Tuesday, August 9, 2022
HomeLifestylespecial Editionకళారంగ ఘనాపాఠి గరికపాటి

కళారంగ ఘనాపాఠి గరికపాటి

కళలు సామాజిక ప్రగతికి దోహదం చెయ్యాలని, జనాన్ని చైతన్య స్ఫూర్తితో ముందుకు నడిపించాలని, అందుకు కళలు కరదీపికలు కావాలని ప్రతికరణ శుద్ధిగా నమ్మి ఆ లక్ష్య సాధనకు జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి గరికపాటి రాజారావు. కళ ప్రజాచైతన్యం కోసమేనని నమ్మి, జీవితాన్ని కళకే అంకితం చేసిన ప్రజా కళాకారుడు, ప్రజావైద్యుడు రాజారావు.
నాటకరంగం ద్వారా ప్రజాకళా రంగానికి దిక్సూచిగా నిలచిన వైతాళికుడు డాక్టర్‌ గరికపాటి రాజారావు. తెలుగు నాటక రంగంలో అతి నవీన భావాలతో వినూత్న విలువలను ఆవిష్కరించి తెలుగు నాటక దశను, దిశను మార్చి సామాన్య ప్రజల సాంస్కృతిక సైనికుడిలా నిలచిన కళాస్రష్ట ఆయన. ప్రముఖ నటీనటులు జమున, అల్లు రామలింగయ్యను వెండితెరకు పరిచయం చేసిన ఘనత ఆయనదే.

గరికపాటి రాజారావు (ఫిబ్రవరి 5, 1915 – సెప్టెంబరు 8, 1963) తెలుగు సినిమా దర్శకుడు, నాటకరంగ ప్రముఖుడు, ఆంధ్ర ప్రజానాట్య మండలి వ్యవస్థాపకులు. ప్రజానాట్య మండలి సాంఘిక నాటకాలకు పెద్దపీట వేసింది. ఈ నాటక సంఘం ద్వారా అనేకమంది ప్రతిభా వంతమైన కళాకారులు పరిచమయ్యారు. చెప్పికోదగిన వారిలో దేవిక, అల్లు రామలింగయ్య, సంగీత దర్శకులు మోహన్ దాస్, టి.చలపతిరావులు, నృత్యదర్శకుడు వేణుగోపాల్, రచయితలు సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు, బుర్రకథ కళాకారుడు షేక్ నాజర్ ఉన్నారు.

రాజారావు 1915 ఫిబ్రవరి 5వ తేదీన రాజమండ్రిలో గరికపాటి కోటయ్య, దేవరా రామలింగమ్మల దంపతులకు జన్మించారు. చిన్నప్పుడే కాకినాడలోని ఆదిభట్ల నారాయణదాసు హరికథకు వెళ్లి, పాటకు తగిన తాళం వేసి తన ప్రతిభను నిరూపించుకుని అభినందనలు పొందారు. చదువు కుంటున్న రోజుల్లో విచిత్ర వేషధారణలో ఆసక్తి చూపించిన రాజారావు, హరిశ్చంద్ర నాటకంలోనూ ఓ వేషం ధరించి పాఠశాల అధ్యాపకుల మెప్పు పొందారు. తరువాత విజయ నగరంలో మేనమామ సుబ్రహ్మణ్యం ఇంట చేరి ఎస్ఎస్ఎల్‌సి పూర్తి చేశారు. రాజారావుకు 15వ ఏటనే నాగేశ్వరమ్మతో వివాహం జరిగింది. తండ్రి ఉద్యోగం చేసిన సికిందరా బాదు లాలాగూడ వర్క్‌షాపులో చిన్న గుమాస్తాగా జీవనం సాగిస్తూ, పై ఉద్యోగి పీడన భరించలేక దానికి రాజీనామా చేసి 1937లో మద్రాసు చేరారు. మద్రాసులో ఎల్‌.ఐ.యం చదువుతున్న రోజులో పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి (పుచ్చలపల్లి సుందరయ్య సోదరుడు) డాక్టర్‌ రామదాసు ఆయనకు ప్రాణ స్నేహితులు. అలాంటి స్నేహ వాతావరణ ప్రభావం వలన రాజారావు మార్క్సిస్ట్సు రాజకీయ ఉద్యమాలవైపు ఆకర్షితులయ్యారు.

మద్రాసలో చదువుతున్నప్పుడే సహ విద్యార్థులతో కలిసి గుళ్లపల్లి నారాయణ మూర్తి రచించిన విడాకులు నాటకానికి దర్శకత్వం వహించాడు. మద్రాసులో రాజారావు దర్శకత్వంలో ప్రదర్శించిన షాజహాన్ నాటకం సంచలనాన్ని సృష్టించింది. షాజహాన్‌గా ఎస్‌విఆర్ సాంబశివరావు, జహనారాగా డాక్టర్ కొర్రపాటి గంగాధరరావు, ఔరంగజేబుగా రాజారావు అద్భుతంగా నటించి పలువురి ప్రశంసలు పొందారు. ఆ నాటకంలో రాజారావుకు సుప్రసిద్ధ నటుడు రూపశిల్పి దేవీప్రసాద్ రాయ్ చౌదరి మేకప్ చేయడం విశేషం. మద్రాసులో విద్యార్థులను సమీకరించి భమిడిపాటి బాగుబాగు, గాలి బాల సుందరరావు అపోహ వంటి నాటకాలను ప్రదర్శించారు.

వృత్తి రీత్యా వైద్యుడైన రాజారావు ఉచితంగా వైద్య సేవలు అందించడానికి విజయవాడలోని పోరంకిలో ప్రజా వైద్యశాల నెలకొల్పి ఫీజులు తీసుకోకుండా మందులు కూడా తనే కొనుగోలు చేసి ఉచితంగా రోగులకు సేవ చేసేవారు. కొంతకాలం రాజమండ్రి లోనూ ప్రజావైద్యశాల నిర్వహించారు.

రాజారావు 1953లో పుట్టిల్లు సినిమాను స్వయంగా నిర్మించి దర్శకత్యం వహించారు. ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు జమున, అల్లు రామలింగయ్యను వెండితెరకు పరిచయం చేశారు. పుట్టిల్లు సినిమాలో వివిధ నటులు తమ నటనకు ప్రశంసలందుకున్నా ఈ సినిమా ఆర్థికంగా లాభించ లేదు. దానితో రాజరావు ఆర్థికంగా దెబ్బతిని అప్పుల పాలయ్యారు. కానీ వృత్తిరీత్యా వైద్యుడైన రాజారావు సంఘసేవ మాత్రం ఆపలేదు. ఒక్క రూపాయికి వైద్యం చేసిన సేవా తత్పరులు. పేదవారికి ఉచితం వైద్యం చేస్తుండేవారు.

ఆ తరువాత ఈయన 1962లో విడుదలైన ఆరాధన వంటి సినిమాల్లో చిన్నాచితక పాత్రలు కూడా పోషించారు. ఆరాధనలో రాజశ్రీకి తండ్రి షావుకారు పాత్ర వేశారు. జైభవానీ నాటకాన్ని ప్రదర్శించే సమయంలో గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థులయ్యారు. అదే సమయంలో దేవుడుచేసిన మేలు చిత్రాన్ని నిర్మించినా ఆర్థిక కారణాలవల్ల ఆ చిత్రం విడుదల కాలేదు. మానసికంగా కుంగిపోయిన రాజారావు 1963 సెప్టెంబరు 8న మద్రాసులో మరణించారు.Garikapati Raja RaoGarikapati Raja RaoGarikapati Raja RaoGarikapati Raja Rao

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments