నేడు మనం వాడుతున్న ఫోన్లకు మాతృక అయిన “టెలిఫోన్” అనేదాన్ని కనిపెట్టింది అమెరికాకు చెందిన “అలెగ్జాండర్ గ్రాహెంబెల్” అని మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. టెలీ ఫోను అంటే… టెలీ అనగా దూర, ఫోను అంటే వాణి… దూరవాణి అని అర్థం. ఇది సాధారణంగా ఇద్దరు, మరికొన్ని సమయాలలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది సంభాషించు కునేందుకు ఉపయోగిస్తుంటారన్న సంగతి మనకు తెలిసిందే. అలెగ్జాండర్ గ్రాహెంబెల్ స్కాట్లాండులోని ఎడిన్‌బర్గ్ అనే ప్రాంతంలో మార్చి 3, 1847వ సంవత్సరంలో జన్మించాడు. ఆయన తండ్రి పేరు అలెగ్జాండర్ మెల్‌విల్లే బెల్ (ప్రొఫెసర్) కాగా, తల్లి పేరు ఎలిజా గ్రేస్ గ్రాహెంబెల్. చిన్న వయసు నుంచే సహజంగానే అనేక విషయాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా గ్రాహెంబెల్ కు ఆ రోజుల్లోనే పరిశీలనా శక్తి అధికంగా ఉండేది. తన పక్కింట్లో నివాసముండే తన స్నేహితుడు బెన్ హెర్డ్‌మెన్ సహాయంతో గ్రాహెంబెల్ 12 ఏళ్ల ప్రాయంలోనే “ఇన్వెంట్” అనే పేరుతో చిన్న వర్క్‌షాప్‌ను నిర్వహించాడు.
తల్లి క్రమేణా వినికిడి శక్తిని కోల్పోవడంతో ఆమెతో మాట్లాడే క్రమంలో సంజ్ఞలతో భావ వ్యక్తీకరణలో ఆరితేరాడు. ఆమె నుదిటి ఎముకకు దగ్గరగా ఒక రకమైన ఉచ్ఛారణతో మాట్లాడే ప్రయత్నంలో ధ్వని శాస్త్రాన్ని అర్థం చేసుకున్నాడు.
బెల్‌లోని విజ్ఞాన తృష్ణకు తల్లి చెవిటితనం కూడా ఓ కారణం. ఆపై ఎడింబరో విశ్వ విద్యాలయంలో ధ్వని, వినికిడి శాస్త్రాలు చదివి అమెరికాలోని బోస్టన్ విశ్వ విద్యాలయంలో ‘గాత్ర సంబంధిత శరీర శాస్త్రం’ (వోకల్ ఫిజియా లజీ)లో ప్రొఫెసర్‌గా చేరాడు. భార్య సైతం వినికిడి శక్తిని కోల్పోవడంతో బధిరుల కోసం పరిశోధనలు చేసి, వారు వినగలిగే శబ్ద పరికరాలను రూపొందించాడు. పగలంతా బోధిస్తూ, రాత్రంతా మేలుకుని ప్రయోగాలు చేసేవాడు. ఆ కృషి కారణంగానే తీగల ద్వారా శబ్ద తరంగాలను పంపగలిగే టెలిఫోన్‌ను కనిపెట్ట గలిగాడు.
లోహపు తీగ చుట్టబడిన ఒక శాశ్వత అయస్కాంతం దగ్గర పల్చని ఇనుప రేకును కంపింపజేస్తే, కంపనాల తీవ్రతకు అనుగుణంగా తీగలో విద్యుత్ ప్రవాహం ఏర్పడు తున్నట్లు బెల్ కనుగొన్నా డు. శబ్దాన్ని ప్రసారం చేయటానికి ఈ సిద్ధంతం బాగా ఉపకరిస్తుందని గ్రహించాడు. ధామస్ వాట్సన్ అనే మెకానిక్ తో బాటు దీనికి సంబంధించిన ప్రయోగాలు చేసుకుంటూ అతడు పచ్చిక బయళ్ళలో, మైదానాల్లో, బీడు భూముల్లో తిరుగుతుండే వాడు. జీవితంలో ఎన్నో ఒడిదుడు కులు, అపజయం వెక్కిరించాయి. ప్రోత్సహించేవారు కరువయ్యారు. ఎటు చూసినా నిరాశా నిస్పృహలే తారసిల్లాయి. టెలిఫోన్ ద్వారా నోటిమాటల్ని దూర ప్రదేశాలకు అందించే కృషి చేస్తున్నానని చెబితే నలుగురు నవ్విపోతారేమో అని భయ పడుతూ అజ్ఞాతంగా కాలం గడిపేవాడు. కాబోయే మామ కూడా ఇది అంతా ఒక పగటి కల అని కొట్టి పారేశాడు.
