అది భారత దేశపు రాజధాని. వివిధ పాలకుల ఎలుబడులలో మహోన్నత వైభవానికి ఉత్తుంగ శిఖరంలా నిలిచిన ఢిల్లీ నగరమది. భారతీయ ప్రాచీన సభ్యతా సంస్కృతులకు, సాంప్రదాయాలకు, వారసత్వాలకు, ఆచార వ్యవహారాలకు విభిన్న జాతులకు, మతాలకు, కులాలకు వేలాది సంవత్సరాల సాక్షీభూతంగా నిలిచి ఉంది. సహస్రాభ్దుల కాలగమనంలో ఎన్నో ఉత్థాన పతనాలను అనుభవించింది. 42.7 చదరపు కి.మీ. విస్తీర్ణం కలిగిన ప్రస్తుత క్రొత్త ఢిల్లీ, మెట్రోపాలిత ప్రాంతంలో, భారత ప్రభుత్వ కేంద్రపాలిత ప్రాంత పరిధిలో ఉంది. యునైటెడ్ కింగ్ డంకు చెందిన వాస్తు నిపుణులు తయారు చేసిన నిర్మాణ నమూనా అధారంగా రూపొందించిన కొత్త ఢిల్లీ 1931 ఫిబ్రవరి 13న దేశ రాజధానిగా ప్రారంభించ బడింది. కొత్త ఢిల్లీ పూర్వాపరాలు ఒక్కసారి మననం చేసుకుంటే…
ఢిల్లీ కేంద్రంగా ఎన్నో వేల సంవత్సరాల చరిత్రలో ఎన్నో సామ్రాజ్యాలు వెలిశాయి, పతన మైనాయి. మహా భారతంలో పాండవుల రాజధాని ఇంద్రప్రస్థం అని ఈ నగరాన్ని ప్రస్తావించారు. 19వ శతాబ్దారంభం వరకు “ఇందర్‌పాత్” అనే గ్రామం ఇక్కడ ఉండేది. బ్రిటిష్‌వారి క్రొత్త రాజధాని నిర్మాణంలో ఆ గ్రామం కనుమరుగు అయింది. క్రీ.పూ. 1000 సంవత్సరాల నాటి రంగువేసిన కూజాలు త్రవ్వకాలలో వెలుగు చూశాయి. పురావస్తు పరిశోధనా సంస్థ (ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) వారి అంచనాల ప్రకారం వేల సంవత్సరాలలో నిర్మించిన చారిత్రిక కట్టడాలు 60,000 పైగా ఢిల్లీలో ఉన్నాయి. ఇటీవలి చరిత్ర లోనే “ఏడు సామ్రాజ్యాల రాజధాని”గా ఢిల్లీని వర్ణిస్తారు.
గంగా – యమునా మైదానానికి… ఆరావళీ – వింధ్య పర్వత శ్రేణులకు మధ్య ప్రాంతంలో క్రొత్త ఢిల్లీ, యమునా నదికి పశ్చిమ భాగాన ఉన్నందున పురాతన కాలం నుండి ఢిల్లీ ప్రధాన వర్తక మార్గాలకు కూడలిగా ఉంది. ఆ సౌకర్యాల కారణంగానే అక్కడ విద్య, సంస్కృతి, రాజ్యాధికారాలు, వర్ధిల్లాయి.
మౌర్యసామ్రాజ్యం కాలం నాటి (క్రీ.పూ. 300) ఆధారాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. అప్పటి నుండి ఢిల్లీ అవిచ్ఛిన్నంగా జనావాసంగా వర్ధిల్లింది. శ్రీనివాసపురి ప్రాంతంలో అశోకుని కాలంనాటి శాసనం 1966లో కనుగొన్నారు. ఫిరోజ్‌షా తుగ్లక్ రెండు అశోకుని కాలం నాటి శాసన స్తంభాలను ఢిల్లీకి తెచ్చాడు. కుతుబ్ మినార్ వద్ద ప్రసిద్ధి చెందిన ఉక్కు స్తంభం గుప్త వంశజుడు కుమార గుప్తుడు క్రీ.శ. 320-540 మధ్యకాలంలో తయారు చేయించ బడింది. దానిని 10వ శతాబ్దంలో ఢిల్లీకి తెచ్చారు.
