గోరా జీవిత సర్వస్వం హేతు వాదానికే అంకితం

Date:

హేతువాదం అనే తాత్విక విధానాన్ని విశ్వసించి అనుసరించే వారిని హేతువాదులు అంటారు. హేతువు అంటే కారణం అని అర్థం. ఏదైనా ఒక విషయాన్ని గుడ్డిగా విశ్వసించకుండా దానికి కారణాలను అన్వేషించడం లేదా ఆరా తీయడాన్ని హేతువాదం అంటారు. జ్ఞానానికి లేదా ఋజువుకు “హేతువు” లేదా “కారణం” అనేది మాత్రమే నమ్మదగిన ఆధారం అని భావించే తాత్విక ధోరణిని హేతువాదం అంటారు. హేతువాదానికి శాస్త్రీయ దృక్పధం పునాది. మానవుడే కొలమానం, మనిషి అన్నిటికీ మూలం అనే మూలసూత్రాలతో హేతువాదం ఆవిర్భవించింది.

గోరా’గా ప్రసిద్ధులైన గోపరాజు రామచంద్రరావు నాస్తికుడిగా, హేతువాదిగా, గాంధేయవాదిగా తెలుగు వారందరికీ సుపరిచితులు. ఆయన దృష్టిలో ఆస్తికత, హేతువాదం రెండు భిన్న ధ్రువాలు. నేటి సమాజంలో అగ్ర, నిమ్న జాతులనే వర్ణ బేధాలు, అంధ విశ్వాసాలు పెరగటానికి ఆస్తికతే కారణం అని ఆయన గట్టి నమ్మకం. మానవులందరూ ఒకటే అన్న భావం పెరగాలంటే , అది ఒక్క నాస్తికవాదం వల్లనే సాధ్యమని విశ్వసించి, నాస్తికభావాల ప్రచారం కోసం తన జీవితమంతా వెచ్చించారు గోరా. పెళ్ళికి ముందే సెక్స్ పై అవగాహనలు, కుటుంబ నియంత్రణ, వీటితో పాటు అప్పటి తెలుగు సమాజంలో ఎన్నో విప్లవాత్మక మార్పులను తెచ్చిపెట్టిన ఘనత గోరాదే.

గోరా ప్రస్తుత ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న ఛత్రపూర్ అనే కుగ్రామంలో, 1902, నవంబరు 15 న ఉన్నతకుల హిందూ కుటుంబంలో వెంకట సుబ్బారావు, రాజ్యలక్ష్మి దంపతులకు జన్మించారు. పర్లాకిమిడిలో ప్రాథమిక విద్యాభాసం పూర్తిచేసిన తర్వాత 1913లో పిఠాపురం రాజా కళాశాల ఉన్నత పాఠశాలలో చదివారు. 1920లో పిఠాపురం రాజా అనుబంధ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన గోరా, అప్పుడే ప్రారంభమౌతున్న సహాయ నిరాకరణోద్యమంలో కాలూనారు. 1922లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో వృక్షశాస్త్రంలో బి.ఏ చేశారు. రామచంద్రరావు వృక్ష శాస్త్రంలో డిగ్రీ చదివి, మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో అదే శాస్త్రంలో మాస్టర్ డిగ్రీలో ఉత్తీర్ణుడయ్యారు. 1922 లో సరస్వతిని ఆమె 10 ఏళ్ళ ప్రాయంలోనే వివాహం చేసుకున్నారు. మధురలోని మిషన్‌ కళాశాలలో అధ్యాపకుడిగా చేరాడు. కోయంబత్తూరు వ్యవసాయ కళాశాలలో ప్రత్తి పరిశోధనా సహాయకుడిగా, తర్వాత కొలంబోలోని ఒక కళాశాలలో జీవశాస్త్ర అధ్యాపకునిగా, 1928లో కాకినాడ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు. తాను నడిచే మార్గం తండ్రికి ఇష్టం లేకపోవడంతో 1928 లో భార్య, పిల్లలతో ఇంటిని వదిలేసి వచ్చారు. స్వతంత్ర భావాలుగల గోరా ఎక్కడా ఉద్యోగంలో నిలువలేక పోయారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా లాంటి ఉద్యమాలలో పాల్గొని బ్రిటిష్ ప్రభుత్వపు జైళ్లలో కఠిన శిక్షలు అనుభవించారు. గోరా అనేక రచనలను చేశారు. సంఘం, ఆర్ధిక సమత అనే పత్రికలను నడిపారు. వర్ణవ్యవస్థ, అంటరానితనం మీద తన యుద్ధాన్ని ప్రకటించిన గోరా 1940 లోఆయన భార్యతో కలసి నాస్తిక కేద్రాన్ని, కృష్ణా జిల్లాలోని ఒక గ్రామంలో ప్రారంభించారు. దేశస్వాతంత్ర్యం సందర్భంగా, 1947 లో, కేంద్రాన్ని విజయవాడకు తరలించారు. 1944లో మహాత్మా గాంధీ కోరిక మేరకు అఖిల భారత కాంగ్రేస్‌ ఆర్గనైజర్‌గా అలహాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. స్వాతంత్య్ర సమరయోధుని గానేకాక, సాంఘిక, ఆర్థిక సమానత్వ సాధనకు, మూఢ నమ్మకాల నిర్మూలనకు, ప్రజల్లో శాస్త్రీయ దృష్టిని పెంపొందించ డానికి, వయోజన విద్యా వ్యాప్తికి, కుల, మత తత్వాల నిర్మూలనకు అనితర కృషి గోరా సల్పారు. గాంధీతో నాస్తికత్వంపై చర్చలు జరిపి, అస్పృశ్యతా నిర్మూలన కోసం కృషి చేసారు. దళితుల దేవాలయ ప్రవేశాన్ని, సమష్టి భోజనాలను, వివాహాలను విస్తృతంగా ఆయన నిర్వహించారు.