1875 జూన్ లో ఒకరోజు వర్క్ షాప్ కి ఇటూ, అటూ ఉన్న రెండు గదుల్లో ప్రసారిణి, రిసీవర్ లను వుంచి వెల్, వాట్సన్ ప్రయోగాలు చేస్తుండగా ఒకదాని ఇనుపరేకు అయస్కాంతానికి అతుక్కు పోయింది. దాన్ని లాగాలని వాట్సన్ ప్రయత్నించినపుడు బెల్ వద్ద వున్న ఇనుపరేకు కూడా కంపించసాగింది. ఇనుపరేకు దగ్గర చెవి ఉంచగా శబ్దం కూడా వినబడింది. ఒక పక్క ఇనుపరేకును అయస్కాంతానికి చాలా దగ్గరగా ఉంటే ప్రయోగ ఫలితాలు సంతృప్తి కరంగా ఉంటాయని వాళ్ళూ గ్రహించారు. ఇలా కొన్ని నెలలు కృషి చేశాక మొదటి పటిష్ఠమైన టెలిఫోన్ నిర్మించారు. బాటరీ అవసరం లేకుండా ప్రసారిణిలో ఉత్పత్తి అయ్యే అల్ప విద్యుత్ వల్లనే ఇది పనిచేయసాగింది.
1876 మార్చి 10న టెలిఫోన్ ప్రసారిణి బెల్ ఇంటి రెండో అంతస్తు లోనూ, రిసీవర్ ని మొదటి అంతస్తు లోనూ, అమర్చి బెల్ ఫోన్ లో ఇలా మాట్లాడాడు.—“మిస్టర్ వాట్సన్, మీతో పనుంది, పైకి రండి” —. ఫోన్ లో మాట్లాదిన తొలి పలుకులుగా ఈ పదాలు ప్రసిద్ధి కెక్కాయి. ఒకటి రెండు నిముషాల్లో మెట్లెక్కి రొప్పుతూ, రోజుతూ వాట్సన్ బెల్ వద్దకు పరుగెత్తి వచ్చి “ఫోన్ పనిచేస్తుంది. మీ మాటలు నాకు వినబడ్డాయి.”—అని అరిచాడు.
ఇలా కనిపెట్టినదే టెలీఫోను. దీనిని 1876 మార్చి 10న గ్రాహెంబెల్ మొదటిసారిగా ఉపయోగిస్తూ, వాట్సన్‌తో మాట్లాడారు. దీనిపై 1876లో ఆయనకు లభించిన పేటెంట్ అమెరికాలోనే శాస్త్రరంగంలో మొదటిది.
గ్రహంబెల్ ను చాలామంది టెలిఫోన్ ఆవిష్కర్తగా గుర్తుంచుకున్నా ఆయన వివిధ రంగాలలో ఆసక్తిని కనబరచాడు. ఆప్టికల్ టెలి కమ్యూ నికేషన్స్, హైడ్రోఫాయిల్స్, ఏరోనా టిక్స్ రంగాల్లో కూడా అనేక ఆవిష్కరణలు చేశాడు. నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ వ్యవస్థాప కుల్లో గ్రాహంబెల్ కూడా అయన ఒకరు.
1880 వ సంవత్సరంలో టెలిఫోన్ ఆవిష్కరణకు గాను ఫ్రెంచి ప్రభు త్వం ప్రధానం చేసే వోల్టా పురస్కా రాన్ని గెలుచుకున్నాడు. దీని విలువ 50,000 ఫ్రాంకులు ( సుమారు 10,000 డాలర్లు).
తన జీవిత కాలమంతా రకరకాల పరిశోధనలతో గడిపిన గ్రాహెంబెల్ తన 75 సంవత్సరాల వయసులో చక్కెర వ్యాధికి గురై, 1922 ఆగస్టు 2వ తేదీన మరణించాడు.