1857 నుండి, ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం తరువాత, ఢిల్లీ బ్రిటిష్‌వారి అధీనంలోకి వచ్చింది. అప్పుడు బ్రిటిషు వారు కలకత్తా నుండి రాజ్యం చేస్తున్నందు వలన ఢిల్లీ రాజధాని నగరం హోదాను కోల్పోయింది. మళ్ళీ 1911 లో కలకత్తా నుండి రాజధాని ఢిల్లీకి మార్చారు. ఎడ్విన్ లుట్యెన్స్ అనే భవన నిర్మాణ శిల్పి పాత నగరంలో కొంత భాగాన్ని పూర్తిగా కూలద్రోయించి క్రొత్త ఢిల్లీలోని ప్రభుత్వ భవనాల నిర్మాణాన్ని చేయించాడు.
ఆంగ్లేయుల పాలనా కాలమందు డిసెంబరు 1911 వరకూ భారత రాజధాని కలకత్తా నగరం వుండేది. ఆ తరువాత రాజధాని ఢిల్లీకి మార్చ బడింది. కానీ ప్రాచీన కాలం నుండి ఢిల్లీ రాజకీయ కేంద్రముగా వుంటూ వస్తున్నది. ప్రత్యేకంగా మొఘల్ సామ్రాజ్య కాలం నుండి ముఖ్యంగా 1799 నుండి 1849 వరకూ ఢిల్లీ కేంద్రంగా వుంటూ వచ్చింది. 1900 ప్రారంభంలో బ్రిటిష్ పరిపాలనా కాలంలో భారత రాజధానిని, కలకత్తా నుండి ఢిల్లీకి మార్చాలనే ప్రతిపాదన వచ్చింది. కలకత్తా భారత్ కు ఈశాన్య దిశలోనూ, భారత్‌కు చెందిన అనేక ప్రాంతాలకు చాలా దూరంగా వుండేది. ఈ కారణాన బ్రిటిష్ రాజ్ పరిపాలనా సౌలభ్యం కొరకు రాజధానిని ఢిల్లీకి మార్చడమే ఉత్తమమని భావించింది. చక్రవర్తి 5వ జార్జి, భారత రాజధాని, కలకత్తా నుండి ఢిల్లీకి మార్చాలని ప్రకటించాడు.
షాజహాన్ చే నిర్మింపబడిన పాత ఢిల్లీకి దక్షిణాన క్రొత్త ఢిల్లీ ఉంది. క్రొత్త ఢిల్లీ ఏడు ప్రాచీన నగరాల ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలోనే “యంత్ర మందిరం” లేదా జంతర్ మంతర్, లోధీ గార్డెన్స్ మొదలగునవి ఉన్నాయి.
కొత్త ఢిల్లీని బ్రిటిష్ వాస్తు శిల్పులు సర్ ఎడ్విన్ లుటియెన్స్, సర్ హెర్బర్ట్ బేకర్ రూపొందించారు. కొత్త రాజధానిని 10 ఫిబ్రవరి 1931 న వైస్రాయ్ మరియు భారత గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు.
కలకత్తా (ఇప్పుడు కోల్‌కతా) బ్రిటిష్ రాజ్ కాలంలో, డిసెంబర్ 1911 వరకు భారత దేశానికి రాజధానిగా ఉంది. పంతొమ్మిదవ శతాబ్దం చివరి నుండి కలకత్తా జాతీయవాద ఉద్యమాలకు కేంద్రంగా మారింది. ఇది బ్రిటిష్ ఇండియా వైస్రాయ్ లార్డ్ కర్జన్ చేత బెంగాల్ విభజనకు దారి తీసింది. ఇది కలకత్తా…