వే నిర్వహించారు. ఈ సర్వేను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అభిలాష్‌ అభినవ్‌ పర్యవేక్షించారు. ల్యాండ్‌ సర్వే అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసులు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాసరావు, వెంకట్రావు, నేషనల్‌ హైవే అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్‌ దుర్గాప్రసాద్‌, మేనేజర్‌ పద్మ, సైట్‌ ఇంజినీర్లు తేజా, వెంకట్‌, చింతకాని, కొణిజర్ల, ఖమ్మం రూరల్‌ తహశీల్దార్లు మంగీలాల్‌, సైదులు, సుమ, ఇతర రెవెన్యూ సిబ్బంది నిర్వహించారు.
బలవంత భూసేకరణ సరికాదు..
బొంతు రాంబాబు, తెలంగాణ రైతుసంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి
ఓవైపు జోరుగా వర్షం వస్తున్నా ఉదయాన లేచేసరికి రెండు గ్రామాలను పోలీసులు చుట్టుముట్టారు. రెవెన్యూ అధికారులు బలవంత భూసేకరణ చేపట్టారు. ఎకనమిక్‌ కారిడార్‌ పేరుతో అదానీ కోసం చేస్తున్న బలవంతపు భూసేకరణను రైతు ప్రభుత్వంగా చెప్పుకునే కేసీఆర్‌ సర్కారు ఆపాలి. రైతులు మార్కెట్‌ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నా వాటిని లక్ష్యపెట్టకుండా సేకరిస్తున్నారు. కొత్త కలెక్టరేట్‌కు చెల్లించినట్లుగా ఖమ్మానికి సమీపంలో ఉన్న ఈ గ్రామాల భూములకు కూడా పరిహారం చెల్లించాలి.
నిర్బంధించి సర్వే చేస్తున్నారు..
వేముల సతీష్‌, కొదుమూరు
రెండు జాతీయ రహదారులు మా భూమిలో నుంచి వెళ్తున్నాయి. ఉన్న నాలుగు ఎకరాలు పోతున్నాయి. రూ.కోటిన్నర ఎకరం ఉంటే రూ.25 లక్షలు పరిహారం ఇస్తున్నారు. ఇండ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులను పెట్టి బలవంతంగా సర్వే చేస్తున్నారు. రైతులను నిర్బంధించి సర్వే చేయడం న్యాయమేనా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

టీఎస్పీఎస్సీ బోర్డును వెంటనే రద్దు చేయాలి

– కొత్త బోర్డు నియామకం చేసి గ్రూప్‌ 1 పరీక్షలు...

చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా –

– నల్ల బెలూన్లతో ఆందోళననవతెలంగాణ-హైదరాబాద్‌తెలుగుదేశం అధినేత చంద్రబాబను అరెస్టు చేసినప్పుడు...

చంద్రబాబు అరెస్ట్‌పై కేసీఆర్‌ స్పందించాలి –

– మాజీ మంత్రి మోత్కుపల్లి విజ్ఞప్తి– రాజకీయాలకు అతీతంగా స్పందించాలని...

మంచు మనోజ్ కోసం మాస్ మహారాజా

ఓటిటిలో బలంగా ఎదగాలని చూస్తున్న ఈటీవీ లోకల్ గా ఆహాను...