ఆయనకు తొమ్మిది మంది సంతానం. సంతానానికి ఆయన సందిర్భోచితంగా పేర్లు పెట్టారు. ఉప్పు సత్యాగ్రహం కాలంలో పుట్టినందున లవణం, భారతీయులు చట్టసభలలో నిలిచి గెలిచిన కాలంలో పుట్టినందున విజయం, రెండవ ప్రపంచ యుద్ధకాలంలో పుట్టినందున ఒక కుమారునికి సమరం, మరొక కుమారునికి నియంత. తొమ్మిదవ సంతానానికి నౌవ్ గా పేర్లు పెట్టారు. హిందీ భాషలో నౌవ్ అంటే తొమ్మిది అని అర్ధం. కుమార్తెలు మనోరమ, మైత్రి, విద్య. గోరా 25 ఏళ్ళ వయసు వరకు అస్తికుడే. తరువాత నాస్తిక సిద్ధాంతాలతో జీవితాంతం కృషి సల్పిన గోరా జీవితమే ఒక ఆదర్శం. ఆయన తన భార్యకి గర్భం వచ్చిన ప్రతిసారీ గ్రహణ సమయంలో గర్భవతిగా ఉన్న ఆమెను బయటకి తీసుకొని వెళ్లి తిప్పేవారు. గ్రహణం సమయంలో గర్భిణులు బయట తిరిగినంత మాత్రాన పుట్టబోయే పిల్లలకు గ్రహణం మొర్రి రాదు, అని నిరూపించటానికి.

గోరా తన సంతానం అందరికీ, వారివారి అభీష్టం మేరకు, వర్ణాంతర వివాహాలు ‘నాస్తిక పద్ధతిలో’ జరిపించారు. ప్రముఖ కవి, దళిత కులానికి చెందిన గుర్రం జాషువా కూతురైన హేమలతను, తన కుమారుడైన లవణంకు వివాహం జరిపించిన ఆదర్శవాది గోరా. చెప్పింది చేసి చూపించిన మహనీయుడు ఆయన. 1970 లో బోస్టన్ లోనూ,1974లో హాలండ్ లోని అంష్టర్దాంలో జరిగిన అంతర్జాతీయ హ్యూమనిష్టు మహాసభలలో గోరా పాల్గొన్నారు. తెలుగులో ఒక వార పత్రిక ‘సంఘం’ ను స్థాపించి, దాని ద్వారా తన ఆశయాలను, లక్ష్యాలను ప్రజలలో విశేషంగా ప్రచారం చేశారు. గొప్ప సంఘసంస్కర్త, మానవతావాది, నాస్తిక ఉద్యమ నాయకుడు, హేతువాది అయిన గోరా, 26 -07 -1975 న విజయవాడ లోని నాస్తిక కేంద్రంలో ప్రసంగిస్తూ మరణించారు. గోరా శతజయంతి సందర్భంగా 2002 లో భారత ప్రభుత్వం, తపాలా బిళ్ళను విడుదల చేసింది. నాస్తికత్వం (దేవుడు లేడు), దేవుని పుట్టు పూర్వోత్తరాలు, జీవితం నేర్పిన పాఠాలు, నేను నాస్తికుడిని, సృష్టి రహస్యం, సంఘ దృష్టి, ఆర్ధిక సమానత్వం, నాస్తికత్వం – ప్రశ్నోత్తరాలు, నాస్తికత్వం – ఆవశ్యకత తదితర రచనలు చేశారు. ఆయన కోడలైన శ్రీమతి హేమలతా లవణం తన తండ్రి జాషువా రచనలను వెలుగులోకి తెస్తూ, మామగారైన గోరా స్థాపించిన ‘నాస్తిక కేంద్రాన్ని’ కూడా సమర్ధవంతంగా నడిపారు. ఆమె కూడా 19 -03 -2008 న నాస్తికకేంద్రం, విజయవాడలోనే మరణించారు.

రామకిష్టయ్య సంగనభట్ల... 9440595494
రామకిష్టయ్య సంగనభట్ల… 9440595494

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

ఒక్క ఫైట్ కోసం నాలుగున్నర కోట్లా?

అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్‌కు కూడా...

డ‌బుల్ ధ‌మాకాలు ఎన్ని బాబోయ్

దాని గురించి ఇంకా ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ప‌వ‌ర్ స్టార్...

‘పిక్‌ ఆఫ్‌ ది డే’ ఇద్దరి అభిమానులదీ ఒకే మాట!

మళ్ళీ వీరిద్దరూ కలవడం వెనుక రీజన్‌ ఏమిటి.. అని అందరూ...

మహేష్ మొహమాటం ఫ్యాన్స్ ఇరకాటం

కేవలం మొహమాటం వల్లే మహేష్ ఇలా రిలీజ్ కాని సినిమాలకు...