ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా, గోదావరి నది గణనీయంగా పెరిగింది. జులై మాసంలో గత ఏడాది వలె విరామం లేకుండా భారీ వర్షాలు కురుస్తుండడం చేత, నది ఎగువ ప్రాంతాల నుండి నదిలో క్రమేపి వరద నీరు చేరుతున్న కారణంగా గోదావరి నీటిమట్టంలో గంటగంటకూ, మార్పు చోటు చేసుకుంటున్నది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోనికి భారీగా చేరిన ఇన్ ఫ్లో గణనీయంగా పెరగగా, తదనుగుణంగా ఇన్ ఫ్లో బట్టి అవుట్ ఫ్లో కొన సాగిస్తున్నారు. కడెం నుండి 700 అడుగుల గరిష్ఠ స్థాయికి గాను, 696.500 అడుగుల ఎత్తుకు నీటిని స్థిరంగా ఉండేలా క్రమానుగతంగా 14గేట్లను ఎత్తడం ద్వారా గరిష్టంగా 1,76,489 క్యూసెక్కుల నీటిని ఉదయం నుండి వదిలారు. కడెం ద్వారా వరద నీటిని గోదావరి నది లోనికి వదలడంతో, సదరు నీరు ధర్మపురికి క్రమానుగతంగా చేరి, నీటి మట్టం అనుక్షణం పెరుగుతోంది. శుక్రవారం జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా వరద పరిస్థితిని అనుక్షణం తెలుసుకుని సంబంధిత అధికారులకు తగు చర్యలకై సూచనలు అందించారు.
జిల్లా కలెక్టర్ రవి గుగులోత్ ఆదేశాల మేరకు సమాచారం అందుకున్న ధర్మపురి తహశీల్దార్ వెంకటేశ్, మున్సిపాలిటీ కమిషనర్ రమేష్, సీఐ రమణ మూర్తి, ఎస్ఐ దత్తాత్రి, తమ సిబ్బందిని సమన్వయ పరిచే విధంగా ఉపక్రమించి, అనుక్షణం సమాచారాన్ని ప్రాజెక్టుల అధికారుల ద్వారా తెలుసుకుని, ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తూ, దేవస్థానం పక్షాన మైకులలో ప్రకటింప చేస్తూ, తీరవాసులను అప్రమత్తం చేసే చర్యలు గైకొన్నారు. గోదావరి నదిలో, భక్తుల స్నానాలను క్రమబద్దీకరించి,
, నది ప్రవాహం వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. తీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్, స్వయంగా గోదావరి నది వద్దకు చేరుకుని, వరద పరిస్థితిని చూసి, సమీక్షించి అధికారులకు సూచనలు చేశారు.
రాత్రి సమయానికి నదీ ఒడ్డున గల సంతోషిమాత ఆలయం కింద నీరు చేరగా, పుష్కర స్నాన ఘట్టాల పైనుండి నీరు ప్రవహించింది.
